#



Back

Page 4

అద్వైత విజ్ఞాన సారము

అయితే ఒక్క మాట. ఆత్మాకార వృత్తి అనేది మనసులో కలిగేది కదా ! మరి బాహ్యమైన అనాత్మ ప్రపంచం దాని వల్ల ఆత్మగా మారటమెలా సంభవం. ఎందు కంటే ఒక పట్టణం తాలూకు వృత్తి వేరు. ఆ పట్టణం వేరు. పట్టణానికి సంబంధించి మనసులో కలిగే వృత్తే పట్టణం కాదు. ఇది దాని ప్రతి చ్ఛాయ పట్టణమనేది బాహ్యంగా ఉన్న పదార్ధం. అది బింబమైతే దాని ప్రతిబింబమే మన మనసులో ఏర్పడే వృత్తి. ఇదే బింబం కాదు. ఈ ప్రతి బింబాన్ని బట్టి ఆ బింబమెక్కడ ఉందో అన్వేషిస్తూ పోవాలి. అప్పుడే దాన్ని మనం చూడగలం. ప్రస్తుతం మీరు చెప్పేది చాల విడ్డూరంగా కనిపిస్తుంది. ఆత్మాకర వృత్తి అంటున్నారు. ఈ వృత్తే ఆత్మ ఎలా కాగలదు ? వృత్తి మానసికం. ఆత్మ తద్వి లక్షణం.

ఇది ప్రతి ఒక్కరికీ పట్టుకున్న సందేహం. దీనికి సమాధాన మేమంటే లోకం లాంటిది కాదిక్కడ వ్యవహారం. లోకంలో వస్తువెక్కడో ఉంటే దానికి చెందిన భావం మాత్రమే మనసులో ఏర్పడుతుంది. రెంటికీ ఎంతో కొంత దూరముంటుంది. కనుక ఇదే అది కాదు. పోతే ఇక్కడ వస్తువేదో కాదు. సచ్చిత్తులని చెప్పాము. అది సామాన్య రూపం గనుక లోపల వెలపల అనే తేడా లేకుండా సర్వత్రా వ్యాపించి ఉంది. అలాంటప్పుడు తదాకారమైన జ్ఞానానికి భిన్నంగా అది ఇక ఎక్కడ ఉండగలదు పైగా జ్ఞేయం కాదది. కేవలం జ్ఞానమే. నిరాకారం గనుక సర్వవ్యాపకం. సర్వ వ్యాపకమనే వృత్తే మనకేర్పడే వృత్తి కూడా. అలాంటప్పుడు రెండు వ్యాపకాలెలా ఉండగలవు ? రెండూ కలిసి ఒకటే కావలసి ఉంది. ప్రమాణమైన వృత్తికి భిన్నంగా ప్రమేయమైన ఆత్మ లేదు. అది ప్రమేయం కాదు కూడా.

కనుకనే ఆత్మాకారమైన వృత్తి అఖండమని పేర్కొనటం. అఖండమైన జ్ఞానమే కదా ఆత్మ. అంచేత ప్రమాణమైనా అదే ప్రమేయమైనా అదే. తానే ప్రమాణమై తానే దానికి ప్రమేయమై తన్ను తనే పట్టుకుంటున్నది. ’ధ్యానే నాత్మని పశ్యంతి - కేచిదాత్మాన మాత్మనా’ - అని శాస్త్రం చెపుతున్నది. తానే అని తెలియక తన స్వరూపాన్ని వృత్తి జ్ఞానమనే ప్రమాణంతో అన్వేషించి అన్వేషణ పూర్తి అయ్యే సరికి అది తానేనని గ్రహించటమే చివర కద్వైత సాధన. ఒక విధంగా సిద్ధ సాధన మిది.

ఇంతకూ కొండను త్రవ్వి ఎలుకను పట్టి నట్టయింది మనం. మన స్వరూపాన్ని మనమే మరచి పోయి మరల మనమే దాన్ని ఫలానా అని గుర్తించాము. కనుకనే ఒక రహస్యం గుర్తుంచుకోవాలి మనం. అద్వైతంలో క్రొత్తగా ఏదో ప్రయత్నించి పట్టుకుంటామనే ప్రశ్నే లేదు. ఉన్నదేదో అదే ఉంది. లేని దసలు లేనే లేదు. లేనిదాన్ని లేదనుకోవటం - ఉన్న దాన్ని ఉందనుకోవటమే అద్వైతులు చెప్పే సాధన. మెడలో ముత్యాల హారం ఉన్నా గుర్తులేక ఎక్కడో తీసి పెట్టామని వెతుకుతూ వచ్చాము. చివరకయ్యో నామెడ లోనే ఉందని గుర్తించి వెతకటం మానేశాము. ఆత్మాన్వేషణ ఇలాంటిది. "ప్రావ్తస్య ప్రాప్తి:" అంటాఋ దీన్ని పొందిన దాన్నే పొందటం. అలాగే "పరిహృతస్య పరిహార:" వదిలేసిన దాన్నే వదులు కోటం. అనాత్మ విషయం ఇలాంటిది. ఇది నాకు అన్యంగా లేకున్నా ఉందని భావించము. పూల దండ కాలికి తగిలితే పామని ఉలికిపడ్డట్టు. దీపం వెలుగులో చూచి పాము లేదనుకొన్నట్టే మరల ఈ అనాత్మ జగత్తు లేదని గ్రహిస్తాము.

