Page 3
అద్వైత విజ్ఞాన సారము
అలా భాసించట మాత్మ కాదు. మరేమిటి. ఆత్మ అలా భాసితున్నదని భావించే ఒక విశేషాత్మ. అదే జీవుడు. జీవుడంటున్నాడు ఈ అనాత్మను చూచి ఆత్మే ఇలా భాసిస్తున్నదని. వీడి భావన ననుసరించి ఈ ఆభాస. అయితే జీవుడెందుకిలా భావించ వలసి వచ్చింది. అసలైన ఆత్మ దృష్టి లేక. ఆత్మ దృష్టి లేక జీవు డయ్యాడా - జీవుడై తత్కారణంగా ఆత్మ దృష్టి కోలుపోయాడా - జీవుడు ముందా అజ్ఞానం ముందా అని ప్రశ్న వచ్చింది. ఇది ఉంటే గాని అది లేదు. అది ఉంటే గాని ఇది లేదు. అన్యోన్యాశ్రయ మనే దోషమిది. బీజ వృక్ష న్యాయమిలాంటిదే. అయితే ఏమిటిక దీనికి పరిష్కారం. జీవుడవై కోరుతున్నావా పరిష్కారం ఆత్మవై కోరుతున్నావా? ఆత్మవైతే అడగనే అడగవు. ఎందుకంటే నీకప్పుడు అజ్ఞానమే లేదు. మరి జీవుడవి అడిగావో. జీవుడనే భావాన్ని వదలకుండానే అడుగుతున్నావు. కాబట్టి అడిగినా సుఖం లేదు. జీవుడనే భావంతోనే పరిష్కారాన్ని అందుకోలేవు. చెప్పినా గ్రహించ లేవు. ఇది ఎలాంటి దంటే ఒకడు స్వప్నంలో ఉండి స్వప్న జగత్తును చూస్తున్నాడు. - ఇది స్వప్నం - వాస్తవం కాదని ఎవడు చెప్పినా నమ్మడు వాడు. కారణం వాడు స్వప్నంలోనే ఉన్నాడు. సమాధానం చెప్పే వాణ్ణి వాడి సమాధానాన్ని కూడా స్వప్నంగానే చూస్తాడు. అది యధార్ధం కాదనే మాట ఇక ఎలా అర్ధమౌతుంది వాడికి. అలా కాక వాడే స్వప్నంలో నుంచి మేలుకొని జాగ్రత్ లోకి వచ్చాడనుకోండి, అప్పుడు వాడికిది ఏమిటి ? ఎందుకనే ప్రశ్నే రాదు. కాబట్టి ఎవరూ పరిష్కరించి చూపనక్కరలేదు. తన పాటికి తానే తెలుసుకోగలడు. వెలుగు చీకటుల లాంటి దిది. చీకటిలో ఉన్నంత వరకు ఇదుగో నల్లగా కనపడుతున్నదిదే వాస్తవం. వెలుగెక్కడ ఉంది. ఒక వేళ ఉందని చెప్పినా అది నాకు చీకటి అయి ఎందుకు కనిపిస్తున్నదని ప్రశ్నిస్తావు. నీవు చీకటినే చూస్తూ వెలుగిలా ఎందు కయిందని ప్రశ్నించి ఏమి లాభం. చీకటనే దృష్టి వదలలేదు. నిన్ను ఆ దృష్టి వదల కుండా పట్టుకొనే సరికి వెలుగే చీకటయి భాసిస్తున్నది. మరి దీని కేమిటి పరిహారం. ఒక్కటే. వెలుగును చేడటమే. అప్పుడు నీ దృష్టి వెలుగయింది కాబట్టి దానికిక చీకటి లేదు. అంతా వెలుగే. వెలుగే కదా ఉన్నది, అది చీకటి ఎలా అయింది, ఎందుకయిందని అడగనే అడగవు. ఎందుకంటే