అయితే ఇక్కడ ఒక ఆశంక. జీవుడూ దేవుడూ ఇద్దరూ చైతన్యస్వరూపులు ఇద్దరూ ఒకటే తత్త్వమని గదా వక్కాణించారు. అలాంటప్పుడా దేవుణ్ణి బాధిం చని మాయాశక్తి ఈ మానవుణ్ణి మాత్రమే పట్టి పీడించడ మేమిటి.
అదీ నిజమే. పీడించరాదు వాస్తవంలో, ఎందు కంటే మీరన్నట్లు జీవేశ్వరు లిద్దరూ జ్ఞాన స్వరూపులే. అయితే వచ్చిన తిరకాసేమంటే జీవుడు జ్ఞాన స్వరూపుడే అయినా ఆ జ్ఞానం ఈశ్వరుడి జ్ఞానం లాగా పరిపూర్ణమైనది గాదు. ముప్పాతిక మూడు పాళ్ళది దోపిడి అయిపోయింది. దోపిడీ చేసిన ఆ గజదొంగ కూడా ఎవరి గాదు. ఈ మాయే. మాయ అయినా ఎలా చేయగలిగిందా అపహరణ. అపహరిస్తే ఆ ఈశ్వరుడి జ్ఞానం కూడా హరించవచ్చు గదా.
ఐశ్వరమైన జ్ఞానాన్ని హరించజాలదది. కారణం దానిలో అలాంటి అవ కాశం లేకపోవటమే. అవకాశం దానికొక్క మానవుడిలోనే దొరికింది. అది ఏదో కాదు. అసురమైన భావమే. అసురుడికి సంబంధించింది అసురం. అసుర అంటే సుర కానిది. సురత్వ మంటే స్వస్వరూపంలోనే రమించడం. అలాంటి స్వరూప రతిని కోలుపోతే అది అసుర భావం. మరొక్క మాటలో చెబితే జ్ఞానం జ్ఞానాత్మకంగానే ఉండక జ్ఞేయ జగత్తులోకి తొంగి చూడట మని అర్ధం. ఇలాంటి అసురత్వమెప్పుడేర్పడిందో అప్పుడే జ్ఞానం తన అఖండత్వాన్ని కోలుపోయి మాయకు లోబడి పోయింది.
అయితే ఈ అసుర భావం మాత్ర మెందు కేర్పడాలి మన జ్ఞానానికి. మూఢత్వం వల్లనే నని జవాబు. మూఢత్వ మంటే ఏదో గాదు, జ్ఞానానికి సహ జంగా ఉండవలసిన హుషారు లేకపోవడం. హుషారుగానే ఉంటే నిరంతరమూ ఆత్మ పరామర్శ చేసుకుంటూ ఉండేది. పరామర్శ చేసుకొంటే పరాకు ఉండేది కాదు. కాబట్టి అసుర భావానికి కారణం మోహమే.
మరి ఈ మోహానికి కారణ మేమిటని ప్రశ్న. దానికి కారణం దుష్కర్మల సనుష్టించటం. జన్మ జన్మల నుంచీ చేసుకొన్న పాప కర్మలు బండ్ల కున్నాయి. అవి పరిపక్వమయి మనకు మోహాన్ని కల్పించాయి. ఆ మోహ మనేది అసుర మైన భావాన్ని రేకెత్తించింది. దాని నాసరాగా చేసుకొని మాయ మన జ్ఞాన ధనాన్ని ఊచముట్టగా దోచుకున్నది, జ్ఞానాపహరణం మూలంగానే ప్రకృతి గుణాలకు మనం దాసోహ మనవలసి వచ్చింది. మరి గుణాతీతమైన భగవ త్తత్త్వాన్ని ఎలా పొందగలం.
Page 43