పూర్వార్థమ్
15
యోయమ్ యోగ స్త్వయా ప్రోక్త స్సామ్యేన మధు సూదన!
ఏతస్యాహం నవశ్యామి చంచలత్వాత్ స్థితింస్థిరామ్ 6-33
సంసార వలయంలో చిక్కిన మానవుడు మోక్షం సాధించాలంటే సత్పదార్థ మేదో దాన్ని పట్టుకోవాలనీ పరచుకొని ఉన్న చైతన్యమేననీ అది చరాచర పదార్ధాలన్నిటిలో సమానంగా అది కూడా మన స్వరూపమేననీ ఇంతవరకూ ప్రతిపాదించాము. దానినందుకొనే ఉపాయం కూడా బోధించాము సమత్వ రూపమైన అభ్యాస మొక్కటేనని.
అయితే ఈ సమత్వమనేది అభ్యసించగలమా అనేది మనకు పట్టుకొన్న సమస్య. ఇందులో ఉన్న ఇబ్బంది ఏమంటే మానవుడది తన మనసుతోనే సాదించవలసిన క్రియ. మరొకమార్గం లేదు. మనసుతో ముందు సాధిస్తేగాని అది తరువాత మన జీవితంలో ప్రవేశించడు. మరి ఈ మనసు చూస్తే చాలా చపలమైనది, క్షణకాలం ఎక్కడా స్థిరంగా నిలిచేది కాదు. కోతిలాగ ఎప్పుడూ మార్పునే కోరుతుంటుంది. మారకపోతే అసలది మనసే కాదు. సంకల్ప వికల్పాత్మకమని గదా దానిని వర్ణించారు. సంకల్ప వికల్పాలంటేనే మార్పు. అలాంటప్పుడింత అస్థిరమైన మనసుతో సుస్థిరమైన తత్త్వాన్ని ఎలా ఆకళించు కోవాలని ప్రశ్న.
నిజంగా ఇది చాలా గడ్డయిన సమస్యే. సందేహం లేదు. ఎందుకంటే సాధనంవల్లనే సాధ్యమనేది సిద్ధిస్తుంది. దాని పాటికది ఎప్పుడూ సంభవం కాదు. ఇది లోకంలో ఎక్కడ పట్టినా మనం చూచే వ్యవహారమే. మరి ఇక్కడి సమత్వమనేది అలాంటి సాధ్యమైన పదార్థం. దాని కేకైక సాధనం మనసని చెబుతున్నది శాస్త్రం. ఆ మనసింత అయోమయంగా ఉన్నదంటే ఏమిటి గతి. సమత్వమనేది ఎలా సిద్ధిస్తుందనే ప్రశ్న రావడం సహజమే. ఇలాటి ప్రశ్నే వేశాడు కృష్ణ పరమాత్మ నర్జునుడు.