చీకటి అనే భావమే లేదు నీకు. కనుక అజ్ఞాన మెక్కడిది ? జీవుడెక్కడి వాడు ? అది ముందా ? ఇది ముందా ? అనే వితర్కం అనావశ్యకం. ఎంత వితర్కించినా దానికి సమాధాన మెప్పటికీ రాదు. సమాధానమే కావాలంటే ఎందుకని కాదు నీవు ప్రశ్నించ వలసింది. ఇది ఎలా పోతుందని. ఎలా పోతుందో ఆ ఉపాయాన్ని పట్టుకొని పోతే చివరకు దానికే సమాధానం వస్తుందో అదే దీనికీ సమాధానం. ఇలాంటి ఉపాయానికే ప్రయత్నమని సాధన అని పేరు. సాధన చేస్తేనే ఎప్పటికైనా సిద్ధి. లేకుంటే దానికెప్పటికీ నోచుకోలేము. అంత వరకూ అది కేవలం సిద్ధాంతమే గాని అనుభవం కాదు. అయితే అద్వైతంలో సాధన అనేది ఉందా అని ప్రశ్న. అంతకు ముందు లేని పదార్ధమైతేనే సాధన వల్ల తయారు చేసుకోవలసి ఉంటుంది. తయారై ఉన్న దాన్ని క్రొత్తగా సాధించట మేమిటి ? అనుభవించట మేమిటి. ఆత్మ అనేది ఏదో కాదు. మన స్వరూపం. అది ఇంతకుముందే సిద్ధమైన పదార్ధం. తయారు చేయ నక్కరలేదు. చేస్తే అప్పుడది ఆత్మే కాదు. అనాత్మ ప్రపంచంలో ఏదో ఒక పదార్ధమౌతుంది. దానికేమి. పూర్వ సిద్దమైనా దూరంగా ఉన్న దాన్ని దగ్గరకు తెచ్చుకొనే ప్రయత్న ముంటుంది కదా అనవచ్చు. అది మనకెప్పుడూ దూరం కాదు. మన స్వరూపమేనని పేర్కొన్నాము. పైగా లోపలా వెలపలా అనే తేడా లేకుండా సర్వత్రా వ్యాపించి ఉంది. అలాంటప్పుడిక సాధన ఏమిటి. కావచ్చు. మన స్వరూపమైనా మరచి పోయి ఉండవచ్చు గదా మరిస్తే అది మనదే అయినా మరుగుపడి ఉండవచ్చు గదా అన్నావో. భేష్. అలాంటప్పుడు క్రియా రూపమైన సాధన కాదది. కేవలం గుర్తు చేసుకుంటే సరిపోతుంది. సాధన గాని సాధన ఇది. ఇలాంటి సాధన అయితే మేము కాదన మంటారు అద్వైతులు. దీనికే ప్రత్యభిజ్ఞ అని పేరు పెట్టారు. మరచిపోయిన సత్యాన్ని గుర్తు చేసుకోటమే ప్రత్యభిజ్ఞ. జీవ జగదీశ్వరులనే మూడింటికీ స్వరూపం నేనే - నా చైతన్యమేననే విషయం మరచి పోయాము మన మందరమూ. అంటే అధిష్ఠాన జ్ఞానం లేదని అర్ధం. దాని బదులు ఎక్కడికక్కడ విశేష రూపంగా చూస్తూ విశేష జ్ఞానవృత్తులే నా స్వరూపమని బ్రతుకుతున్నాము. ఈ వృత్తులే నామం. ఇదే జీవుడు. దీనితో చూస్తూ పోతే విశేష రూపంగానే కనిపిస్తున్న దాత్మ. అదే జగత్తు. రెంటికీ ఏర్పడిన లావాదేవీ క్రియ. ఇదే సంసార బంధం. ఇప్పుడిదంతా నిర్మూలమై పోవాలంటే