తగిన కర్మ నాచరించాలి. అదికూడా మధ్యలో విడిచిపెట్టక గమ్యం చేరే దాకా అనుష్ఠిస్తూనే పోవాలి. అసలు అనుష్ఠించకున్నా సుఖంలేదు. అనుష్ఠిస్తూ అది ఫలించకుండా విడిచిపెట్టినా లాభంలేదు. ఇందులో మొదటిది సాధనం లేకుండా సాధ్యాన్ని ఆసించటమైతే రెండవది సాధ్యమైన జ్ఞానం కలగకుండానే సాధనాన్నే జారవిడవటం అవుతుంది. రెండూ తెలివితక్కువే.
అంతేకాదు. కర్మను ఆరంభించకపోతే ఎలా నైష్కర్మం సిద్ధించదో అలాగే సిద్ధి కలిగే లోపలనే దానిని వదిలేసినా ప్రయోజనంలేదు. సన్న్యాసమంటే వదులు కోవటమే. అది ఫలితం సిద్ధించిన తరువాత చేయవలసిన పని. ముందుగా కాదు. తొందరపడి ముందుగానే చేశామంటే ప్రారంభించి కూడా అది నిష్ఫలమే.
67
నహి కశ్చిత్ క్షణమపి-జాతు తిష్ఠ త్యకర్మకృత్
కార్యతే హ్యవశః కర్మ-సర్వః ప్రకృతిజైర్గుణైః 3-5
కాకపోయినా ఏపనీ చేయకుండా ఊరకకూచుందామంటున్నారే అది ఎలా సాధ్యం. అలా కూచోగలవా ఒక్క క్షణమైనా. ప్రతి క్షణమూ జీవితంలోఏదో ఒక పని చేస్తూ ఉండవలసిందే తప్పదు. మనసుతోనో మాటలతోనో - దేనితో నైనా సరే కర్మ అనేది దాని పాటికది జరుగుతూనే ఉంటుంది. నీవు చేయనని భీష్మించుకున్నా ప్రయోజనంలేదు.
ఏమీకారణం. ప్రకృతి అనేదొకటి ఉందికదా. అదే చేయిస్తుంది నీచేత. ప్రకృతి అచేతనం కదా ఎలా చేయిస్తుందని అడుగుతావేమో. సత్త్వమూ- రజస్సూ-తమస్సూ అని మూడు గుణాలున్నాయి దానికి. అవి బాహ్యంగానే కాక మానవుడికి లోపల కూడా ఓతప్రోతంగా అల్లుకొని ఉన్నాయి.
అవి పేరుకు మూడైనా ముప్పది మూడుకోట్ల అవతారాలెత్తి మన ప్రాణం తీస్తుంటాయి. ప్రతిక్షణమూ అవి రకరకాల మనోవృత్తులను రేకిత్తిస్తూ ఉంటాయి. అవి బాహ్యమైన శబ్దస్పర్శాదులతో లావాదేవీ పెట్టుకొంటాయి. దానితో ఒక అభేద్యమైన పద్మవ్యూహం తయారవుతుంది. ఈ వ్యూహంలో అభిమన్యుడి లాగా జొరబడటమే తెలుసునుగాని మనమనస్సుకు అందులో నుంచి బయట పడటం తెలియదు.
Page 79