#


Back

పూర్వార్థమ్


12
సర్వ భూతస్థ మాత్మానం సర్వ భూతాని చాత్మని
వీక్షతే యోగ యుక్తాత్మా - సర్వత్ర సమ దర్శనః  6-29

యోగయుక్తాత్మా - యోగంతో కూడిన ఆత్మ గలవాడు. ఆత్మ - ఆటే ఇక్కడ మనస్సని అర్థం. అలాంటి మనస్సు గలవాడికి సర్వత్రాసమం గానే పడుతుంది. దృష్టి. ఎక్కడ ఏది చూచినా ఒకటిగానే కనిపిస్తుందని భావం. ఎందుకని, సకల భూతములలోనూ తన స్వరూపమే చూడగలుగుతాడు. అంతేగాదు. తన స్వరూపంగా సకల భూతాలను కూడా చూస్తాడు. అలా చూచేవాడికి తాను తప్ప సృష్టిలో మరేదీ లేదని బోధపడుతుంది. ఎలాగ. ఆకాశ మన్నింటిలో అన్నీ ఆకాశంలో ఉన్నాయంటే ఏమిటర్ధం. ఆకాశమే ఉంది. మరేదీ లేదనే గదా. అలాగే ఆకాశంకన్నా సూక్ష్మమైన చైతన్య మన్నింటినీ వ్యాపించి అందు లోనే సర్వమూ ఇమిడి ఉందంటే సర్వమూ అనేది లేదనీ అది ఒక్కటే ఉందనేగదా - గ్రహించవలసింది.

అలాంటప్పుడు ప్రపంచంలో ఇక ఏది చూచినా అదే. విడిగా చూచినా అదే. కలిపి చూచినా అదే. చైతన్యమే చైతన్యం ఏక ధారగా సాధకుడి దృష్టి కది ఒక్కటే సాక్షాత్కరిస్తుంది. ప్రతి ఒక్క దానిలో పరచుకొని ఉన్నట్టు తన చైతన్యాన్నే లోపలా వెలపలా అనుసంధించుకుంటూ పోతాడు సాధకుడు పదార్ధాలూ -- పరిస్థితులూ ఎప్పటికప్పుడు మారిపోతున్నా ఆ మార్పులను కనిపెట్టే ఈ దృష్టి మాత్రం చెదరకుండా అలాగే నిలిచి ఉంటుంది.

దానితో ఇక ఏ పని చేస్తున్నా మనం భయ పడ నక్కరలేదు. ఒక పసి మొదలు పెట్టినప్పుడు - అది జరుగుతూ ఉన్నప్పుడు- ఫలితానికి వచ్చినప్పుడు ఈ మూడు దశలు కూడా సమానంగా కనిపిస్తాయి. ఏమాత్రమూ తేడా ఉండదు. తేడా ఏ మాత్రమున్నా అది వాడు జ్ఞాన దృష్టితో సమన్వయించుకో గలడు. కాబట్టి ఇది జరిగింది అది జరగలేదనే కొరతగానీ పనులవల్ల కలిగే ఒత్తిడిగానీ మనసు మీద బొత్తిగా పనిచేయదు. ఒక కార్యమారంభించక ముందెంత తేలికగా ఉంటుందో మనసు ఆ తరువాత కూడా అంత తేలికగానే ఉండగలదు. అదే ముక్తి. ముక్తి అంటే విడుదల అనే గదా అర్థం. విడుదల మనకు దేని నుంచి ఒత్తిడి నుంచి. అన్ని ఒత్తిడులూ బలాదూరయినప్పుడిక అది ముక్తిగాక మరేమిటి.