రంగభూమి
పోతే చివరిమాట నేను చెప్పేదేమంటే అది మీరు శ్లోకాలతో చదివినా సరే. శ్లోకాలు చూడకుండా చదువుతూ పోయినాసరే. మధ్యలో తెగిపోవటమంటూ ఉండదు, శాస్త్ర విషయమంతా అనుస్యూతంగా మనసుకు వస్తుంది. అది కూడా సాధన మార్గాని కనుగుణంగా బోధపడుతూ వస్తుంది. కేవల విషయ జ్ఞానం కంటే సాధనే ముఖ్యంగా భావించాను కాబట్టి దానికనుగుణంగా పోవాలని శ్లోకాలు వ్యాఖ్యానించటంలో కూడా స్వాతంత్య్రం చాలావరకూ అవలంబిం చాను. అయితే ఎంత స్వాతంత్య్రమైనా అది మరలా మొదలు చెడ్డబేరం గాదు. అద్వైత దర్శనమనే కేంద్ర బిందువును వదలకుండా ఎక్కడికక్కడ దానిని స్పృశిస్తూనే ఉంటాను. కాబట్టి సిద్ధాంత సాధన సమన్వయ రూపమైన గ్రంథమిది. Imitation of chirst అనే ఆంగ్ల గ్రంథంలాగా ఇది ఒక క్రొత్త బాణిలో నడచిన అభినవ గీత అనుకోవచ్చు. సహృదయ జిజ్ఞాసువులు దీన్ని జాగ్రత్తగా పఠించి నేనుద్దేశించిన ప్రయోజనాన్ని అందుకోగలిగితే నా శ్రమకు కూడా ఫలాన్ని అందుకోగలను.
సాధయామ స్తావత్.
పార్థాయ ప్రతి బోధితాం భగవతా నారాయణేన స్వయం
వ్యాసేన గ్రథితాం పురాణ మునినా మధ్యే మహాభారతమ్
అద్వైతామృత వర్షిణీం భగవతీ మష్టాదశాధ్యాయినీ
మంబ! త్వా మనుసందధామి భగవద్గీతే! భవద్వేషిణీమ్.
Page 6