#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

  ఈ అద్వైత భావమే అద్వైతంలో ఉండే ఈ సమన్వయమే మనకు ఇంకా స్పష్టంగా వివరించి చెబుతున్నాడు వ్యాసభగవానుడు. అంతటా ఉన్నా మనకంతు పట్టక పోయే సరికది తమస్సులాగా అసలే లేని పదార్ధమేమో నని ఆ శంక కలగవచ్చు మానవులకు. తమస్సులాగా అభావం కాదు. జ్యోతిషా మపితత్ జ్యోతిః - జ్యోతిస్సులాగా భావ భూతమైన పదార్ధం. జ్యోతి స్సనగానే భౌతికమైన సూర్యచంద్రాగ్నుల లాంటిదను కొంటారేమో. కాదు. వాటికి కూడా వెలుగును ప్రసాదించే పెద్ద వెలుగు. ఆత్మకే అన్నీ స్ఫురిస్తున్నాయి. ఆ స్ఫూర్తి లేకపోతే ఇవి స్ఫురిస్తున్నా యనేందుకు ప్రమాణమే లేకుండా పోతుంది. కాబట్టి అదే జ్యోతులకు జ్యోతి. పరం జ్యోతి. స్వయం జ్యోతి. అంతేకాదు. తమసః పరముచ్యతే. తమస్సుకు అతీతమైనది విలక్షణమైనది. తమస్సంటే అజ్ఞానం. ఆత్మ జ్ఞాన స్వరూపం కనుక దానికీ దీనికీ సంబంధమే లేదు.

  అంతేకాదు. అసలు విషయమేమంటే అది దీనికంటే దానికంటే విలక్షణమని పేర్కొనటం కూడా పొరబాటే. ఎందుకంటే ఇదీ అదీ అనే వెక్కడ ఉన్నాయసలు. ఆత్మ తత్త్వానికి అన్యంగా ఏదీ లేదు గదా సృష్టిలో. ఇదం సర్వం యదయ మాత్మా - ఆత్మై వేదం సర్వ మన్నప్పుడు ఆత్మ తప్ప ఏముందని. జ్ఞానమనీ జ్ఞేయమనీ జ్ఞాన గమ్యమనీ నీవనవసరంగా వికల్పించి చూస్తున్నావు దాన్ని. దానిపాటికది ఎప్పుడూ నిర్వికల్పమే.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు