ఉపోద్ఘాతము
నేను తలపెట్టిన భగవద్గీతా సర్వస్వ ప్రణాళికలో మొదటి షట్క మెలాగో పూర్తి చేసి ప్రకటించగలిగాను. మొట్ట మొదట అది వ్రాసి దానిని వెలుగులోకి తేవట మసాధ్యమని భయపడ్డానే గాని దైవికంగా ఎలాగో ఫలించిందా ఉద్యమం. వార్ధక్యం వల్లనైతే నేమి తన్నిమిత్తంగా ఏర్పడే అలసత్వం వల్లనైతేనేమి అలా భయపడటం సహజమే. అయినా సాధించగలిగానంటే దానికి కారణం కొంత నాలో నిరంతరం సాగే పరమార్థ చింతనా ప్రాబల్యమైతే మరికొంత మీబోటి తత్త్వ జిజ్ఞాసువులు నాకిస్తున్న ప్రోత్సాహమను కోవచ్చు. ఏదైతేనేమి. మొత్తం మీద ఒక మజిలీ దాటి వచ్చాము. దాని ఫలితంగా మొదటి షట్కం మీచేతికి వచ్చింది. అది వచ్చి కూడా సరిగా ఆరుమాసాలు పైగా గడచింది.
పోతే ఈ ఆరు మాసాలు కృషి చేసి మరలా ఇప్పుడు నేను రెండవ షట్కం కూడా వ్రాసి ముద్రించ గలిగానంటే చెప్పాను గదా అది మీరిస్తున్న ప్రోత్సాహమే. కొందరు గాకున్నా కొందరైనా శ్రద్ధాసక్తులతో మొదటి సంపుటం చదివి ఎంతో గొప్పగా ఉందని ప్రశంసించటం జరిగింది. కనుక లేని ఓపిక తెచ్చుకొని ఇప్పుడీ రచన కూడా సాగించి మరలా మీకందివ్వ గలిగాను. మొదటి దానిలో నా అనవధానం వల్లనూ ముద్రాపకుల అజాగ్రత్త వల్లనూ కొన్ని అచ్చు తప్పులు దొర్లాయి. ఈసారి అలా కాక చాలా సూక్ష్మంగా