#



Back

Page 1

అద్వైత విజ్ఞాన సారము

సృష్టిలో మానవుడు విశిష్టుడైతే మానవుడిలో అతని జ్ఞానం ఉత్తమమైతే ఆ జ్ఞానంలో ఉత్త మోత్తమం అద్వైత విజ్ఞానం. అద్వైతం, ద్వైతం రెండూ అన్న దమ్ముల లాగా ప్రతి పదార్ధంలోను మనకు ప్రత్యక్ష మౌతాయి. సామాన్య జ్ఞానం అద్వైతమైతే విశేష జ్ఞానం ద్వైతం. సామాన్యానికి కారణమని పేరు. అందులో నుంచి వచ్చిన విశేషానికి కార్యం అని పేరు. కారణమే కార్యానికి మూల పదార్ధం. కార్యాల నేకమైతే వాటికి కారణమైన ఈ సామాన్యం ఏకం. ఈ ఏకమైన సామాన్యమే అనేకంగా కనిపించే విశేషాల నన్నింటినీ వ్యాపించి ఉంటుంది. ఈ వ్యాప్తికే అన్వయమని అనువృత్తి అని పేర్లు. వీటికి భిన్నంగా విశేషాలు ఎక్కడికక్కడ ఒక దాని కొకటి వేర్వేరుగా కనిపిస్తాయి కనుక వాటికి వ్యతిరేకమని వ్యావృత్తి అని పేరు పెట్టారు. వ్యాపకం గనుక నిజనికి సామాన్యమే ఉన్న పదార్ధం. అందుకే దానిని వస్తువన్నారు. వస్తువంటే ఏది ఉన్నదో అది. ఈ వస్తువే సామాన్యం. అదే దాని స్వభావం వల్ల ననండి మన అజ్ఞానం వల్ల ననండి విశేష రూపంగా భాసిస్తున్నది. దీనినే ఆ భాస అని వ్యవహరిస్తారు. విశేషాలన్నీ సామాన్యం తాలూకు ఆభాసలే. అంత మాత్రాన ఆభాస అనేది తన పాటికి తాను స్వతంత్రంగా ఉన్న ఒక పదార్ధమని భావించరాదు. స్వతస్సిద్ధమైనది సామాన్య రూపమైన వస్తువే. సామాన్యంగా ఉంటూనే అది విశేష రూపంగా కూడా భాసిస్తున్నది. ఇది సామాన్య రూపం గానే సత్యం. విశేష రూపంగా అయితే సత్యం కాదు, అనృతం. ఉదాహరణకు ఘట శరావాదులు సామాన్య రూపమైన మృత్తికగా చూస్తేనే సత్యం గాని మృత్తి కను తప్పించి వాటిపాటి కవి ఉన్నాయని ఎంత భావించినా అసత్యమే.

ప్రతి ఒక్కటీ లోకంలో సామాన్య విశేషాత్మకంగానే దర్శన మిస్తుంటుంది. చిత్రమేమంటే ఈ సామాన్య విశేషాలకు నిలకడలేదు, ప్రతిదీ క్రింది దానికి సామాన్యమైతే పై దానికి విశేషమౌతూ పోతుంది, ఘటశరావాదుల దృష్ట్యా పృధివి సామాన్యమైతే మహాభూత దృష్ట్యా పంచభూతాలలో అది మరలా ఒక విశేషం. కారణం సామన్యమైతే కార్యం దానికి విశేషమని గదా ఇంతకు ముందు పేర్కొన్నాము. దీన్ని బట్టి పృధివి కూడా జలమనే భూతానికి కార్యం గనుక అదీ విశేషమే. అది కూడా తేజస్సుకు కార్యం గనుక తేజస్సు దృష్ట్యా విశేషం. తేజస్సు దానికి సామాన్యం. అలాగే ఆ తేజస్సు వాయువనే సామాన్యానికి విశేషమైతే, వాయువు కూడా ఆకాశానికి విశేషం అవుతుంది. పోతే ఆకాశమిక దేనికీ విశేషం కాదని మనకు తోచవచ్చు. కాని అది కూడా ఒక కారణానికి కార్యమే. అదేదో కాదు దానికి సాక్షియైన చైతన్యమే. చైతన్యం ఇది ఆకాశమని గుర్తించినప్పుడే దానికి అస్తిత్వం. కనుక మిగతా భూతాలలాగే ఆకాశానికి కూడా స్వతంత్రమైన అస్తిత్వం లేదు. స్వతస్సిద్ధమైనది చైతన్య మొక్కటే. అది తనకు తాను ఉన్నానని భావిస్తూ తాను గ్రహించే మిగతా పదార్ధాలన్నింటినీ ఉన్నాయని గ్రహిస్తున్నది. కనుక స్వత: ప్రమాణమైన ఈ చైతన్యమే మహా సామాన్యం. దాని కతీతమైనది మరేదీ లేదు కాబట్టి అది దేనికీ విశేష మనిపించుకోదు. దాని కతీతమైనది మరేదీ లేదు కాబట్టి అది దేనికీ విశేష మనిపించుకోదు. మీదు మిక్కిలి దానిలో నుంచే ఆకాశాదులైన కార్యాలన్నీ ఏర్పడవలసి ఉంది గనుక అన్నీ దాని విశేషాలే. అంటే దాని దృష్ట్యా సామాన్య విశేష రూపంగా విభక్తమై కనిపించే ప్రపంచమంతా విశేషమే. అన్నిటికీ కలిపి అది ఏకైకమైన కారణం గనుక మూల కారణమని - సామాన్యం గనుక మహా సామాన్యమని వేదాంతుల పరిభాష.

