#


Back

ఉత్తరార్ధమ్


112
య ఇమం పరమం గుహ్యం
మద్భక్తేష్వభి ధాస్యతి
భక్తిం మయి పరాం కృత్వా
మా మేవైష్య త్యసంశయః  18-68

సంప్రదాయ మెలా ఉండాలో వర్ణించారు. పోతే ఇప్పుడు సంప్రదాత అయిన ఆచార్య పురుషు డెలా ఉండాలో అలాంటి దేశికుడి కెలాంటి ఫల మబ్బుతుందో నిరూపిస్తున్నాడు భగవానుడు. శాస్త్రార్థం చక్కగా గ్రహించి ఒంటబట్టించుకొని దానిని స్వానుభవినికి తెచ్చుకొని ఉండాలి ఆచార్యు డనేవాడు. అలాంటివాడే మరొకడికి బోధ చేయడాని కర్హుడు. ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వ దర్శినః- అనే గీతా శ్లోకార్థాన్ని ఇక్కడ అనుసంధానం చేసుకొని చూడవచ్చు.

అలాంటి ఆచార్యుడు తాను గ్రహించిన పరమరహస్యాన్ని తనలోనే జీర్ణం చేసుకోక శిష్యులకు బోధించాలి. శిష్యులంటే పూర్వోక్త అధికార చతుష్టయ మున్న వాళ్ళు. అందులో కేవలం భగవద్భక్తి మాత్రమున్నాచాలు. వాడర్హుడే. అలాంటివాడి కెంతో భక్తితో బోధించాలి ఆచార్యుడు కూడా. ఆచార్యుడి కుండ వలసిన భక్తి ఏమిటిక్కడ. ఇది మామూలు చదువు కాదు నేను చెప్పటం-జగ ద్గురు వైన పరమాత్మకు సాక్షాత్తుగా చేసే పరిచర్యే ఇది అనే- ఒక నిష్కామ నిరాడంబర చిత్త వృత్తి,

ఇలాంటి భక్తి విశ్వాసాలతో శాస్త్రాన్ని చదివించటమే గాక తదర్ధాన్ని కూడా ఉన్నదున్నట్టు బోధిస్తే చాలు. అతడి జన్మ చరితార్థ మవుతుంది. చచ్చిన తరు వాత నన్నే పొందుతాడతడు. సంశయం లేదంటున్నాడు పరమాత్మ. నన్నే పొందటమంటే ముక్తుడవు తాడని అర్ధం. అంతకు ముందు కాలేదా అని సందే హించరాదు. విముక్తశ్చ విముచ్చతే” అంతకు ముందు కూడా విముక్తుడే. జ్ఞానం వేరు ముక్తి వేరు కాదుగదా. బ్రహ్మజ్ఞాన మెప్పుడు కలిగిందో అప్పుడే ముక్తి కూడా ప్రాప్తించింది. అయితే ప్రారబ్ద కర్మ ఒకటి ఇంకా ఉంది కాబట్టి అది జీవన్ముక్తి. అవసానంలో అదికూడా తీరిపోయింది కాబట్టి ఇది విదేహముక్తి. అంటే ఇక దేహధారణ అనేది లేదని భావం.