అలాగే ఆత్మ చైతన్యానికి వేరని చూస్తే ఈ శరీర మనఃప్రాణాదులన్నీ అనిత్యమే సందేహం లేదు. కాని వివేచన చేసి చూస్తే ఈ ఉపాధులన్నీ చైతన్య వివర్తమే గాని వేరుగావు. ఆదిలో కావు. అంతంలో కావు. నడుమ ఈ స్థితి కాలంలో ఇవి ఇలా కనిపిస్తున్నప్పుడు కూడా శరీరాదులుగా లేవివి వాస్తవంలో, ఇవన్నీ చైతన్య మెత్తిన రూపాలే. కాబట్టి చైతన్యాత్మకంగా మాత్ర మివి సత్యమే నిత్యమే. వాటి నలా చూడగలిగితే అంతా ఒకే ఒక ఆత్మ. అది మన స్వరూపమే కాబట్టి మనికిక దేనివల్లా భయం లేదు. విషాదం లేదు. అలా చూడలేకనే ఈ ఉపాధి వర్గం మనకు వేరుగా కనిపించటం. మనమీద దాడి చేయటం. తన్మూలంగా వాటి మార్పు మనకు కలిగే మార్పుగా వాటి వినాశం మన వినాశంగా భావించి భీతి చెందుతున్నాము. ఇదంతా ఆత్మానాత్మలను వివేచన చేయలేని అజ్ఞానం. ఈ అజ్ఞానంతో సాగించాలి మనం సంగ్రామం. సాగిస్తే నరులమైనా మనం విజయులమై ప్రకాశించగలం.
4
నజాయతే మ్రియతేవా కదాచిత్
నాయమ్ భూత్వా భవితావా నభూయః
అజో నిత్య శ్శాశ్వతో యమ్ పురాణో
నహన్యతే హన్య మానే శరీరే. 2-20
ప్రపంచంతో పోరాడితే మనకే విజయం లభిస్తుందని ఏమిటి నమ్మకం. మన మాత్మ స్వరూపులం. పరమాత్మ వారసులమే మనం. పరమాత్మవలన సృష్టి అయిందీ ప్రపంచం. ఆయన మాయాశక్తి విలాసమే కదా ఇదంతా. ఆయన వస్తువైతే ఇది తదా భాస. ఆభాస గనుకనే ఇది ఆరు రకాలైన పరిణామా లకు గురి అవుతూ ఉంటుంది. పుట్టటమూ - ఉండటమూ - పెరగటమూ మారటమూ - తరగటమూ - నశించటమూ ఈ ఆరు భావవికారాలనూ పొందని పదార్ధమే కానరాదు సృష్టిలో.
అయితే ఇవన్నీ ఈ జ్ఞేయ రూపమైన జగత్తుకే పరిమితం. దీనినంతటినీ భాసింపజేసే ఆత్మచైతన్యానికి లేవు. చైతన్య మనేది అజం. అజమంటే జన్మలేనిది. జన్మలేనిదంటే పై జెప్పిన ఆరు వికారాలలో మొదటిది లేదని అర్థం.
Page 8