Page 2
అద్వైత విజ్ఞాన సారము
అంటే ఏమన్న మాట. అహంకార మమ కారాలమే రెండి అడ్డు గోడలూ కూలిపోయాయి. వాటి రెండింటి బదులూ ఆత్మ ఒక్కటే మిగిలిపోయింది. ఇది గౌణం కాదు. మిధ్య కాదు. పరిశుద్ధమైన ఆత్మ. దీనికే ముఖ్యాత్మ అని పేరు. అసలైన సిసలైన ఆత్మ ఇదే. ప్రత్యగాత్మ ఐనా ఇదే పరమాత్మ ఐనా ఇదే. సచ్చిద్వెశేషం కాదిది. కేవలం సచ్చిత్తులే. ఇదే మహా సామాన్యమంటే. పోతే ముందు చెప్పిన గౌణ మిధ్యాత్మలు (బ్రహ్మాండ, పిండాండాలు) రెండూ దీనికి విశేషాలు. అందులోనూ సద్విశేషం ప్రపంచమైతే, చిద్విశేషం జీవుడు. విశేషమంటే ఫలానా అనే భవం. నేను ఫలనా అని భావించే జ్ఞానమే కదా జీవుడు. కనుక ఇది చిద్విశేషం. దీనికే నామమని గూడా పేరు(idea). ఇలాంటి వృత్తి జ్ఞానంతో దర్శించే బాహ్యమైన జ్ఞేయ ప్రపంచమంతా సద్విశేషం. ఊరక ఉందని చూస్తే విశేషం కాదిది, సత్సామాన్యం. అలా కాక ఫలానా ఘటంగా ఉంది. పటంగా ఉందని చూస్తాము గాబట్టి సద్విశేషమైంది ఈ బాహ్య ప్రపంచం. ఈ సద్వి శేషానికే రూపమని గూడా పేరు. లోపల చిద్విశేషమైన నామం జీవుడు - వెలపల సద్విశేషమైన రూపం జగత్తు. ఈ రెండింటిలో ఒకటి గ్రహించేది, ఇంకొకటి గ్రహించబడేది. రెంటికీ ఉన్న సంబంధమే క్రియ. నామరూపాలు రెండూ రెండు తీరాలైతే క్రియ అనేది రెండూ తీరాలనూ కలిపే ఒక పెద్ద వంతెన. ఇదే త్రిగుణాత్మకమైన సంసారం. ఈ సంసారమే ఇప్పుడు మనకెదురైన సమస్య. దీని వల్లనే సుఖదు:ఖాదుల అనుభవం ఏర్పడుతూ ఉంది. చివరకు జనన మరణానుభవం కూడా దీని వల్లనే సంప్రాప్త మౌతున్నది. ఇంతకన్నా పెద్ద సమస్య మరొకటి ఏముంది. ఎవరికీ సమస్య. ఎవరనుభవిస్తే వారికి. ఎవడా అనుభవించే వాడు. ఆత్మ కాదు. అనాత్మ జగత్తు కాదు. ఆత్మ అనేది నిరాకారం సర్వవ్యాపకం పరిపూర్ణమని చెప్పాము. పోతే అనాత్మ అనేది కేవలం జడం పరిచ్ఛిన్నమని పేర్కొన్నాము. సమస్య ఎప్పుడూ పరిపూర్ణమైన చేతనకూ లేదు. పరిచ్ఛిన్నమైన జడానికీ లేదు. కారణం మొదటి దానికి విశేష దృష్టి లేదు. రెండవ దానికి అసలు దృష్టే లేదు. కనుక విశేష రూపమైన ఈ సంసారానుభవం రెండింటికీ లేదు. ఆత్మా నాత్మలకు రెండింటికీ లేకపోతే మరి దేనికిక? మూడవదైన జీవుడికే ఈ అనుభవం. వీడు ఆత్మలాగా సామాన్య దృష్టీ కాదు, అనాత్మ ప్రపంచం లాగా కేవల దృశ్యమూ కాదు. దృక్ - దృశ్యాల రెండింటి కలయిక. దీనినే గ్రంధి అని వర్ణించారు. దృశ్యంలో కొంత నేనని తనలో కలుపుకున్న దృక్కు. సామాన్య చైతన్యం కాదిది. విశేష చైతన్యం. దీనికే చిదాభాసుడని జీవాత్మ అని పేరు. వీడికున్నది విశేష దృష్టి మాత్రమే. వచ్చిన ఇబ్బంది ఏమంటే విశేష దృష్టితో చూస్తే ఎప్పుడూ విశేష దృశ్యమే కనిపిస్తుంది. కనిపించే కొద్దీ దానితో అతడు తాదాత్మ్యం చెందాడు గనుకనే విశేష దృశమైన జగత్తుతో కూడా చెందుతూ వచ్చాడు. అలా చెందే సరికి దాని కష్ట సుఖాలు వీడికి సంక్రమించాయి. ఇదే