Page 6
అద్వైత విజ్ఞాన సారము
అయితే ఎన్నో ఆలోచనలు, పనులు పెట్టుకొని వాటిలో నిరంతరమూ తల దూరిస్తే మాత్రం ప్రయోజనం లేదు. ధారణ చాలదు. కుంపట్లో వేసిన బొగ్గులు నిప్పు కావాలంటే నిప్పుకణిక శక్తిని మించి బొగ్గు లందులో పడకూడదు. పడితే బొగ్గులు నిప్పు కావటమలా ఉంచి నిప్పే బొగ్గుగా మారుతుంది. నామరూపాలు బొగ్గులు. అవి సచ్చి ద్రూపంగా మారాలంటే సచ్చిదాకారా వృత్తిని దెబ్బ తీసేటన్ని వ్యాసంగాలు పనికిరావు. జీవనానికి కావలసిన పనులే పెట్టుకోవాలి సాధకుడు. మిగతా సమయమంతా ఆత్మాకార వృత్తి నవలంబించి కూచోవాలి. అప్పుడు దానికి బలం తగ్గి ఇది బలం పుంజుకోగలదు. మనం కూడా ఉత్సాహంతో ముందుకు సాగి పోగలం. జాగ్రత్తు సరే. నిద్రాదులు, రోగాదులు సంక్రమించి నప్పు డెలాగా అప్పుడు మనక్ స్ఫురణే లేదు గదా అని సందేహించవచ్చు. ఇది నిరంతర మా వృత్తి అయితే ఈ వృత్తి వల్లమ్ ఏర్పడే సంస్కారం వృధాపోదు. అక్కడ కూడా పని చేస్తుంది. ఒక తైల బిందువు లాగా అంతటా విస్తరిస్తుంది. అయినా మనసు మొద్దు బారినా - రేపు మరణమే సంభవించినా ఈ ఆత్మ వృత్తి నిలుస్తుందా? మనం నిలుపుకోగలమా ? జీవన్ముక్తుడికి కూడా మరణం తప్పదని చెబుతున్నారే. అప్పుడీ ఆత్మ జ్ఞానమే మైంది జీవితంలో దాఖలా కాకుంటే మరణానంతరం ముక్తు డయ్యాడో ? లేదో నమ్మకమేమిటి అని ప్రశ్న వస్తుంది. నిజమే. ఆత్మ వృత్తి నిద్రాది దశలలో నిలుస్తున్నట్టు మనకు కనిపించదు. అంతెందుకు. బాల్యంలో లేదీ జ్ఞానం. తర్వాత ఎప్పుడో శ్రవణాదులు చేస్తే ఉదయిస్తున్నది. మరలా అవసానంలో సడలిపోతున్నది. ఇందు వల్లనే లోకులందరికీ దీని విషయంలో అనుమానం సహజంగానే ఏర్పడుతున్నది. నలుగురికీ ఇది ప్రత్యక్ష సిద్ధమైన విషయం. కాని అంతకన్నా ప్రత్యక్ష సిద్ధమేదో తెలుసో. ఇప్పుడు నీవు వర్ణించిన అన్ని దశలలో గూడా ఆ దశలే కాదు నీవు కూడా ఉన్నావు. నీవే లేకపోతే వ్యాధి. మూర్ఛా మరణాదులైన ఈ దశ లను భవిస్తున దెవరు. వాటినవే కాదు కదా. జ్ఞానమే జ్ఞేయాన్ని అనుభవిస్తుం దెప్పుడూ. జ్ఞానమే నీవు. మరి నీవు లేకుండా పోయిందేమిటి. లేకుండా పోయేదవి. వస్తాయి ఉంటాయి పోతాయి. జన్మ ఇప్పుడుందా నీకు. గడచి పోయింది. మరణ ముందా ఇమ్ప్పుడు. ఎప్పుడో వస్తుంది. నీవో వాటి రెండింటినీ అనుభవించాలి గాబట్టి అప్పుడూ ఉన్నావు తరువాతా ఉండబోవు. ఇప్పుడెలాగూ ఉంటూనే ఉన్నావు. సర్వదా వర్తమానమే నీ స్వభావం. భూతమూ భవిష్యత్తూ కాదు. భూత భవిష్యత్తులు నీవు అనుభవింఛే జ్ఞేయ ప్రపంచం తాలూకు అనుభవాలు. ఇప్పుడు కూచొని ఆలోచిస్తున్నావు నీవు ఎప్పుడో పుట్టానని ఎప్పుడో వరణిస్తానని. ఇంతకు ముందు మరణించిన నీ పెద్దలందరూ నీకు గుర్తుకు వస్తుంటారు. మనం పోయినా ఈ ప్రపంచ మంటుందని - పోయేది అయితే తండ్రి తాతలతో