పూర్వార్థమ్
16
చంచలం హి మనః కృష్ణ - ప్రమాధి బలవ దృఢం
తస్యాహంనిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్ 6-34
అర్జునుడికినరుడని కూడ పేరుంది. నరుడంటే మానవుడే. మానవుడే అడుగుతున్నా డీప్రశ్న. ఏమని. మనసనేది బాగా చంచలమైనది. నిత్యమూ పారాడే స్వభావం దానిది. తంతునాగం లాగా చాలా బలమైనది. దృఢమైనది. అలాంటి రాకాసి మనసు సరికట్టమంటావు నీవు. అది గాలిని మూట గట్టటం లాంటిదని నాకు తోస్తుంది. ఎంతో కష్టపడి గాలిని మూట కడతావు. కాని ఏమి ప్రయోజనం. నీవు కట్టే లోపలే అది తప్పించుకొని పోతుంది. అలాంటిదే ఈ మనసు కూడా.
అంతేకాదు. మరి ఒక చిత్రం కూడా ఉంది ఇందులో. గాలిని మూట కట్టాలనుకునేది గాలి కాదు. మనం ఇక్కడ మనసును కట్టి వేయాలనుకొనేది మనసే అయి కూచుంది. అంచేత ఇది ఇంకా అసాధ్యమైన విషయం.
అయితే అసాధ్యమని ఊరక కూచుంటే సాధన చేయలేము. సాధన చేయక పోతే సంసారంలో నుంచి బయట పడలేము. ఏమిటీ విషయవలయం. ఎప్పటికి దీనికి పరిష్కారమని ప్రశ్న.