ఇంతకూ విషయ మేమంటే అనాత్మ ఉందనే భ్రమ ఒకటి - ఆత్మలేదనే భ్రమ ఒకటి రెండూ భ్రమలే మనకు. ఇవి రెండూ పోనంత వరకూ సమస్య సమస్యే. పరిష్కారం లేదు. భ్రమ తొలగించు కోటమే పరిష్కారం. రెండింటిలో ఆత్మ లేదనే భ్రమే మొదట తొలగించు కోవలసింది. ఎందుకంటే ఒకటి పట్టుకొంటే గాని ఇంకొకటి వదిలేయటం సాధ్యం కాదు. కనుక ఆత్మను పట్టుకొనే అనాత్మ భావాన్ని కొట్టి వేయాలి. ఆత్మ నెలా పట్టుకోవటం ? నా స్వరూపాన్ని దేహాది సంఘాతంగా కాక సచ్చిదాకారంగా భావిస్తూ పోవాలి. అలా భావిస్తే మనసులో తదాకార వృత్తి ఏర్పడుతుంది. అది మహా సామాన్యం కనుక ఆ దృష్టితో చూస్తే దృశ్య ప్రపంచ మంతా తదాకా రంగానే మారి కనిపిస్తుంది. వస్తువైతే మారదు. ఆభాస అయితేనే మారుతుంది. ప్రపంచ మాత్మకు ఆభాసే గనుక ఆత్మ ఫలానా అని గుర్తిస్తే చాలు. అందులోనే అనాత్మ కూడా లయమౌతుంది.

అయితే ఒక చిక్కున్న దిక్కడ. మనసనే ప్రమాణం మన దగ్గరే ఉంది. పరమాత్మ అనే ప్రమేయ మెక్కడబడితే అక్కడ ఉన్నది. అయినా ఇది దాన్ని పట్టుకోలేక పోతున్నది. అంటే తదాకార వృత్తి ఏర్పడడ మసాధ్యమని తోస్తుంది. సాధ్యమే అయితే శ్రవణం చేసిన ప్రతి వాడికీ కలగాలి కదా ఆ వృత్తి. ’మనూష్యాణాం సహస్రేషు’ అన్నట్టు కోటి కొకడికి కలిగితే ఎక్కువ. ఏమి కారణం ?

ప్రమేయం తప్పు కాదది. సర్వత్రా అది ప్రాకాశిస్తూనే ఉంది. పోతే దాన్ని పట్టుకొనే మనసనే ప్రమాణం తాలూకు దోషమే కావాలి. వస్తు సిద్ధమైనా బుద్ధి సిద్ధం కావటం లేదు. కాకపోవటానికి బుద్ధిదే దోషం. ఇది రెండు విధాలు. ఒకటి ఆవరణం. మరొకటి విక్షేపం. ఆవరణమంటే మాలిన్యం. ఒక అద్దానికి అంటిన మసిలాంటి దది. మసి పూసిన అద్దమెలా కనపడదో అలాగే కొన్ని బుద్ధులు సహజంగానే అసమర్ధమై ఉంటాయి. ఒక గొప్ప భావాన్ని ఎంత బోధించినా అందుకో లేవు. అలాగే మరి కొన్ని బుద్ధులు విన్న వెంటనే అందుకోగలవు. వాటికా సామర్ధ్య ముంది. కాని అవి చెప్పిన విషయాన్ని గాక దానికి భిన్నంగా మరేదో పట్టుకొని సతమతమౌతాయి. ఇది పగిలిపోయిన అద్దంలాంటిది. బింబం కనపడుతుంది కాని ముక్కలు చెక్కలయి కనిపిస్తుంది. ఇందులో మొదటిది ఆవరణం. రెండవది విక్షేపం. ఒక మనస్సు కసలు స్ఫురించదు. మరొక దానికి ఛినా భిన్నంగా స్ఫురిస్తుంది. ఇదే మన కవస్ధాత్రయ రూపంగా తయారయింది. సుషుప్తిలో అసలే లేదు స్ఫూర్తి. జాగ్రత్ స్వప్నాలలో ఉన్నా అది ఆయా విశేష రూపాలుగా స్ఫురిస్తున్నది.