సంసారానుభవం. విశేషమే నేననుకొనే సరికి విశేష ధర్మాలన్నీ నావే అవుతాయి. ’యద్భావ స్తద్భవతి’ ఈ విశేష ధర్మాలే సుఖదు:ఖాలు - జనన మరణాలు. ఐతే ఆత్మ - అనాత్మ రెండే అన్నారు కదా పదార్ధాలు. అలాంటప్పుడీ జీవాత్మ అనే మూడవవాడు ఎలా వచ్చాడు. రాలేదు వాస్తవంలో. రావటానికి వీలు కూడా లేదు. ఐనా వచ్చాడంటే ఆ రావటం వాస్తవం కాదు. మరేమిటి. ఆభాస. దానికి కారణం అవిద్యా లేదా అజ్ఞానం. సామాన్య చైతన్యం మాత్రమే నాస్వరూప మని గుర్తించక పోవటమే అజ్ఞానం. గుర్తిసే చిద్విశేషమైన జీవుడు లేడు. సద్విశేషమైన జగత్తూ లేదు. ఎందు కంటే సామాన్యం కంటే భిన్నంగా ఉండలేవు విశేషాలు. కనుక జీవ జగత్తులు రెండూ లేవు. రెండూ లేకుంటే ఈశ్వరుడు కూడా ఉండబోడు. ఈశ్వరుడనే వాడు జీవుడు కల్పించుకున్న ఒక సగుణమైన సమష్టి చైతన్యం. ఇవి మూడే త్రిపుటి అంటే. జీవ జగదీశ్వరులు. చిత్రమేమంటే ఈ త్రిపుటి ఒక దానితో ఒకటి ముడిబడి ఉంది. అది అవిద్యతో ముడిబడి ఉంది. అవిద్య లేకపోతే దీని కస్తిత్వం లేదు. అవిద్య అంటే అజ్ఞానమని చెప్పాము. అజ్ఞాన మంటే జ్ఞానం లేకపోవటం కాదు. విశేష రూపమైన జ్ఞానం. ఫలానా అనే దృష్టితో ఫలానా అని చూడటం. చూస్తే ఫలానా అనే దృశ్యం ఫలానా అనే దృష్టికి బంధమై కూచుంటుంది. ఇదే మనకు పట్టుకున్న సమస్య. మనమంతా ప్రస్తుత మీ సమస్యతో సతమతమౌతున్న జీవులం. నిజానికి సామాన్య చైతన్యమైన పరమాత్మ స్వరూపులమే మనం. అయి కూడా కాదనుకున్నాము. అంటే అర్ధం. సామాన్యం కాదు ఎక్కడికక్కడ విశేష రూపమైన చైతన్యమే నా స్వరూప మని భావిస్తున్నాము. దానికి నిదర్శనమే మనకీ దేహాత్మాభిమానం. అంటే దేహం మేరకే పరిమితమై ఉన్నామనే భావం. ఇది మనందరికీ ఇప్పుడను భవసిద్ధమే కదా ! అనుభవంలో ఉన్న దానికిక వివరణ అక్కర లేదు. అయితే ఇది మనకు వాస్తవం కాదీ జీవ భావం. వాస్తవంలో పరమాత్మే మనం. మరి అవాస్తవమైన ఈ అభిమానం మన కెలా ప్రాప్తించింది. చెప్పాము కదా అజ్ఞానం వల్లనని. సామాన్యంగా చూడక మన స్వరూపాన్ని విశేషంగా భావించటమే జరిగిన మోసం. కాని సామాన్యమే వస్తుత: అన్నింటికీ అధిష్టానం. అన్నింటికీ అంటే విశేషాలన్నింటికీ అని అర్ధం. అధిష్ఠానమే వీటికి స్వరూపం. అలాటి అదిష్ఠాన జ్ఞానం కోలుపోవటం మొదటి అపరాధం. దానికి మారుగా విశేష జ్ఞానమే నేననుకొని విశేష రూపమైన దేహాదులను బాహ్యమైన పృధివ్యాదులను నెత్తిన బెట్టుకొని దానితో సతమతం కావటం రెండవ అపరాధం. దీనికే అధ్యారోప మని పేరు. అందులోనూ సహజాధ్యారోప మిది. ఎప్పుడు చేశామో ఎందుకు చేశామో మనకే తెలియదు. కాలిలో గ్రుచ్చుకున్న ముల్లు ఎలా గ్రుచ్చుకున్నదో తెలియ నట్టే. లోకులందరికీ ఇది సాధారణమైనది గనుక సహజాధ్యారోప మన్నారు దీన్ని. ఇది రెండు విధాలు. ఆత్మను తెచ్చి అనాత్మ మీద ఆరోపించట మొకటి. ఇదే మిధ్యాత్మ. అలాగే అనాత్మను తెచ్చి ఆత్మ మీద ఆరోపించట మొకటి. ఇదే