దీని మూలమేదో దాన్ని పోగొట్టుకోవాలి. అజ్ఞానమే దీనికి మూలం. సామాన్య జ్ఞానం లేక పోవటమే అజ్ఞానం. చీకటి లాంటిదది. చీకటి పోవాలంటే తుడిచి వేయటం, కడిగి వేయటం ఇలాంటి ప్రయత్నమేదీ పనికి రాదు. దీపం వెలిగించట మొక్కటే ఉపాయం - వెలిగిస్తే చాలు ఇక చీకటి లేదు. అది ఆ వెలుగులో చేరి వెలుగు గానే దర్శన మిస్తుంది. అలాగే సచ్చిదాత్మ రూపమైన సామాన్య జ్ఞానం అవలంబిస్తే చాలు. అదే ప్రకాశం. ఆ ప్రకాశంలో నామ రూపాలనే తమస్సు విరిసి పోతుంది. అప్పుడంతా ఆత్మ చైతన్య ప్రకాశమే. కనుక జ్ఞానమే అజ్ఞానానికి జవాబు జ్ఞానమంటే ఒక వృత్తి. వృత్తి ఇక్కడ సవిశేషం కాదు. నిర్విశేష వృత్తి. అత్మా కార - అఖండాకార - బ్రహ్మా కార వృత్తి అన్నా ఇదే. భాష్యకారులు ఈ వృత్తినే విద్య అని జ్ఞానమని పెర్కొంటారు. ఇది ఎక్కడ కలగాలి ఈ వృత్తి. మిగతా వృత్తులన్నీ ఎక్కడో అక్కడే. మనసులోనే కదా ఏ వృత్తి అయినా కలుగుతుంది, ప్రాపంచిక వృత్తులైనా అందులోనే. పారమార్ధికమైన వృత్తి అయినా అందులోనే. "మన ఏవ మనుష్యాణాం - కారణ" మని కదా పెద్దల మాట. అయితే మిగతా ప్రాపంచిక వృత్తులన్నీ ఖండ వృత్తులైతే ఇది ఒక్కటీ అఖండ వృత్తి. అవి అనేకమైతే ఇది ఏకం. అవి అనాత్మకు చెందిన వైతే ఇది ఆత్మకు చెందినది. వృత్తి అయినా దీనికీ దానికీ హస్తి మశ కాంతర ముంది. అయితే ఒక ప్రశ్న. ఇవి కలిగినంత సుళువుగా అది కలుగుతుందా. అలాటి భయమక్కర లేదు. ఎందుకంటే మొదటనే చెప్పామొక రహస్యం. ఆత్మ అనాత్మ రెండూ ఒక దానితో ఒకటి తెగ దెంపులు చేసుకున్నవి కావు. ప్రతి పదార్ధంలోనూ కలిసిపోయే ఉంటాయి రెండూ. సామాన్య రూపంగా ఒకటి. విశేష రూపంగా ఒకటి. అందులో అస్తి - భాతి సామాన్యమైతే, నామం రూపమనేవి విశేషం. ఈ రెండంశాలూ కలిసి ఉండని పదార్దమంటూ లేదు. భావమంటూ లేదు సృష్టిలో. ఇక మనకేమి భయం. నామ రూపాలను చూచి తదాకారంగా మన మనసు ఎలా మారుతుందో అక్కడే ఉన్న సచ్చిత్తులను చూచి అలాగే మారిపోవచ్చు గదా. మనసు కొక లక్షణ ముంది. అది ఏది భావిస్తే అలా మారిపోగలదు. సాకారమే కానక్కరలేదు. నిరాకారాన్ని కూడా భావించగలదు. వృధివ్యాదులైన సాకారాలను మన మెలా చూస్తున్నామో నిరాకారమైన వాయు వాకాశాలను గూడా చూడ గలుగుతున్నాము గదా. చివరకు సుఖ దు:ఖాదులైన