#


Back

ఉత్తరార్ధమ్


111
ఇదంతే నాతప స్కాయ- నాభక్తాయ కదాచన
న చాశు శ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి  18-67

శాస్త్రోపదేశ మిక్కడికి సమాప్తమయింది. తదుపదిష్టమైన సాధన మార్గం కూడా బోధపడింది. పోతే ఇలాంటి బోధ మనం చేసుకొన్నతరువాత దానిని మరలా ఎవరికి బోధించాలని ప్రశ్న వస్తుంది. ఏమి బోధించకపోతేనని సవాలు చేయరాదు. విద్యా సంప్రదాయం దెబ్బతింటుంది. విద్య అనేది ఒకరివల్ల ఒకరికి సొక్రమించవలసిన ధనం. ఒక్కడే అనుభవించేది కాదు. అలాగే అనుకొంటే మొట్టమొదట సృష్టిలో ఎవడు గ్రహించాడో వాడు మాత్రమే తరించి మిగతా జీవులంతా నిర్జీవులయి పోయేవారు. ప్రతియుగంలోనూ కొంతకు కొంత అయినా మానవాళి తరిస్తున్నదంటే అది గురుశిష్య సంప్రదాయమనేది ఒకటి ఉండటం మూలాన్నే.

అయితే బ్రహ్మవిదుడైనవాడు సంప్రదాయాన్ని కాపాడవలసిందే. అలా కాపాడడాని కతడు తనవిద్య లోకులకు బోధించవలసిందే. కాని ఇందులో ఒక తిరకాసు ఉంది. బోధించాలి గదా అని ఎవరికంటే వారికి ఈ విద్య బోధించ గూడదు. అన్ని విద్యలకన్నా విలువైన విద్య ఇది. రాజవిద్య అన్నారు దీన్ని. అలాంటి విద్య అనర్హులకు బోధిస్తే సుఖంలేదు. వారు దానిని విశ్వసించక పోవచ్చు. అవహేళన అయినా చేయవచ్చు. దాని వల్ల నీకు నిర్వేదం కలగవచ్చు. ఆ నిర్వేదం నీకు నిరుత్సాహం కలిగించవచ్చు. ఎన్నో ఉన్నాయి ఈతి బాధలు.

అందువల్ల సర్వవిధాలా అధికారి అయినవానికే బ్రహ్మవిద్య నుపదేశించాలి విద్యోపదేష్ట, ఎవరా అధికారులని అడిగితే చెబుతున్నాడు భగవానుడు. అధికార మున్నవాడే అధికారి. అధికారమనేది నాలుగువిధాలు. ఒకటి తపస్సు, తప స్సంటే అతిసూక్ష్మమైన భావాన్ని కూడ ఆలోచించి పట్టుకొనే శక్తి. రెండవది భక్తి. భక్తి అంటే విషయం మీదా దాన్ని బోధించే ఆచార్చుని మీదా - ఎనలేని గౌరవం మూడవది శుశ్రూషశాస్త్రమూ, ఆచార్యుడూ తనకు బోధించే విషయం వినాలనే ఉత్కంఠ. పోతే నాల్గవది అనసూయ. ఏ పరతత్త్వాన్ని గూర్చి చర్చ జరుగుతున్నదో దానిమీద గట్టి నమ్మకం కలిగి ఉండటం. ఇలాంటి నమ్మకమనేది మొదట ఉంటేగాని వినేబుద్ధి పుట్టదు. వింటేగాని దానిపైన గౌరవ మేర్పడదు. గౌరవమేర్పడితేగాని దానిని నిశింతగా ఆలోచించి పట్టుకోలేడు.

దీనిని బట్టి మనం గ్రహించవలసిం దేమంటే ఇవి నాలుగూ కలిసి ఉంటేనే అధికారం Competence. ఏ ఒక్కటి లోపించినా ఆమేర కది కుంటుపడుతుంది. అంతే కాదు. నాలు గింటిలో ఉత్తరోత్తరం చాలా అవశ్యకమైన గుణం. అంటే తపస్సు కన్నా భక్తి - భక్తి కన్నా శుశ్రూష- దాని కన్నా అనసూయ-ముఖ్యమైన యోగ్యత. శుశ్రూష-భక్తీ ఉంటేనే తపస్వికి చెప్పవలసింది. అవి లేకుండా తపస్వి అయినా చెప్పకూడదు. అసూయా యుక్తుడయితే ఇక ఎన్ని గుణాలున్నా పనికిరాదు. అది లేకుండా కనీసం భక్తి శుశ్రూష లున్నా చాలు పనికి వస్తుంది. ఇదీ శాస్త్ర సంప్రదాయ విధి. దీనిని బట్టి తెలిని తేటలు గాదీ మార్గంలో ముఖ్యం. ముఖ్యంగా కావలసింది విశ్వాసం. దానితో పాటు గౌరవం- గౌరవ బుద్ధితో చేసే శ్రవణం. ఇవి మూడూ ఉన్నప్పుడే మానవుడి తెలివి సరియైన మార్గంలో ప్రవేశించి రాణిస్తుంది. లేకుంటే పెడత్రోవ బట్టి ఊరక పాడయి పోతుందని శాస్త్ర హృదయం.