#



Back

Page 5

అద్వైత విజ్ఞాన సారము

ఇది ఒక పెద్ద అపోహ. పిన్నలు పెద్దలు చాలా మందికి పట్టుకున్న జిడ్డిది. యధార్ధ మేమిటో తెలియక గాబరా పడుతున్నారందరూ. ప్రారబ్ధ మున్నదనే మాట వాస్తవమే. అది మామూలు లోకులకే కాదు. జీవన్ముక్తుడికి కూడా ఉంది ఆమాటకు వస్తే. కాని దానితో పాటు పురుష ప్రయత్నం కూడా ఒకటుందనే సత్యం మరచి పోతున్నారు. ప్రారబ్ధం మన ప్రయత్నాని కడ్డురాదు. ఎలాగంటే భూతానికి సంబంధించినది ప్రారబ్ధం. భవిష్యత్తుకు చెందినది ప్రయత్నం. అది అతీతమైతే ఇది వర్తమానం. జీవుడు భోక్తే గాక కర్త కూడా. భోక్త గనుక ప్రారబ్ధ ఫల మొక ప్రక్క అనుభవిస్తుంటాడు. కర్త కనుక మరొక ప్రక్క ప్రయత్నం సాగిస్తుంటాడు. అలా కాకుంటే అసలీ ప్రారబ్ధ మెలా తయారయింది. ఒకప్పుడు మానవుడు చేస్తేనే కదా. కాబట్టి అనుభవించే గుణమెలా ఉందో చేసే లక్షణం కూడా ఉంది మనకు. రెండింటి సంగమ స్ధానమే మన ఈ వర్తమాన జీవితం.

అంచేత మనమిక బీద పలుకులు పలకరాదు. ప్రారబ్ధ ఫలానుభవం తప్పించుకొనే శక్తి లేదు మానవుడికి. కాని ప్రయత్నం చేసి జీవిత గమ్యాన్ని అందుకోటాని కెంతైనా ఉంది అవకాశం. గతం మన వశంలో లేకపోవచ్చు. భవిష్యత్తు అంతా మన కధీనమే. కనుక ప్రారబ్ధం కొద్దీ ఎప్పటికప్పుడు సుఖదు:ఖాదు లనుభవిస్తున్నా దానితో పాటు ఎప్పటికప్పుడు శ్రవణ మననాదులు కూడా ప్రయత్నంతో సాగించవచ్చు. ప్రారబ్ధ మింతకు ముందు చేసిన అప్పు. అనుభవిస్తే తీరిపోతుంది. ఎంత కాలం బాధించదు. ప్రయత్న మలా కాదు. అది నిత్యమైన ఆత్మకు సంబంధించిన నిక్షేపం. తీరిపోయేది కాదిది. అక్షయంగా ఉండిపోయే ధనం.

కాబట్టి ప్రారబ్ధం మీద కాదు చూపు పెట్ట వలసింది. పెడితే అదే మనకొక ప్రారబ్ధ మౌతుంది. మరెక్కడ పెట్టాలి దృష్టి. ఆత్మ జ్ఞానం కోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయటంలో. మొదటిది ప్రతిలోమమైతే రెండవది అనులోమం. కనుక ఎంత చేస్తే అంత ఫలిత మిస్తుంది. ప్రారబ్ధం ఫలానుభవంతో సమసిపోయేదయితే - ప్రయత్నం సమసిపోని ఫలానుభవం. కాబట్టి ఆత్మ సాధకుడిక వెనక్కు చూడకుండా ముందుకు దూసుకొని పోవటమే. వెనక్కు తిరిగితే పారబ్ధమే కనిపిస్తుంది. ముందుకు పోతే ప్రయత్నం ఫలిస్తుంది. చివరకు మోక్షమనే మహాఫలాన్నే సాధకుడు చవి చూడగలడు.

అయితే ప్రయత్న మన్నారు. ఎంత కాలం చేయాలది? ఎలా చేయాలి ? అన్ని పనులు మానుకొని అదే పట్టుకొని కూచోవాలా? లేక మిగతా పనులు చేస్తూ ఇదీ చేయవచ్చా ? అలా చేస్తూ పోతే ఎప్పటికి ఫలితమిస్తుంది. జీవితంలో ఇస్తుందా ? లేక మరణానంతరమా . ఎలా ఉంటుందా ఫలితం ? అది మరణానికి ముందే కలిగితే మరణమెలా ప్రాప్తిస్తుంది ? అనంతరమైతే కలిగిందో లేదో నమ్మకమేమిటి - అని ప్రశ్న పరంపర ఎదురౌతుం దిప్పుడు.

