#


Back

69
యస్త్విం ద్రియాణి మనసా-నియ మ్యారభ తేర్జున
కర్మేంద్రియైః కర్మ యోగ - మసక్తస్స విశిష్యతే   3-7

అలా బూటకంగా బ్రతికే దానికన్నా ఒకపని చేస్తే చాలా మేలు. ఇంద్రియ వ్యాపారాల నరికట్టినా మనో వ్యాపారాన్ని ఎలాగూ అరికట్టలేవు. కాబట్టి మనసు నీశ్వరార్పణం చేసి మొదట నైర్మల్యాన్ని సంపాదించు. ఆ తరువాత దైవబలాన్ని పుంజుకొన్న ఆ మనస్సుతో ఇంద్రియాల నదుపులో పెట్టుకొని కర చరణాదులైన ఇంద్రియాలతో కర్మలు సాగించు. అలా సాగిస్తే అది కర్మ కాదు. కర్మయోగ " మనిపించు కొంటుంది.

ఇందులో ఒక సౌలభ్య ముంది. కర్మేంద్రియాలను నిరోధించ నక్కరలేదు. మీదు మిక్కిలి వాటి ఉపయోగించి పనులు చేయవచ్చు. ఒక పని చేయటం చేయక పోవటం ప్రధానం కాదు. కర్మ ప్రచోదక మైన మనసులో ఉంది మర్మ మంతా. మనసు నిర్మలమైతే ఏ పని చేసినా ప్రమాదం లేదు. కాకపోతే చేయ కున్నా ప్రమోదం లేదు.

అయితే కర్మలన్నీ చేస్తూనే ఉన్నాము గదా- అవి మనకు బంధకం కావా అని ప్రశ్న. బంధకం కావటం కాకపోవట మనేది ఆయా కర్మలలో లేదు. మన మనసులో ఉంది. మనసులో సంగం లేకపోతే సరి. ఇక ఏ కర్మ చేసినా అది మనలను బంధించదు. అసంగబలమే దాన్ని క్షాళితం చేస్తూ పోతుంది. ఈ అనాసక్తి యోగమే సాధకుడయిన వాడల పరచుకోవలసిన గొప్ప గుణం. ఆ గుణ మలవడిందంటే ప్రత్యేకించి ఏ ధ్యానమూ అక్కర లేదు. కర్మేంద్రియాలతో పనులు చేస్తున్నా అదంతా మనసు పర్యవేక్షణ లోనే ఉంటుంది కాబట్టి- ఆ మనసు వ్యవసాయాత్మకమైన మనసు కాబట్టి దాని పాటికదే ధ్యానంగా పరిణమిస్తుంది.

70
నియతం కురు కర్మ త్వం- కర్మ జ్యాయో హ్యకర్మణః
శరీర యాత్రాపి చతే-న ప్రసిద్ధ్యే దకర్మణ॥   3-8

మనోనైర్మల్యంతో కర్మ చేసినా ప్రమాదం లేదని చెప్పారు బాగానే ఉంది. కాని ప్రతి దినమూ మనం జీవితంలో సాగించే కర్మకలాపమెంతో ఉన్నది.

Page 81