మిగతావన్నీ స్వతస్సిద్ధంగాక అది ఒక్కటే స్వతస్సిద్ధమని ఎలా నిరూపించగలమని సందేహించ నక్కరలేదు. ఎందుకంటే ఏదైనా లోకంలో ఉన్నది, కనిపిస్తున్నదంటే దాని అస్తిత్వానికి ఏదో ఒక ప్రమాణం ఉండి తీరాలి. ప్రమేయంగానే దేనికైనా సిద్ధి గాని తన పాటికి తనకు కాదు. ప్రమేయమంటే ప్రమాణానికి గోచరించటమే. ప్రమాణమెప్పుడూ జ్ఞానమే. ఆకాశం మొదలుకొని జ్ఞానానికి గోచరించేవే గనుక ప్రమేయాల కోటిలోనే చేరిపోతాయి. కనుకనే వాటికి స్వతస్సిద్ధి లేదని చెప్పటం. దానికి భిన్నంగా జ్ఞానమనేది ఎప్పుడూ ప్రమేయం కాదు. అంటే ఏ ప్రమాణానికీ గోచరించదు. జ్ఞానమే కదా ప్రమాణమని పేర్కొన్నాము. అలాంటప్పుడది ప్రమాణానికి విషయమెలా కాగలదు? దానికి వేరే ప్రమాణ మక్కర లేదు. కావాలని చెప్పినా అదీ జ్ఞాన స్వరూపమే గనుక రెండూ సజాతీయమే అయి కూచుంటాయి. జ్ఞానమనేది జ్ఞేయాన్ని చూపుతుంది గాని జ్ఞానం, జ్ఞానాన్ని చూపలేదు. చూపకముందే అది సిద్ధమై ఉంది గనుక ఒక వేళ చూపబోయినా చెల్లదు. ఆత్మా శ్రయమనే దోష మేర్పడుతుంది. అగ్ని తన్ను తాను కాల్చుకోలేదు. ఒక ఆటగాడు తన బుజం మీద తాను నిలుచొని ఆడలేడు. అలాగే జ్ఞానానికి జ్ఞాన మక్కర లేదు. అది స్వత్: ప్రమాణం. కనుకనే స్వత స్సిద్ధం. దీనినే చైతన్యమని, ఆత్మ అని కూడా వ్యవహరిస్తారు.

ఏమిటది ఎలా ఉంటుందని అడగవచ్చు ఆత్మ అంటే ఏదో కాదు. నేననే స్ఫురణ మాత్రమే అది. ప్రస్తుత మీ స్ఫురణ మనలో ప్రతి ఒక్కరి అనుభవంలోనే ఉంది. ఎవరు నీవని అడిగితే నేననే జవాబిస్తాడు ప్రతి ఒక్కడూ. ఈ నేననే జ్ఞానమే ఆత్మ అన్నా చైతన్య మన్న ఆత్మ చైతన్యం జ్ఞానం ఒకదాని కొకటి పర్యాయాలు. జ్ఞానమెప్పుడూ "అహమస్మి" నేనున్నాను అనే రూపంలోనే ఉంటుంది. ఆకాశం వరకూ ఇది ఇది అని పరోక్షంగానే నిర్దేశిస్తాము గని నేననే ఈ జ్ఞానాన్ని మాత్రం పరోక్షంగా ఎప్పుడూ నిర్దేశించము. అపరోక్షంగా మన స్వరూపమనే భావిస్తాము. ఇదే దీని విలక్షణత. అందుకే దీనికొక్క దానికే ఆత్మ అని పేరు వచ్చింది. పోతే మన మనోభావాల దగ్గర నుంచి బాహ్యంగా ఉన్న ఆకాశం వరకు నా జ్ఞానానికి విషయంగా చూస్తున్నాను గనుక అదంతా ఇక ఆత్మ కాదు. కాదు గనుకనే అనాత్మ అని పేర్కొన్నారు మిగతా ప్రపంచాన్నంతా. ఇంకొక రహస్యమే మంటే "నేను" అనేది జ్ఞానం గనుక అంత వరకు అది చిత్తు. పోతే ’ఉన్నాను’ అనేది దాని ఉనికి గనుక సత్తు. ఈ చిత్తుకే చితి అని సత్తుకే స్ధితి అని మారు పేర్లు. ఇంతకూ నేను నా స్ధితి. నన్ను విడిచి స్ధితి లేదు. స్ధితిని విడిచి నేను లేను. కనుక రెండుగా నిర్దేశించినా రెండూ కలిసి సచ్చిదాత్మకమైన ఒకే ఒక ఆత్మ పదార్ధం. ఇదే అసలైన సామాన్యం. అనాత్మ ప్రపంచమంతా దీనికి విశేషమే.

