#


Back

రంగభూమి


వేదాంత విజ్ఞాన రంగంలో భగవద్గీత కున్న ప్రచారం మరి దేనికీ లేదు. అన్నీ తెలిసిన పండితుల దగ్గరి నుంచీ ఏమీ తెలియని పామరుల దాకా దాని నభిమానించే వారే, ఆబాల గోపాల మందరికీ అది శిరోధార్యమే. మహాభార తంలో ఇది గాక ఇంకా ఎన్నో ఉన్నాయి గీతలు. హంస గీత- ఋభు గీత- బ్రాహ్మణ గీత- అనుగీత- ఒకటేమిటి- చాలా ఉన్నాయి. వాటికి తోడు సనత్సు జాతీయ మోక్ష ధర్మాల లాంటి ఘట్టాలు కూడా ఏమంత తక్కువవి కావు. అయినా దీనికి వచ్చిన ప్రఖ్యాతి వాటికి రాలేదు.

ఏమి కారణం. సకల వేదార్థ సార సంగ్రహ మది. వేదంలో చెప్పిన ప్రవృత్తి నివృత్తి ధర్మాలు రెండూ చోటు చేసుకొన్నాయందులో. ప్రవృత్తి అంటే కర్మ భక్తి సమాధులు. నివృత్తి అంటే కేవలం జ్ఞానం. భగవద్గీతలో నాలుగూ కనిపిస్తాయి మనకు. అంతవరకేగాదు నాలుగింటినీ సమన్వయించటంలో ఉంది దాని గొప్పతనం. అది ఎలా గని అడగవచ్చు. పేరుకు పద్దెనిమిది అధ్యాయాలని విభజించినా అన్ని అధ్యాయాలలో చెప్పిందీ నాలుగే యోగాలు. ఈ నాలుగూ మరలా రెండే. "లోకేస్మిన్ ద్వివిధా నిష్ణా పురా ప్రోక్తామయార్జున" అని స్వయంగా చెప్పుకొన్నాడు కృష్ణ భగవానుడు. ఈ లోకానికి రెండే రెండు యోగాలు బోధించాడటతాను. అవి ఒకటి జ్ఞానం. మరొకటి యోగం. యోగ మంటే కర్మ అని అర్థం. అప్పటికి జ్ఞానమూ - కర్మా - ఇవి రెండే భగవాను డుపదేశించింది. ఇవి రెండూ కూడా ఇంకా కొంత లోతుకు దిగి చూస్తే మరలా ఒక్కటే. దీనికి కూడా భగవానుడి ఆమోద ముద్ర ఉంది. ఏకమ్ సాంఖ్యంచ యోగంచ యః పశ్యతి సపశ్యతి. జ్ఞాన కర్మలూ రెండూ నిజాని కొక్కటే అవి రెండూ ఒక్కటేనని గ్రహించిన వాడే ధన్యుడని చాటుతాడు. ఇలాంటి సమన్వయం భగవద్గీతలో తప్ప మరెక్కడా కనిపించదు మనకు. అంతే కాదు. ఇలాంటి సమన్వయ జ్ఞానంతోపాటు విజ్ఞానాన్ని కూడా ప్రసాదించటం గీతలోని మరొక విశిష్టత. జ్ఞానం వేరు. విజ్ఞానం వేరు. విజ్ఞాన మంటే శాస్త్ర జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోటం. "జ్ఞానం తేహమ్ సవిజ్ఞానమ్ జ్ఞానమ్ విజ్ఞాన సహితమ్-" అని అక్కడక్కడా భగవానుడు సెలవిచ్చిన మాటలలో అంతరార్థ మిదే. ప్రస్థానత్రయంలో అసలు నిది ధ్యాసనకు ప్రాధాన్య మిచ్చేది భగవద్గీత. నిదిధ్యాసనమంటే అనుభవమే.

Page 1