#


Back

ఉత్తరార్ధమ్


114
కచ్చి దేత చ్చుతమ్ పార్థ-త్వయైకాగ్రేణ చేతసా
కచ్చి దజ్ఞాన సమ్మోహః - ప్రణష్టస్తే ధనంజయ  18-72

శిష్యాచార్య సంవాదమైన తరువాత ఆచార్యుడు తాను బోధించిన శాస్త్రా ర్ధాన్ని శిష్యుడు గ్రహించాడో లేదో గ్రహించిన విషయం బాగా మనసుకు పట్టిందో లేదో తెలుసుకోట మతని బాధ్యత. ఒకవేళ బాగా గ్రహించలేదన తెలిస్తే మరొక సులభమైన మార్గంలోనైనా బోధించవలసి ఉంటుంది. ఏదో ఒక ఉపాయంతో మొత్తానికి శిష్యుణ్ణి కృతార్ధుణ్ణి చేయటమే ఆచార్యుడి ధర్మం.

అందుకే ప్రశ్నిస్తున్నాడు జగద్గురువైన శ్రీ కృష్ణు డర్జునుణ్ణి. అర్జునా నేను చేసిన ఈ గీతోపదేశ మంతా నీవు చక్కగా శ్రవణం చేశావు గదా. ఊరక శ్రవణం చేస్తే సరిపోదు. ఏకాగ్రమైన మనసుతో చేయాలి శ్రవణం. శ్రవణమంటే ఇక్కడ చరాచర ప్రపంచమంతా ఆత్మచైతన్యానికి భిన్నంగా లేదు- ఉన్నదంతా ఒకే ఒక ఆత్మతత్త్వమనే సత్యాన్ని అర్ధం చేసుకోవటం. ఇలాంటి లోకోత్తరమైన భావాన్ని మనసుకు పట్టించుకోవాలంటే మనసు పరధ్యానంగా ఉంటే సుఖం లేదు. ఎంతో సావధానంగా Attentive ఉండాలి. దృశ్యతే త్వగ్యయా బుద్ధ్యా సూక్ష్మయా అని పేర్కొన్న దుపనిషత్తు. విషయం సూక్ష్మమయ్యే కొద్దీ దాన్ని గ్రహించే బుద్ధికూడా సూక్ష్మంగానే తయారు కావాలి. అప్పుడే అది ఉన్న దున్నట్టు మనసుకు పట్టేది. లేకుంటే అసలు పట్టనైనా పట్టదు లేదా పోరబాటు గానైనా పట్టవచ్చు. రెండూ పనికిరాని సందర్భాలే.

పోతే ఏకాగ్రమైనా మనసుతో గ్రహించి ఒంట బట్టించుకొన్నందుకేమిటి ఫలితం అజ్ఞాన సమ్మోహ మనేది తొలగిపోవాలి. అజ్ఞానంవల్ల కలిగిన సమ్మోహమేదో అది అజ్ఞానసమ్మోహం. అజ్ఞానమంటే అనాదిగా మనలనంటి పట్టుకొన్న అ విద్య. అది మనకు స్వాభావికమై పోయింది. తన్నిమిత్తంగా ఏది హేయమో ఏది ఉపాదేయమో వివేచన చేయలేని దుస్థితి ఏర్పడింది జీవులకు. దీనికే సమ్మోహ మని పేరు. ధర్మ సమ్మూఢ చేతాః- అని మొదటనే వాపోతా దర్జునుడు. ఇది ప్రణష్టం కావాలి జ్ఞానోదయ మయినందుకు. నష్టంకూడా కాదు ప్రణష్టం. అంటే లేశమాత్రం కూడా మిగలగూడదిక. సూర్యోదయమైతే అంధకార ముంటుంది. అలాగే ఆత్మ జ్ఞానోదయమైతే అజ్ఞానాంధకారం కూడా ఏ మాత్రమూ కనపడరాదు. ఇదే దాఖలా విషయం చక్కగా గ్రహించాడని చెప్పటానికి.

అంతేకాదు. ధనంజయ అని సంభోధిస్తున్నా డర్జునుణ్ణి. పార్థ అని మరొక సంబోధన ఉంది ఆదిలో. ఆత్మ స్వరూపాన్ని శ్రవణం చేసి అజ్ఞాన తిమిరాన్ని నిర్మూలించ గలిగితే పార్థుడప్పుడు నిజంగా ధనంజయుడవుతాడు. పృధకుమా రుడే పార్థుడంటే. పృధ అనే మాటలో పృథివీ తత్త్వం కూడా ఇమిడి ఉంది. అప్పటికి మర్త్యుడయిన ప్రతి ఒక్కడూ అర్జునుడిలా పార్థుడే. వాడు తన మర్త్య త్వాన్ని పోగొట్టుకొని అమర్త్య భావాన్నే Immortality అందుకోవాలంటే ఆత్మ జ్ఞానంతో అజ్ఞానాన్ని నిర్మూలించుకొని ధనంజయుడు కావాలి. ధనమంటే ఇది భౌతికం కాదు. ఆధ్యాత్మికం. మాగృధః కస్యస్విద్దన మన్న దీశావాస్యం అంతా ఈశ్వరుడి ధనమే నట. ఆ ఈశ్వరుడు మనమేనని గ్రహించినప్పుడీ ధనమంతా మనదేగదా. ఆ దృష్టితో జ్ఞాని అయిన ప్రతివాడూ ధనంజయుడే. ఇలాంటి జ్ఞానధనాన్ని జయించినప్పుడే నీవు నిజమైన ధనంజయిడవు. అంతేగాని ఉత్తరకురు భూములను జయించి అసంఖ్యాక ధన రాసులని కొని తేవటం కాదు సుమా- అని అర్జునుణ్ణి వ్యంగ్యంగా కూడా మందలిస్తున్నా డీమాటతో భగవానుడు.