ఒక్కొక్కటి పరిశీలించి చూతాము. ఎంత కాలం చేయాలని గదా ప్రశ్న. "సతు దీర్ఘ కాల నైరంతర్య సత్కార సేవితో దృఢ భూమి:" అన్నాడు పతంజలి. ఇంత కాలమని పరిమితి లేదు. ఫలితాన్ని బట్టి ప్రయత్నం. వడ్ల దంపకం వంటిదని చెప్పాము. బియ్య మయ్యే వరకు ఎలా దంచుతూ పోవాలో అలాగే ఆత్మ దర్శన మయ్యే వరకు సాధనే. అది నైరంతర్యం. అంటే పది రోజులకో పది నెలలకో ఒక సారిగా కాక ప్రతి క్షణమూ కనీసం ప్రతి దినమూ సాగాలి. అలాగే మొక్కుబడి తీర్చినట్టుగా గాక ఇది మన జీవితమే నని సత్కార బుద్ధితో జరగాలి. అలా అయితేనే గట్టి పడుతుంది.

అంతే కాదు. ప్రతి దినమూ కూడా దినమంతా మనది కాదు. స్వప్న సుషుప్తులు రెండూ ప్రారబ్ధాని కధీనం. ప్రయత్నాని కాస్కారం లేదక్కడ. పోతే ఇక జాగ్రత్తు. అందులోనూ రోగాలు రొష్టులు, పెండ్లిండ్లు, పేరంటాలు, ఇల్లు వాకిలి ఏర్పాట్లు చుట్టు పక్కాలు లోక వ్యవహారాలు ఎన్నో అవసరాలు ఏర్పడుతుంటాయి. అలాంటప్పుడీ ఆత్మాకార వృత్తినే పట్టుకొని కూచోలేము. జారిపోతుంటుంది. అసలు పత్తా లేకుండా ఎగిరిపోయినా ఆశ్చర్యం లేదు. అంచేత మన పనులతో పాటు అది కూడా పాటించట మనేది పొసగదు. పోనీ పనులు మానుకొని చేద్దామంటే జీవిత అవసరాలకు స్వస్తి చెప్పి బ్రతకలేము. పనులు పూర్తి అయిన తరువాత సాగిద్దామా అంటే మళ్ళీ పనులు పడితే మాసిపోతుంది. అది కేవలం గజస్నానమే.

మరి ఎలాగా పరిష్కారం. అందుకే అత్యవసరమైన పనులు మాత్రం పెట్టుకోమన్నారు శాస్త్రజ్ఞులు. ’యుక్త చేష్టస్య కర్మసు’ అలాగైతే అవకాశ మంత కంతకు ఎక్కువగా దొరుకుతుంది. అప్పుడు బాగా అభ్యాసం చేస్తూ పోవచ్చు. అది బలం పుంజుకొని ఆ సంస్కారం పనులు పెట్టు కొన్నప్పుడు కూడా పనిచేస్తుంది. పనుల వల్ల కలిగే భారం దీని వల్ల తగ్గుతూ వస్తుంది. ఇదే ఉపాయం. వేరొకటి లేదు. కొంత కాలానికి జ్ఞానానుష్ఠానమూ జీవితావసరాలూ రెండూ పరస్పర విరోధం లేకుండా రాజీ పడి ఏక కాలంలో జోడు గుర్రాల లాగా దౌడు తీస్తూ పోతాయి. భయం లేదు. కనుక ఆత్మ వ్యవహారాని కడ్డు తగలదు. ఇదీ దాని కడ్డు రాదు. సాధన చేసే వాడికి గాని ఈ రహస్యం తెలియదు.

పోతే ఎలా చేయాలి సాధన అని అడిగితే చెబుతున్నాము. యోగుల లాగా కళ్ళు మూసుకొని చేసే సాధన కాదిది. ఉపాసకుల లాగా ఒక మంత్రమో దేవతనో పట్టుకొని కూచోటమూ కాదు. కర్మిష్ఠుల లాగా మొక్కుబడి తీర్చినట్టు అయా కర్మ లాయా సమయాలలో ఆచరించి మిగతా సమయ మంతా లోక వ్యాసంగంతో గడపట మంత కన్నా కాదు. మరేమంటారు. అవన్నీ ఏక దేశ దృష్టి. నేను వేరు - ఈ చూచే జగత్తు వేరు - ఆ ఈశ్వరు డెక్కడో ఉన్నాడు వాడు వేరు - ఏదో చేసి ఏదో అందుకోవాలనే భేద భావన వదల కుండా చేసే సాధనలు.

