ఉత్తరార్ధమ్
109
ఉద్ధరే దాత్మనా త్మానమ్ - నాత్మాన మవసాదయే
దాత్మైవ హ్యాత్మనో బంధు. రాత్మైవ రిపు రాత్మనః 6-5
అంచేత సాధన చేయట మెలాగా అని సందేహించ నక్కరలేదు. మన ప్రారబ్దాని కెంత అవకాశముందో జీవితంలో మన ప్రయత్నానికీ అంతే ఉంది. ఈ ప్రారబ్దం కూడా అసలు మన మింతకు ముందు జన్మలలో చేసు కొన్నదే గదా. చేసుకోనే స్వాతంత్రమే మనకు లేకపోతే అది ఎలా తయా రయింది. కాబట్టి తత్ఫల భోక్తృత్వ మెలా ఉందో మనకు తత్కర్మ కర్తృత్వం కూడా ఉండి తీరాలి.
ఇదుగో ఈ కర్తృత్వం కూడా ఉంది గనుకనే మరలా మన మీ జీవితంలో కృషి చేయ వలసి ఉంది. అది ఏదో గాదు. మన ఆత్మోద్ధరణమే. ఆత్మను ఆత్మతోనే ఉద్దరించు కోవాలి మానవుడు. మరేబాహ్య సాధనా అక్కర లేదు. అంతటా అన్ని వేళలా అదే మనమయి ఉన్న ఆత్మనే మరచి పోయాము మనం. మరచి పోయి మామ పెండ్లాన్ని అత్త అన్నట్టు మరలా దానినే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగా అది. ఆత్మతోనే పట్టుకోవాలి ఆత్మను. ఎందుకంటే ఆత్మే ఆత్మకు బంధువు. ఒక బంధువు లాగా దాన్ని చేర్చేందుకు అదే సాధన మవు తుంది.
ఎలా అవుతుందని ప్రశ్న. ఏకాత్మ ప్రత్యయసార మన్నది ఉపనిషత్తు. ఒకే ఒక ఆత్మ చైతన్యం తప్ప మరేదీ లేదనే ప్రత్యయం Concept లేదా భావంతోనే అనుసరించాలట దాన్ని. ఆ భావమే దాన్ని అందుకొనే ఉపకరణం “యద్భావ స్తద్భవతి" అన్నట్టు ఏ భావం బలంగా ఏర్పడితే ఆ భావమే అయిపోతాడు మానవుడు. ప్రపంచ భావనతో మన మంతా ఇప్పుడు ప్రపంచమయి కూచు న్నాము. అలాగే మన మీ ప్రపంచం కాదు శుద్ధ చైతన్య రూపుల మేనని అను క్షణమూ భావన చేయ గలిగితే తదాకారంగానే మారి పోతాము. క్రొత్తగా మారటం కూడా కాదిది. తదాకారంగానే ఉన్నాము మొదటి నుంచీ. అయితే మరచి పోయాము. కాబట్టి మరలా జ్ఞప్తి చేసుకోటమే ఈ భావన.
కనుక ఈ భావనే బంధు వయింది మన పాలిటికి. లోకంలో బంధువులు మనల నీలోకవ్యవహారంలో బంధించేవారే గాని విముక్తులను చేయబోరు. ఇది దీనిలో నుంచి విముక్తిని ప్రసాదించేది కాబట్టి నిజమైన బాంధవుడిదే మనకు. అంతేకాదు. దీని విలువ తెలుసుకో లేకపోతే అది మనల నీ సంసార సాగరం లోనే ముంచుతుంది. కాబట్టి అదే మన పాలిటికి శత్రువు కూడా అవుతుంది.
కాబట్టి దాని విలువ తెలిసి ఆ ఆత్మాకార వృత్తిని నిరంతరమూ ఆ వృత్తి చేసుకోవాలి మనసులో. దానితో మన ఆత్మ స్వరూపాన్ని మనం పైకి తెచ్చుకో గలం - ఎక్కడబడితే అక్కడ దర్శించగలం. లేక పోతే ఆధఃపాతాళాని కణగ ద్రొక్కినట్టయి ఎక్కడాకనిపించదది.