సామాన్య మన్నప్పుడు దానికి కొన్ని లక్షణాలు సహజంగానే ఉంటాయి. అందులోనూ ఈ ఆత్మ మహా సామాన్యం గనుక అవి తప్పకుండా కనిపించి తీరాలి మనకు. ఏమిటవి ? విశేషాలు ఒక దాని నొకటి వ్యాపించ లేవు. వాటి సామాన్యాన్ని అసలే వ్యాపించ లేవు. కాని సామాన్యం మాత్రం దాని విశేషాలన్నింటినీ వ్యాపించి తీరుతుంది. అంతే కాదు. తనకు భిన్నంగా ఏ విశేషమూ స్వతంత్రంగా లేదు గనుక తనకది ఆభాసే కావలసి ఉంది. అంటే తానే మొత్తం ప్రపంచ రూపంగా భాసిస్తున్న దన్నమాట. రెండు లేవు పదార్ధాలు. ఉన్నది తానే. అదే స్వరూపం. స్వరూపమే విస్తరించి విశేష రూపంగా భాసిస్తున్నది. ఈ విస్తారానికే విభూతి అని మరొక పేరు. ప్రస్తుతం అన్నిటికీ సామాన్యం అత్మేనని కదా ప్రతి పాదించాము. ఆత్మ అంటే నేననే స్ఫురణే కదా. కాబట్టి నన్ను - నాకు కనిపించే సమస్త ప్రపంచాన్ని - నేననే భావంతోనే చూడాలసి ఉంది. విశేష రూపంగా ప్రతి ఒక్కటీ నాలో నుంచే బయటికి వచ్చి నాకే గోచరిస్తూ మరలా నా స్వరూపంలోనే చేరిపోవలసి ఉంది. నాకు భిన్నంగా ఏదేదో కనిపిస్తున్నా ఇన్ని రూపాలుగా మారి నాకు నేనే భాసిస్తున్నాననే అనుభవం నాకు కలగాలి. అప్పుడు సర్వమూ ఆత్మే ననే అద్వైత సిద్ధాంతం సిద్ధాంతమే గాక అనుభవం కూడా నని సాధకుడికి ఋజువవుతుంది.

కాని ఇలాంటి అద్వైతానుభవం మనలో ఇప్పుడెవరికైనా కలుగుతున్నదా అని ప్రశ్న. విశేషాలన్నిటిలో పరుచుకొని ఉన్నది నేనే ఐనప్పుడు క్రొత్తగా సాధించి పట్టు కోవలసిన అవసరమేముంది. అలాంటప్పుడు ఎంత ప్రయత్నించినా మన బుద్ధికి రాకపోవట మేమిటి. దీనికి సమాధానం ఒక్కటే. మనమిప్పుడు ఆత్మ అని భావిస్తున్నది అహంకారమే గాని ఆత్మ కాదు. ఉపాధులతో కలిసిన అత్మనే ఆత్మ అని భ్రమపడుతున్నాము. మనస్సు, ప్రాణము, ఇంద్రియాలూ, శరీరమూ ఇవి నా ఉపాధులే గాని వాస్తవంలో నేను గాను. వీటిని నాకు విషయంగా చూస్తూ కూడా నేనని వీటితో తాదాత్మ్యం చెంది కూచున్నాము. కర్తా, భోక్తా అని మనల్ను భావిస్తున్నాము. ఇలాంటి భావాన్ని పెట్టుకొని బ్రతుకుతున్నాము కనుకనే ఇది శుద్ధమైన ఆత్మ కాదు. దీనికి అహంకారమని, కర్త్రత్మ అని, జీవాత్మ అని, చిదాభాసుడని పేరు పెట్టారు వేదాంతులు. ఈ చిదాభాసుడే నిత్యమూ మన అనుభవానికి వస్తూ ఇదే ఆత్మ అని భ్రమ కొలపటం మూలాన శుద్ధమైన ఆత్మ మనకు తాత్కాలికంగా దూరమైంది. కనుకనే సర్వమూ నేననే అఖండానుభవం కలగటం లేదు. చిదా భాసుడు దానిని శరీరాది ఉపాధుల మేరకే తగ్గించి చూపుతున్నాడు.

