#


Back

ఉత్తరార్ధమ్


102
భక్త్యా మా మభి జానాతి యావాన్ యశ్చాస్మి తత్త్వతః
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా-విశతే తదనం తరం  

18-55

అది ఎలా జ్ఞాపకం చేసుకోవాలని నిజమైన సాధకునికి జిజ్ఞాస కలగవచ్చు. అందుకే చెబుతున్నాడు భగవానుడు సమాధానం భక్తి చేతనే జ్ఞాపకం చేసుకో మని. భక్తే జ్ఞప్తికి సాధనం. భక్తేమిటి. భక్తి అంటే అనన్యభావన. నామరూపాదు లైన ఉపాధులలో ఏదిగాని మనసుకు రానీయకుండా వాటన్నిటికీ అధిష్ఠానమైన శుద్ధ సచ్చిదాత్మకమైన తత్త్వాన్నే మనోనేత్రంతో దర్శిస్తూ పోవడం.

అలా ప్రయత్నిస్తూపోతే అదే ఒక వృత్తిగా మారి అఖండమైన ఆ వృత్తిలో నామరూపాలనే ఖండ వృత్తులన్నీ పూర్తిగా ప్రవిలయమవుతాయి. దానితో ఇక ఆ అఖండ వృత్తి చలించకుండా ఏకధారగా ఒకే ఒక తత్త్వాన్ని చూడగలుతుంది. అయితే అలాచూచే ఆ పరతత్త్వ మెలా ఉంటుందని అడగవచ్చు. "యావాన్ యశ్చ" అనే రెండు మాటలలో ఇమిడ్చి చెప్పారు దాన్ని యావాన్ అంటే ఎంత ఉందో అంత. యశ్చ అంటే ఎట్లా ఉందో అట్లా అని అర్ధం. ఎంత అనేది నామ రూపాదులైన ఉపాధులను కలుపుకొని చెప్పినమాట. ఎట్లా అనేది కలుపు కోకుండా చెప్పినమాట.

కేవలం చైతన్యమేనని చూస్తే నామరూపాదికమైన ప్రపంచమది కాదా అని ప్రశ్న వస్తుంది. నామరూపాది ప్రపంచమేనని చూస్తే అదీ మన దృష్టికి కనిపించే ఒక ఘటం లాంటిది పటంలాంటిదేనా అని అనుమాన మేర్పడుతుంది. అంచేత రెండూ అదేనని చెబితే చిక్కులేని పని. దీనిని బట్టి తేలిందేమిటి చివరకు శుద్ధసచ్చి ద్రూపంగా ఉన్న అదే నానావిధనామరూప ప్రపంచంగా భాసిస్తున్న దాని చూడాలి సాధకుడు. అంటే నామరూపాల నెప్పుడుగాని చూడటం మానుకోరాదు. చూస్తూనే ఉండాలి ప్రపంచాన్ని. అయితే ప్రపంచంగాకాదు. బ్రహ్మంగా, "దృష్టిం జ్ఞానమయీం కృత్వాపశ్యే దృహ్మమయం జగత్." ప్రతి ఒక్కటీ చూసేటప్పుడూ దానితో వ్యవహరిస్తున్నప్పుడూ అది ఒక నామం ఒక రూపమని గాక తన చైతన్యమే ఆ నామమనీ తన చైతన్యమే ఆ రూపమనీ చైతన్య దృష్టితో చూడటం అభ్యసించాలి దానితో ప్రపంచాన్ని చూచినట్టూ అవుతుంది మరొక విధంగా చూడనట్టూ అవుతుంది.

ఇలా చూడటమే అసలు తత్త్వాన్ని చూడటమంటే. ఈ చూపులో తత్త్వ మంతా కలిసి వస్తుంది. చూపే తత్త్వమవుతుంది. అయితే ఇక వేరుగా చూడ వలసిందంటూ ఉండబోదు. చూడబడేది చూసేదే అవుతుంది. అప్పుడు చూడడ మనే మాటకు కూడా ఇక అర్ధంలేదు. మరి ఎక్కడా జాగాలేక తనలోనే ప్రవే శిస్తుందది. చమత్కారంగా చెప్పేమాటేగాని అది వాస్తవానికి ప్రవేశమేగాదు. అంతరమనేది ఉంటే గదా ప్రవేశించటానికి. అనంతర మన్నప్పుడు ప్రవేశ మేమిటి. కాబట్టి తాను తానుగా ఉండిపోవడమే ప్రవేశమనేమాటచేత ఔపచారి కంగా metaphorical నిర్దేశిస్తున్నాడు భగవానుడు.