సంసారం కాబట్టి దీనిలో ఇలాంటి పరిణామాలు కలుగుతూ పోవటం సహజమే. కాని అవి ఈ ప్రకృతి మేరకు వచ్చి నిలచి పోవలసిందే. దాని ప్రతి అణువునూ వ్యాపించి ఉన్న ఆ చైతన్యాన్ని మాత్రమివి ఏ మాత్రమూ స్పృశించ లేవు. కారణం అది ఆకాశంలాగా నిరాకారం. నిరంజనం. ఆకాశమైనా ఇంకా జడమైన పదార్థం. పోతే ఇది జడంకాదు. శుద్ధ చైతన్యం. దాని నిక ఏగుణం గానీ అంటే దేముంది. గుణాలేవైనా దానికి విషయం కావలసిందే గదా. విషయమైతే దానికి బాహ్యంగా ఉండవలసిందే. సన్నిహితం కాదు. సన్నిహితం కాకపోతే అంటుకొనే ప్రశ్నలేదు.
5
దేహీ నిత్య మవధ్యోయమ్-దేహే సర్వస్య భారత
తస్మా త్సర్వాణి భూతాని-నత్వం శోచితు మర్హసి . 2-30
పరమాత్మను వర్ణించిన ఘట్టమయింది. ప్రస్తుతం జీవాత్మను వర్ణించే ఘట్టమిది. పరమాత్మ వంటిదే జీవాత్మ. ఎందుకంటే అదీ చైతన్యమే. ఇదీ చైతన్యమే. అయితే అది విశ్వవ్యాప్తం కాబట్టి అఖండం. ఇది శరీర మాత్ర పరిచ్ఛిన్నం కాబట్టి సఖండం. అంతే తేడా.
ఒక జీవాత్మ ఏమిటి. ప్రపంచమంతా చైతన్యమయమే గదా. వాస్తవమే. కాని ఈ ప్రపంచంలో ఆ చైతన్య మెక్కడ బడితే అక్కడ ఉద్భూతం Manifest కాదు. ఒక్క జీవ చ్ఛరీరం లోనే Living organism అది చక్కగా అభివ్యక్తమయి కనిపిస్తుంది. ఇంతెందుకు మన ముఖాని కెదురుగా ఒక గోడ ఉంటుంది. తడికె ఉంటుంది. అద్దముంటుంది. అద్దంలో ప్రతి ఫలించినట్టుగా అది తడికెలో గాని కుడ్యంలోగాని ప్రతిఫలించదు గదా. అలాగే చైతన్యం కూడా. అందుకే ఈ జీవుడొక్కడే దేవుడికి వారసుడని చెప్పటం. సృష్టిలో మరి దేనికీ ఆ యోగ్యత లేదు.
జీవుడికి కూడా ఈశ్వరుడికి లాగే ఒక శరీర మున్నది. అది బ్రహ్మాండ మయితే ఇది పిండాండ మన్నారు. ఆ శరీరాన్ని అది వ్యాపించినట్టే ఈ శరీరాన్ని ఇదీ వ్యాపించి ఉంది. అది ఎలా నిత్యమో ఇది కూడా అలాగే నిత్యం. నిత్యం కానిదీ నిరంతరం మార్పు చెందేదీ అక్కడా ఇక్కడా ఈ శరీరమే. మన ఈ శరీరం పుడుతుంది. గిడుతుంది. కాని దీనిలో ఉన్న అహమనే స్ఫురణకు మాత్రం పుట్టుక గిట్టుకా లేదు. మధ్యలో కూడా ఎలాటి వికారాలూ Changes లేవు.
Page 10