కనుక ఆత్మాకార వృత్తి కలగాలంటే శ్రవణాదుల మాట అటుంచి ముందు మన మనస్సును సంస్కరించుకోవాలి. అందుకే కర్మ యోగ మొకటి ఉపాసనా లేదా భక్తి యోగ మొకటి చెప్పవలసి వచ్చింది శాస్త్రం. నిషిద్ధ కామ్య కర్మలు రెండూ మానేసి సత్కర్మలు మాత్ర మాచరిస్తూ పోతే మనస్సుకు శుద్ధి ఏర్పడుతుందని చెబుతారు. కాని కేవల కర్మానుష్ఠానం కన్న కర్మ యోగం మంచిది. అందులో ’అహం’ ’మమ’ లుండవు. అలాగే సమాధి, భక్తి యోగాల వల్ల మనసు కొక లక్ష్యం మీద ఏకాగ్రత ఏర్పడుతుంది. శుద్ధి మాలిన్య రూపమైన ఆవరణానికి జవాబు చెపితే - ఏకాగ్రత విక్షేపానికి చెబుతుంది. దానితో మనసు బాగా పరిపాకానికి వచ్చి పదునెక్కి శ్రవణాదులు చేయటానికి కున్ముఖ మౌతుంది. కనుక ఆత్మాకార వృత్తి ఉదయించటానికిక అభ్యంతరం లేదు.

అయితే ఇది సాంప్రదాయికంగా చెప్పిన మాట. సాధకుడైన వాడు చెప్ప వలసిందేమంటే కర్మ, భక్తి, సమాధులు ప్రత్యేకంగా ఒక్కొక్కటే అభ్యసిస్తూ పోతే అందులోనే పడిపోయే ప్రమాద ముంది. అది జ్ఞానానికి దారి తీసే ఆలంబనమే గాని గమ్యం కాదనే ఆలోచన రాదు మానవుడికి. ఏది అలవాటైతే అది వదులుకోటం కష్టం. కాబట్టి అవి ఏవో వేరుగా ఉన్నాయను కోకుండా ఆత్మను గురించి చెప్పే మాటలు నిరంతరమూ వింటూ ఉండటమనే కర్మ చేస్తూ ఉంటే చాలు. అదే కర్మ యోగం. సత్సంగమూ, సద్గోష్ఠి, సద్గ్రంధ పఠనమూ, ఇదే కర్మ యోగం, జ్ఞానాని కుపకరించే కర్మే నిజమైన యోగం. అలాగే ఆ స్వరూపం మీదనే మనసు నిలపటం సమాధి యోగం. నిరాకారమైన దానినే సాకారమైన ప్రతి పదార్ధంలోనూ దర్శిస్తూ పోవటమే అసలైన భక్తి యోగం. ఈ విధంగా ఇవి మూడూ జ్ఞానంలో మూడు భాగాలుగా మారి దానితోనే ముడిపడి ఉండటమే యోగమనే మాట కర్ధం. అప్పుడే అన్నింటికీ కలిపి ఏక వాక్యత లేదా ఏక సూత్రత ఏర్పడుతుంది. ఒకే ఒక సూత్రంలో మూడూ పూసలుగా మారి కనిపిస్తాయి. ఇదే అసలైన అద్వైత సాధన.

అయితే ఇప్పుడు మరి ఒక ఈతి బాధ ఉంది ఈ సాధన మార్గంలో. అనుకున్నంత సులభం కాదిది. కాకుల లెక్కగా సిద్ధాంతం మాటాడినా కార్యరంగంలోకి దిగితే ఎన్నో ఉన్నాయి చిక్కులు. ముందు పేర్కొన్న ఆవరణ, విక్షేపాలు అలా ఉంచి అసలు సాధనే మనం చేయగలమా అని సందేహం. ఎందుకంటే ప్రారబ్ధ మనేది ఒక దయ్యం లాగా తయారయింది మన జీవితంలో. జీవిత మంతా అదే రాజ్యం చేస్తున్నదిక్. ప్రాప్తం లేనిదే ఏదీ అలోచించలేము. చేయలేము. ఫలిత మాశించలేము. అంతా మన అధీనంలోనే ఉంటే అందరూ అన్నీ సాధించ వచ్చు గదా! సాధించటం దేవుడెరుగు. అసలు బుద్దే పుట్ట దెంతో మందికి ’శ్రవణాయాపి బహు భిర్యో నలభ్య:’ - అని శాస్త్రమే చాటుతున్నది. అలాంటప్పుడిక మన ప్రయత్న మేమిటి ఫలితమేమిటి. వ్రాసి పెట్టక పోతే ఏదీ లేదు. జీవితంలో ధన ధాన్య వస్తు వాహన పుత్ర పౌత్ర సుఖ దు:ఖాది భావా లెలా ప్రారభ్దాని కధీనమో అలాగే అధ్యాత్మ జీవితంలో కూడా శ్రవణ సాధన ఫలాను భ్గవాధులు కూడా ప్రారబ్ధాధీనమే. అలాంటప్పుడు దానికే వదిలేస్తే సరిపోదా. ప్రయత్నం పెట్టుకొనే చింత మనకు దేనికి ?