పూర్వార్థమ్
14
యా నిశా సర్వభూతానామ్- తస్యామ్ జాగర్తి సంయమీ
యస్యామ్ జాగ్రతి భూతాని- సానిశా పశ్యతో మునేః 2-69
ఈ ప్రకారంగా సమస్త ప్రపంచాన్నీ తమ శరీర మన, ప్రాణాదులతో సహా బ్రహ్మాకారంగా మార్చుకొని దర్శిస్తూ పోవటమే నిజమైన యోగం. యోగమంటే కలయిక అని అక్షరార్థం. రెండు విజాతీయ భావాలున్నంతవరకూ కలయిక అనేది ఏర్పడదు, తాత్కాలికంగా కలిసినట్టు కనిపించినా ఎలా కలిశాయో అలాగే విడిపోగలవు. సంయోగ ముందంటే వియోగం కూడా ఉండి తీరుతుంది. తిల తండులాలు కలిశాయంటే వాటిని మరలా విడదీయగలం. పాలూ నీరూ కలిసినా యంత్ర సహాయంతో విడగొట్టగలం. కాబట్టి ఇలాంటి కలయిక వల్ల మనకు సుఖంలేదు. వియోగం లేని యోగం కావాలి మనకు.
ప్రస్తుతం బ్రహ్మజ్ఞానికి కలిగే యోగమిలాంటి యోగం. అంతకు ముందు ప్రపంచమనే దొకటి ఉండి దానిని క్రొత్తగా బ్రహ్మాకారంగా దర్శించటం లేదు. జ్ఞాని, అంతకు ముందూ బ్రహ్మ చైతన్యమే ఇది. అయినా అనాది సిద్ధమైన అజ్ఞానంవల్ల ప్రపంచాకారంగా భాసిస్తున్నదా బ్రహ్మం. మరలా జ్ఞాన దృష్టితో ఎప్పుడు దర్శించామో అప్పుడు సర్పమే రజ్జువుగా కనిపించినట్టు ప్రపంచ మంతా తన సహజమైన బ్రహ్మ స్వరూపంతోనే మనకు సాక్షాత్కరిస్తుంది. సహజంగా బ్రహ్మంతో కలిసే ఉన్నది గనుక ఇది క్రొత్తగా ఏర్పడే కలయిక కాదు. అలాగే నామరూపాలనే విశేషాలన్నీ ఒకే ఒక చిదాకారంగా అనుభవానికి వస్తాయి కాబట్టి ఇందులో వైషమ్యమనే వాసనకూడా లేదు. ఒక్క మాటలో సమత్వ రూపమైన యోగమంటే ఇదే.
ఇలాంటి యోగంతో నిరంతరమూ కాలం గడిపే బ్రహ్మవేత్త వ్యవహారమే వేరు. మామూలు లోకుల దైనందిన జీవితాలకీ అలాంటి వ్యక్తి జీవితానికీ హస్తిమశ కాంతర ముంటుంది. మామూలు వాడేది రాత్రి అనుకొని చూస్తాడో జ్ఞాని కది కేవలం పగలు. మరి వాడేది పగలుగా భావిస్తాడో ఈ జ్ఞానికది రాత్రి అట.
ఏమిటీ మాటలకర్థం. అందరూ లోకంలోనే బ్రతుకుతున్నప్పు డొకడికి రాత్రి అయి మరొకడికి పగలెలా అవుతుంది. అలాగే ఒకడికి పగలయి ఇంకొకడికి అదే రాత్రి ఎలా అవుతుంది. అనుభవానికే విరుద్ధం గదా ఇది. అయితే ఎందుకు చెప్పినట్టీమాట. పగలు - రాత్రి అనే శబ్దాల కిక్కడ అహో రాత్రాలని వాచ్యార్దం కాకుండా జ్ఞానమూ - అజ్ఞానమూనని లాక్షణికమైన Meta phonical అర్థం చెప్పుకొంటే సరిపోతుందంటారు కొందరు. అలా చెప్పుకొన్నా చెల్లదు. ఎందు కంటే ఒకరికి పగలైనది ఒకరికి రాత్రి అన్నప్పుడు రాత్రి పగలనే రెండు భావాలూ ఇద్దరికీ చెబుతున్నాడు భగవానుడు. అప్పటికి ఇద్దరికీ జ్ఞానాజ్ఞానాలు వర్తించవలసి ఉంటుంది. ఇక లౌకికుడి కంటే జ్ఞానికి విశేషమేమి చెప్పినట్టు.
కాబట్టి అహో రాత్రాలనే మాటలకిక్కడ చెప్పవలసిన అర్ధం జ్ఞానమూ అజ్ఞానమూ -నని గాదు. రాత్రి అంటే పరమాత్మ తత్త్వమన్నారు భగవత్పాదులు. రాత్రిలాగా అంతా మన కగమ్య గోచరం కాబట్టి పరమాత్మ రాత్రి లాంటిది. ఇలా లోకులందరికీ రాత్రి మాదిరి ఏ మాత్రమూ గోచరం కాకపోయినా మహా యోగి కది పట్ట పగలు లాగా ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తుంటుంది. ఇది ఎలాంటిదంటే ఒక గ్రుడ్లగూబే ఉంది. దానికి పగటివేళ కండ్లు కనిపించవు. మనకంతా ఎంతో స్పష్టంగా ప్రతి ఒక్కటీ కనిపిస్తున్నప్పుడే అది ఏ ఒక్కటీ చూడలేని దుర్దశలో చిక్కుపడి ఉంటుంది. మనకు పగలైతే దాని కదే రాత్రి. అలాగే యోగికి ఎంతో స్పష్టంగా సూర్యరశ్మిలో మాదిరి కనిపించే ఆ బ్రహ్మ తత్త్వం గుడ్లగూబ లాంటి దృష్టి గల లోకుల కేమాత్రమూ అంతుపట్టటం లేదు. గుడ్లగూబకు సూర్య తేజస్సే తమస్సు లాగా భాసించినట్టు మనందరికీ ఆ బ్రహ్మ చైతన్యమే అచేతనమైన జగత్తయి కూచుంది.
పోతే ఇక మన మందరమూ పగలని ఏది చూస్తామో అది బ్రహ్మవేత్తకు రాత్రి అట. ఏమిటి దీని కర్థం. పగలంటే ఇక్కడ నిజంగా వగలు గాదు. మనం పగలని భ్రమ పడుతున్నది. అది ఏదో గాదు. ఈ నామ రూపాత్మకమైన ప్రపం చమే. ఇది మన చుట్టూ పరచుకొని కనిపిస్తుంటే నిజంగానే ఉందని చూస్తు న్నాము. అది కనిపిస్తూ మనం చూస్తూ ఉన్నాము కాబట్టి పగలనే మన భావం. ఇది పగలు గాదు. నిజంలో రాత్రి అంటే మన ముందనుకొని చూచే ఈ చరాచర దృశ్యాలు వాస్తవంలో లేవక్కడ. లేని ప్రపంచాన్నే మన అజ్ఞానం వల్ల ఉన్నట్టు దర్శిస్తున్నాము. దానితో వ్యవహరిస్తున్నాము. ఇది ఎలాంటిదంటే ఒక స్వప్న దృక్కు అనుభవం లాంటిదన్నారు భాష్యకారులు. స్వప్నంలో మనమెన్నో చిత్ర విచిత్ర దృశ్యాలు చూస్తుంటాము. ఎంత మందితోనో వ్యవహ రిస్తుంటాము. అదంతా తాత్కాలికంగా పగలే మనకు. అంత మాత్రాన అది యథార్థమైన పగలు కాదు గదా. రాత్రినే పగలుగా భావించి చూస్తున్నాడు. స్వప్న దృక్కు వాడిలా చూస్తున్నా ప్రక్కనే మేలుకొని ఉన్న వేరొకడి కది రాత్రి కాలమే. పగలు గాదు. ఇక్కడ కలగనే వాడికి రాత్రే పగలైనా మేలుకొని చూచే వాడి కది ఎలా రాత్రి కాలమో అలాగే అజ్ఞాని ప్రపంచమని చూస్తున్నది జ్ఞాని కదంతా బ్రహ్మమే.
దీనినిబట్టి తేలిందేమంటే జ్ఞానికి బ్రహ్మమూ బ్రహ్మమే. ప్రపంచమూ బ్రహ్మమే. అజ్ఞానికి బ్రహ్మమూ ప్రపంచమే. ప్రపంచమూ ప్రపంచమే. అంటే జ్ఞాని కహోరాత్రాలు బ్రహ్మే కనిపిస్తుంటే. అజ్ఞానికి ప్రపంచమే కనిపిస్తున్నదని అర్థం. ఇందులో బ్రహ్మాన్ని ప్రపంచంగా చూస్తున్న మన బోటి లోకులది వియోగమైతే ఈ సమస్తమూ బ్రహ్మతత్త్వంగా దర్శించే జ్ఞానిది నిజమైన యోగం. అప్పుడిక నామ రూపకృతమైన వైవిధ్యమే Diversity లేదు కాబట్టి అదే సమత్వం. సామ్యం. ఈ కనిపించే చరాచర పదార్థాలలోనూ పరచుకొని ఉన్నదదే. అదే ఇవన్నీ వాస్తవానికి. అది మన స్వరూపమే. దానిని పట్టుకొని మన స్వరూపమని భావించినప్పుడే మనకు మోక్షం.