గౌణాత్మ. దీనితో అసలైన ముఖ్యాత్మ మరుగు పడిపోయింది. అభావం కాదది. అనుపలబ్ది. అధిష్ఠాన మెప్పుడూ అభావం కాబోదు. అది అభావమైతే దాని మీద ఆరోపితమైన జీవ జగత్తు లిలా కనిపించటం ఎప్పటికీ జరగదు. ఇవి ఇప్పుడు మనకు భావ రూపంగా అనుభవానికి వస్తున్నాయంటే వీటి కాధారమైన అది అభావమెలా అవుతుంది. భావ రూపంగా ఉండవలసిందే. తప్పదు. అయితే ఎటువచ్చీ మనం గుర్తించలేదు. కాబట్టి మనకది మరుగు పడిపోయింది. ఈ మరుగు పడటమే ఆవరణం. ఉపాధుల వల్ల ఆవృతమైంది మన ఆత్మ. అది ఆవృతమై అంతటితో ఆగి పోలేదు. అదే మరలా అనాత్మ రూపంగా భాసిస్తున్నది. దీనికే విపర్యయ మని పేరు. తన్ని మిత్తంగా సుఖ దు:ఖాది ద్వంద్వ రూపమైన సంసార మొకటి అనుభవానికి వస్తున్నది. ఇదే విక్షేప మంటారు. ఇది ఒక విష వలయం. ఆవరణం విక్షేపానికీ, విక్షేప మా వరణానికీ రాకపోకలు చేస్తుంటాయి. అవస్ధాత్రయంలో మనకు కనిపించే వ్యవహారమిదే. దీని కంతటికీ ఏకైకమైన కారణం అజ్ఞానమే. అంటే అధిష్ఠాన జ్ఞానం లేక పోవటం. అధిష్ఠాన మనేది సామాన్యమైన జ్ఞానం. అది విశేష జ్ఞానమని ఎప్పుడు భ్రమ పడ్డామో అప్పుడదే విశేష రూపమైన సంసారానుభవానికి దారి తీస్తున్నది. అయితే ఒక ప్రశ్న. అంతా ఆత్మే. అది ఒక్కటే యధార్ధం. అఖండ జ్ఞానమే అది. అదే మన స్వరూపమని గదా వర్ణించారు. అలాంటప్పుడు సామాన్య జ్ఞానమే ఎప్పుడూ ఉండాలి గాని మనకీ విశేష రూపమైన అజ్ఞానమెలా ప్రాప్తించింది. సూర్యుని తేజస్సులో తమస్సనే మాట కర్ధం లేనట్టే దీనికీ అర్ధం లేదు. నిజమే. అర్ధం లేదు వాస్తవంలో. వస్తుసిద్ధంగా లేకపోయినా బుద్ధి సిద్ధంగా అనుభవానికి వస్తున్నదిది. ఏది కాదన్నా అనుభవాన్ని కాదన లేము. అది ఆత్మ వంచన అవుతుంది. ’నహి దృష్టే అనుపపన్నం నామ’ అన్నారు. భాష్యకారులు. ఒక ప్రక్క కంటికి కనిపిస్తుంటే ఇది ఎలా చెల్లుతుందని ప్రశ్న వేసి సుఖం లేదట. అనుభవానికి రావటమే చెల్లటం. చెల్లకుంటే అనుభవానికే రాదు కదా. అందుకే నేమో అనిర్వచనీయమని వర్ణిస్తారు పెద్దలు దీన్ని. ఉందని చెప్పలేము. లేదనీ చెప్పలేము. సత్తు కాదిది. అసత్తు కాదు. చూడండి. ఘట మసత్తన టానికి లేదు. మృత్తికగా సత్తే అది. అలాగే సత్తన టానికి లేదు. మృత్తికకు వేరుగా ఘటమనే రూపం ఎక్కడా లేదు. అలాగే ఈ జీవుడనే విశేష దృష్టి జగత్తనే విశేష దృశ్యమూ ఒక ఘటం లాగా ఉందనలేము. లేదన లేము. సచ్చిద్రూపంగా సత్యమే రెండూ. తదన్యంగా రెండూ అసత్యమే. అయితే చమత్కార మేమంటే అసత్యమైనా భాసించటం. అదే ఆభాస. ఆభాస అనేది ఒకటి స్వతంత్రంగా ఉండి క్దాదు భాసించటం. అలా చెబితే విశేషానికి అస్తిత్వం చెప్పినట్టవుతుంది. సామాన్యానికి వేరుగా విశేషం లేదని గదా సిద్ధాంతం. అలాంటప్పుడీ భాసదేని ఆభాస. వస్తువు ఆభాసే కావాలి. వస్తువే ఇంకొక రూపంలో భాసిస్తున్నది. ప్రతీతి మాత్ర మిది. యదార్ధం కాదు. అయినా ఎందుకలా భాసిస్తున్నది.