పాటు ఈ పాటికే పోయి ఉండేది గదా ! అలాగే రేపు నాసంగతీ అని - ఏవేవో భయాలు బాధిస్తుంటాయ్హి నిన్ను అనుక్షణమూ. కాని ఒక్క మాట ఆలోచిస్తే చాలు. ఇదంతా నీ భ్రమేనని తేలిపోతుంది. ఎలాగంటే అసలేది అలోచించినా నీవే గదా అలోచిస్తున్నావు. నీ జన్మ నీవు చీడలేదు. ఇప్పుడది మనసుకు వస్తే అది నీ ఆలోచనే. అలాగే నీ మరణమింకా నీకు ప్రాప్తించలేదు. ఎప్పుడో ప్రాప్తిస్తుందని ఇప్పుడు నీకు కలిగే ఆలోచనే. నీ వున్నచోటనే ఉంటూ నీ ఆలోచనే అటూ ఇటూ తిరుగుతున్నది. నీవు స్ధితి. నీ ఆలోచన గతి. స్ధితే అలోచిస్తే గతిగా మారుతుంది. అలోచన మానేస్తే స్ధితి గానే అనుభవానికి వస్తున్నది. ఆద్యంతాలలో స్ధితే. గతి లేదు. జనన మరణాలనేవి ఇప్పుడు నీ ఉన్న స్ధితి కాద్యంతాలే గదా. నీవు కదలకుంటే అవి కనిపించవు. నీకు నీవే కనిపిస్తుంటావు. ఏదో కనిపిస్తున్న దనుకోటం వల్ల ఆ అవస్ధలలో పడ్డావు నీవు. అనుకోకపోతే నీ పాటికి నీవుంటావు. అప్పుడీ జనన మరణాద్యవస్ధ లేవీ నీ మనసుకు రావు. కాకపోయినా ఒక్క సంగతి. నీవేది అలోచించినా అది ఆభాసే కదా. వస్తువొక్కటే. అది నీ జ్ఞానం. నీ స్వరూపమే అది. పుట్టినప్పటి నుంచి గిట్టే దాకా ఉంటూనే ఉందది. ఉంటుందని నీకు చెప్పనక్కర లేదు. అది నీ అనుభవం. మరి దానికేది తగిలినా వదిలినా అది ఇక ఆభాసే కదా ! దీన్ని బట్టి ఒక కష్టమనూ, సుఖమనూ, పుణ్యమనూ, పాపమనూ, లోకాంతరాలనూ, జన్మాంతరాలనూ, నీమనసుకు వచ్చేవే గదా ఈ భావాలన్నీ ఎవరం దిచ్చర్వి. లోకమా శాస్త్రమా. అవి కూడా నీ జ్ఞానానికి సోకే భావాలే గదా ! జ్ఞానానికి సోకేది స్వరూపమెలా అవుతుంది. స్వరూపానికే అస్తిత్వం కాని తదాభాస అయిన ఏ భావానికీ స్వతహాగా అస్తిత్వం లేదు. రజ్జుసర్పానికి ఎలా లేదో తరంగ బుద్బుదాలకు ఎలా లేదో అలాగే ఆత్మ భిన్నమైన ఏ ఆలోచనకూ అస్తిత్వ ముండబోదు. ప్రస్తుతం ఇహపరాలకు సంబంధించిన వన్నీ నీ అలోచనలే కాబట్టి జనన మరణాదికమైన దేనికీ అస్తిత్వం లేదని చెప్పనక్కర లేదు. కనుక నీవు వాటిని తలచుకొని భయపడుతున్నా వంటే అది నీ నీడను చూచి నీవు భయపడటమే. నీడను గాదు నీవు పట్టుకోవలసింది. నిన్ను నీవే. నీ స్వరూపాన్నే నీవు గట్టిగా పట్టుకొంటే మిగతా నీకు కలిగే భావాలన్నీ నీ స్వరూపమనే తెర మీద వస్తూ పోయే బొమ్మల లాగా ఎప్పటికప్పుడు మాసిపోతున్నట్టు నీవు చూడగలవు. అయినా మనకు ధైర్యం లేదు. దానికి కారణం శరీరాది ఉపాధులకు విలక్షణంగా మన స్వరూఫాన్ని గుర్తించక పోవటమే. గుర్తించ గలిగితే జన్మించినపుడు ఉపాధే జన్మించింది నేను కాదు - రేపు మరణించేటపుడూ ఉపాధే పోతుంది. నేను కాదనే నిబ్బరంతో బ్రతుకు తుంటావు. స్ధితే గాని నీకు గతి లేదనేది అక్షరాల నిజం. ఈ నిజాన్ని చేసుకోవాలంటే నేను సర్వవ్యాపకుణ్ణి అనే స్మృతి ఎప్పుడూ సడలిపోరాదు. అలా సడలి పోనివాడే జీవన్ముక్తుడు. వాడు జీవితంలో కలిగే అన్ని దశలలోనూ ఆత్మ స్మృతితోనే ఉంటాడు. జీవితాంతమూ అలాగే దాన్ని పొడిగించు కొంటుపోతాడు. అలా ఉంటాడో లేదో ఏమిటి నమ్మకం ! ఇంతమందికి లేని స్మృతి వాడికి మాత్రం ఎలా కలిగిందంటావా - దనికొక్కటే మా సమాధానం. చంద్ర మండలానికి వెళ్ళి చూచి వచ్చాడొక అంతరిక్షగామి. అది వాడి అనుభవమే. మనకెవరికీ లేదా అనుభవం. అయినా ఎలా నమ్మావది. పదిమందీ చెప్పుకొంటుంటే విని నమ్ముతున్నావు. అలాగే పది మంది బ్రహ్మవేత్తలు చెబుతున్నారు. ఏమని. జీవన్ముక్తుడైనవాడు కూడా ఒక చిదాకాశంలో ఎప్పుడూ పయనిస్తుంటాడు. అక్కడే నిత్యమూ నివసిస్తుంటాడని. మరి ఇది కూడా నమ్మవలసిందే గదా. వాడెలా నివసించ గలిగాడా చిదాకాశంలో. చిదాకాశమే తన శరీరమని భావించి ఈ భౌతిక శరీరంలో నుంచి బదిలీ అయి అందులో ప్రవేశించాడు. క్రొత్తగా కూడా ప్రవేశించ నక్కర లేదు. చిదాకాశ మంటే ఆకాశం లాగా విస్తరించిన నీ నా జ్ఞానమే కదా. అది ఈ శరీరమే నేనను కొని ఇందులోనే కూచున్నా నీకిప్పుడూ సిద్ధంగానే ఉంది. నీవే అది. అయినప్పటికీ జ్ఞేయమైన ఈ శరీరమే నేనని చాలాకాలం నుంచీ అలవాడు పడ్డావు. కనుకనే ఇది వదిలేసి అది నేనని దానితో తాదాత్మ్యం చెందలేక పోతున్నావు. అందుకే నిది ధ్యాసనా రూపమైన అభ్యాసం చేయవలసి ఉంది మన మంతా. అభ్యాసం చేసే కొద్దీ శరీరాత్మ వాసన దూరమయి దానికి మారుగా చిదాత్మ వాసన్ దృఢమవుతూ వస్తుంది. ఇంకా ఒక మాటేమంటే జడమైన ఈ శరీర మసలు వస్తు రూపంగా లేదు కదా. ఆభాసే గదా ఇది. లేని ఆభాసే ఇంత బలంగా నిన్ను పట్టుకొంటే ఉన్న వస్తువు నీ చైతన్యం నిన్ను పట్టుకోక పోవటమేమిటి. అన్యాయం. ఎటువచ్చీ తగినంత శ్రద్ధ లేదు నీకు. "శ్రద్ధా వాన్ లభతే జ్ఞాన" మన్నారు. కాబట్టి నిద్ర అని, రోగమని, మరణమని, పునర్జన్మలని, ప్రతిలోమంగా నిన్ను చూచి భయపడటం మానేసి అనులోమంగా అన్ని దశలలోనూ నేను సద్రూపంగా, చిద్రూపంగ, ఉంటూనే ఉన్నానని నిన్ను నీవు గట్టిగా పట్టుకొని కూచో. అలా పట్టుకొంటే అది పోయిన బలం పుంజుకొని అసద్రూపమైన ఈ సమస్తాన్ని తనలోనే కలుపుకొని ఆత్మేమిటి అనాత్మేమిటి అంతా తన స్వరూపం గానే అనుసంధానం చేసుకోగలదు. ఎప్పటికీ అలాగే ఉండిపోగలదు. ఉంటే ఇక నాకూ నీకూ జననం లేదు. మరణం లేదు ఇహం లేదు. పరం లేదు. ఏదీ లేదు. నాకు నేనే. నాదీ నేనే. నేనూ నేనే. అనే అఖండాద్వయాత్మ భావం అనుక్షణమూ అనుభవానికి వస్తూ ఉంటుంది. దీనికే ఏకాత్మ భావమని, సర్వాత్మ భావమని పెద్దలు పెట్టిన పేరు. ఇది అందుకో గలిగితే జనన మరణాది జీవిత సమస్యలన్నింటికీ పరిష్కారం చేసుకొని సాధకులమైన మన మందరమూ ఈ జీవితంలోనే సిద్ధ పురుషులమై చివరకు మోక్ష సామ్రాజ్యానికి పట్టాభిషిక్తులం కాగలము.
End