ఉత్తరార్ధమ్
108
ఇంద్రియ స్యేంద్రియ స్యార్థే - రాగద్వేషౌ వ్యవస్థితౌ
తయోర్నవశ మాగచ్చే- త్తా హ్యన్య వరిపంథినౌ 3-34 3-34
నిజంగా ఇది ఒక గడ్డు సమస్యే. పైకి చూస్తే ఏ మాత్రమూ దీనికి పరి ష్కారమే లేదని తోస్తుంది. పరస్పర విరుద్ధమైన భావాలు రెండున్నాయి ఇక్కడ. ఒకటి దైవము-fate-మరొకటి పురుషకారము -Free will. అత్తా కోడళ్ళ మాదిరి రెంటికీ సరిపడదు. ఎలా ఈ రెంటినీ సమన్వయించటం. సమన్వ యించకపోతే మన సాధనేబండపడుతుంది. సాధన లేకపోతే మోక్షమేలేదు మానవుడికి. అది మొదటికే మోసం. కాబట్టి ఏదో ఒక పరిహార ముండాలి దీనికి.
ఉందనే చెబుతున్నాడు భగవానుడు. ప్రకృతి లేదా ప్రారబ్ధ మనేది సర్వాధికారాలు గుత్తకు తీసుకొన్నదని భ్రాంతి పడరాదు అనేక జన్మలనుంచీ అది మానవుడి బుద్ధిలో సంస్కార రూపం గానే మెదులుతుంటుంది. కార్య రూపంగా తనపాటికి తానెప్పుడూ బయటపడదు. రాగద్వేషాలనే ద్వంద్వా లెప్పుడు దయిస్తాయో అప్పుడది వాటి ఆసరాతో తల ఎత్తుతుంది. ఈ రాగద్వేషా లనేవి మనకు ప్రతి ఇంద్రియ విషయంలోనూ ప్రతి క్షణమూ కలుగుతూనే ఉంటాయి. శబ్ద స్పర్శాదులైన విషయాలేవైనా సరే మనకనుకూల మని తోస్తే అభిమానిస్తాము. ప్రతికూల మనిపిస్తే ద్వేషిస్తాము.
అవి రెండూ పెట్టుకోటం- పెట్టుకోక పోవటం - మన చేతిలో ఉంది. ఒక విషయంలో అభిమానమూ - ద్వేషమూ - అనే భావాలు కలుగుతుంటే వాటిని కలగకుండా చేసుకోవచ్చు మనం. అలా చేసుకోటాని కాలంబనం మనకు తత్ప్రతిపక్ష భావన. ఏది వాటికి ప్రతిపక్షం. సమ్యగ్దర్శనమే Right vision వాటికి ప్రతిపక్షం Opposite. అంతా ఆత్మస్వరూపమే గదా అని చూడగలిగితే రాగమూ లేదు ద్వేషమూ లేదు. రాగద్వేషాలు లేకపోతే నిద్రాణమై ఉన్న సంస్కారం పురివిప్పదు. చచ్చిన పాములాగా అలాగే పడి ఉంటుంది. రాగద్వేషాలనే సచివులు చేయూత ఇవ్వనిదే అది పైకి లేవలేదు. పని చేయలేదు.
ఇదుగో ఈ రాగద్వేషాలనే ద్వంద్వాలకే మానవుడు వశం కాగూడదు. ముందుగానే వాటి నదుపులో ఉంచుకోవాలి. శాస్త్ర దృష్టితో వాటి నడుపు చేయవచ్చు. అప్పుడు ప్రకృతి వాడినేమీ చేయలేదు. ప్రకృతి అనేది ఎక్కుపెట్టిన బాణం. దాన్ని ప్రయోగించటం ఉపసంహరించటం మన చేతిలో ఉంది. మన రాగద్వేషాలు దాన్ని ప్రయోగించమని చెబుతుంటే మన వివేచనా శక్తి దాన్ని ఉపసంహరించమని బోధిస్తుంది. ఈ వివేచనకే పురుష ప్రయత్నమని పేరు. దీనితో రాగద్వేషాలనే దోపిడి దొంగలను సంహరించి ప్రాక్తన కర్మవాసనలకు మనం జవాబు చెప్పవచ్చు.