పోతే మన దలాంటిది కాదు. నేనేమిటి ? నాదేమిటి ? మరొక టేమిటి - ఏది స్ఫురిస్తే అదంతా నా స్వరూపమే - అదే సర్వత్రా పరచినట్టు కనిపిస్తూ ఉందని ’అహం’ ’మమ’ లు రెండూ రెండుగా కాక ఏకం చేసి అది నా స్వరూపమని ఆత్మ దృష్టితో చూస్తూ పోవటమే మన సాధన. ఆత్మను ప్రపంచంగా కాదు ప్రపంచాన్ని ఆత్మగా దర్శించాలి. పరమాత్మ ప్రపంచమైతే ప్రమాదం. ఏక మనేక మౌతుంది. నిరాకారం సాకారమౌతుంది. పరిపూర్ణం పరిచ్ఛిన్న మౌతుంది. అలా కాక ప్రపంచాన్నే పరమాత్మగా చూస్తే ఆ మూడు దోషాలూ తొలగి పోతాయి. ద్వైతంగా కాక అప్పు డద్వైతంగా అనుభవ మేర్పడుతుంది. ద్వైతానుభవమే అయితే అది ఇప్పుడే ఉంది మనకు. క్రొత్తగా దాని కోసం ప్రాకులాడటం దేనికి. ముందు చెప్పిన వన్నీ ఇలాంటి ద్వైత సాధనలే. కనుకనే అవి సమస్యకు పరిష్కారం కావు. పరిష్కార మిప్పుడు చెప్పిన అద్వైత సాధనే. ఇది జీవ జగదీశ్వరులను మూడింటినీ ఆత్మా కారంగా మార్చి చూపుతుంది కనుక పరిష్కారం ఇదే నని సిద్ధాంతం చేశారు మన పెద్దలు.

అది ఎలాగా ఆ ప్రక్రియ అని అడగవచ్చు. సాధకుల కోసం కొన్ని మాటలు. చెప్పవలసి ఉందిక్కడ. సామాన్య విశేషాలు రెండూ కలిసే ఉంటాయని మొదటి నుంచీ చెబుతూనే వచ్చాము. సామాన్య స్పర్శ లేని విశేష మంటూ ఏదీ లేదు. కాని మన దృష్టి ఎప్పుడూ విశేషానికే అలవాటు పడ్డది. అందుకే వాటిలోనే కూరుకుపోతున్నది. ఎంతెంత దిగిపోతుందో అంతంత సామాన్యానికి దూరమవుతూ ఉంది. సామాన్య మక్కడ లేక కాదు. వస్తుసిద్ధంగా ఉండనే ఉంది. ఎటువచ్చీ అది మనకు బుద్ధి సిద్ధం కావటం లేదు. బుద్ధి దాని మీద పడితే చాలు సిద్ధంగా ఉంది ప్రతి ఫలించటానికి. ప్రతి ఫలిస్తే చాలు బుద్ధి దర్పణం దానితో నిండిపోతుంది. పోతే అది ఇక బుద్ధి కాదు. ఆత్మే. అది మహా సామాన్యం కాబట్టి లోపల ఆలోచన బాహ్యంగా పదార్ధం అనే తేడా లేదు. మహా అయితే లోపల చిత్సామాన్యం - వెలపల సత్సామాన్యం. దానితో దీన్ని చూస్తూ పోతాము కాబట్టి అది దీనిలో ఇది దానిలో కలిసి సచ్చిదాకారంగా ఒకే అఖండమైన అనుభవం కలిగి తీరుతుంది. అసాధ్యమేమీ కాదు. సొమ్ములన్నిటిలో బంగారమూ, పాత్రలన్నిటిలో మృత్తికా చూచినట్టే విశేష రూపంగా కనిపించే చరాచర పదార్ధలన్నిటిలో కేవలం స్ధితి రూపంగా విస్తరించినట్టు చూడవచ్చు. ఆయా వ్యవహారాలు జరుగుతుంటే అచలమైన ఆ స్దితే చలిస్తున్నట్టు భావించలి. జలంగా అచలం. తరంగంగా చలమని ఒక సముద్రాన్ని చూచినట్టే మనదేహం మొదలు ప్రపంచం వరకు అన్నింటినీ ఒకే ఒక అస్తి - భాతి - అనే సూత్రంతో చేర్చి పట్టుకోవాలి. జారి పోతుంటే మరలా దానిలోనే చేర్చుకోవాలి. జారినప్పుడది విశేషంగా తోస్తుంది. జారకుంటే మరల సామాన్యం గానే మారి దర్శన మిస్తుంది.