భావాలు ఎంత నిరాకారమైనా అనుభవానికి వస్తున్నాయి గదా ! దీన్ని బట్టి ఆత్మ కూడా నిరాకార మైనప్పటికీ అది ఒక ప్రతిబంధకం కాదు. ఆకాశం లాగే దాన్నీ గూడా అనుభవానికి తెచ్చుకోవచ్చు. ఎలాటి ఇబ్బంది లేదు. పైగా ఆకాశం లాగా విషయం కూడా కాదది. నా స్వరూపమే. కనుక ఇంకా సన్నిహితం నాకు. ఏటు వచ్చీ దీన్ని భావించినట్టు దాన్ని భావించటాని కలవాటు పడలేదు మనం. అలవాటనేది చేసుకుంటే అవుతుంది. లోకంలో కూడా అంతే కదా. వంటా వార్పు దగ్గర నుంచి సంగీత సాహిత్యాదుల వరకు అంతా మన అభ్యాసం మీదనే ఆధార పడ్డది. అదే సూత్ర మిక్కడ. పోతే బద్ధకించకుండా సాగించాలి ప్రయత్నమనేది. అందుకే చెప్పారు శ్రవణ మనన నిది ధ్యాసన లనే మూడింటిని. శ్రవణమనేది మన దృష్టిని అనాత్మ వైపు నుంచి ఆత్మ వైపు మళ్ళిస్తుంది మొదట. దానితో ఆత్మ విషయమైన వృత్తి లేదా జ్ఞాన మేర్పడుతుంది, కాని దానితో పాటు అనాత్మ వృత్తులు కూడ కలుగుతూనే ఉంటాయి. కనుక వాటిని పోగొట్టు కోవాలంటే తరువాత మననమనే దాన్ని సాగించాలి మనం. దీనితో అనాత్మ కూడా ఏదో కాదు ఆత్మే అలా భాసిస్తున్నదని రెండింటికీ ఉన్న వైరుధ్యం తొలగి పోతుంది. మొదటిది అజ్ఞానానికి జవాబైతే ఇది సంశయానికి నివర్తకం. మానసికంగా ఇలాంటి నిశ్చయ జ్ఞానం ఏర్పడినా బాహ్యంగా మరలా అనాత్మ ప్రపంచంతో వ్యవహరించక తప్పదు. అలాంటప్పుడు విజాతీయ భావాలు తొంగి చేస్తూనే ఉంటాఉయి. శరీర మున్నంత వరకూ వ్యవహారం తప్పదు. ప్రారబ్ధ మున్నంత వరకూ శరీర సంపర్కం తప్పదు. కాబట్టి దేహ పాతమయ్యే వరకూ ఆత్మ వృత్తికి అనాత్మ వృత్తులతో పోరాట ముండనే ఉంటుంది. కాబట్టి వాటికి పరిష్కారం వెదకి పట్టుకోవాలి మనం. ఈ పరిష్కారమే సాధన మార్గంలో మూడవదైన నిదిధ్యాస. అనాత్మ వృత్తు లుదయిస్తుంటే వెంట వెంటనే వాటిని ఆత్మ వృత్తిగా మార్చుకుంటూ తదేక నిష్ఠతో కాలం గడపటమే నిది ధ్యాస. ఇవి మూడూ కలిసి ఒక వడ్ల దంపకం లాంటిదని వర్ణిస్తారు భాష్యకారులు. బియ్య మయ్యే వరకు దంచవలసినట్టే ఆత్మ దృష్టి నిలబడే వరకూ ఈ శ్రవణాదులు మూడు పాటిస్తూ పోవలసిందే. దృష్టి నిలబడితే అదే నిష్ఠ అదే సాక్షాత్మారం. బ్రతికుండగా ఇది సిద్ధిస్తే జీవన్ముక్తి. దేహపాతమైతే మరొకదేహమనే ప్రసక్తి లేదు. కాబట్టి విదేహముక్తి.