కనుక అసలైన ఆత్మ ఏదో గుర్తించవలసిన అవసర మేర్పడుతున్నది, అలా చేయాలంటే ఆత్మలో ప్రవేశించిన అనాత్మ భాగాలను ఒక్కొక్కటే "నేతి - నేతి" అని వేరు చేసి మిగిలిపోయిన చైతన్య భాగమేదుందో దానినే ఆత్మగా గ్రహించవలసి ఉంది. దీనికే ఆత్మా నాత్మ వివేచన అని పేరు. దీని వలన ఆత్మ ఎంత వరకో అనాత్మ ఎంత వరకో నిష్కర్షగా తెలిసిపోతుంది. ఆత్మ అంటే నేననే స్ఫురణ మాత్రమే నని కదా చెప్పాము. అంత వరకే కేటాయించి చూస్తే ఇక శరీరమని, ఇంద్రియాలని, ప్రాణమని, మనస్సని, కర్తృరూపమైన అహమని ఆలోచన రకూడదు. ఈ కలాపంతో కలిసి దానిని చూడరాదు. చూచినా ఈ ఉపాధులు వాస్తవానికి దానిలో చేరవు. దానినంటవు. కారణమేమంటే నేననే జ్ఞానం ఆకాశం లాగా నిరాకారం. అసంహతం. అహంకారం మొదలుకొని త్వగింద్రియం దాకా మిగతా ఉపాధి వర్గమంతా సాకారం, సంహతం. అలాంటప్పుడు ఇవన్నీ "నేను" ఎలా అవుతాయి. నాకు గోచరించే వివి. మహా అయితే నావి కావలసిందే కాని నేను కాలేవు. నాకు గోచరించే దంతా నేయయితే భార్యా పుత్త్రాదులు, గృహా రామాదులు, ఇవి కూడా నేను కావలసివస్తుంది. కాని వటిని మనం నేననుకోటం లేదు కదా. అలాంటప్పుడు శరీరేంద్రియాలను మాత్రమే నేనని భావించట మేమిటి హాస్యాస్పదం కదా.

అలా భావించే సరికి ఆత్మకు దీనితో తాదాత్మ్య మేర్పడింది. అది క్రమంగా దేహాత్మ, ఇంద్రియాత్మ, ప్రాణాత్మ, విజ్ఞానాత్మ (బుద్ధ్యాత్మ) కర్త్రాత్మ (అహంకారం) - అని ఎలా ఆయా స్ధాయికి దిగజారి ఎక్కడికక్కడ పరిచ్ఛిన్నమై కలుషితమైపోయింది. దీనికే మిధ్యాత్మ అని అద్వైతులు పెట్టిన పేరు. ఈ మిధ్యాత్మే ఇప్పుడు మనం నేను - నేను అని దగ్గర పెట్టుకున్న ఆత్మ. ఇది శరీరాది సంఘాతంగా మారి అంత వరకే ఆగిపోయిన ఆత్మ. దీనినే అసలైన ఆత్మ అని - శరీరం సరిహద్దులు దాటి ఉన్న ప్రపంచమే అనాత్మ అని - అనాత్మకు చెందిన దేహాతులను ఆత్మలో చేర్చుకున్నాము.

నిజానికీ దేహాదులు కూడా ఘట పటాదుల లాగా ఆత్మకు స్ఫురిస్తున్నవే కనుక బాహ్య జగత్తు లాగా ఇదీ అనాత్మ క్రిందికే వస్తుంది. అందులో కొంత అనాత్మ భాగాల్ని ఆత్మగా భావించటం పెద్ద పొరపాటు. దాని ఫలితమే ఈ మిధ్యాత్మ. పోతే దాని చుట్టూ ఉన్నదే అనాత్మ ప్రపంచమని దాన్ని మరలా నాది - నాది అని చూస్తున్నాము. ఈ నాది అనుకునే బాహ్య ప్రపంచమే గౌణాత్మ. కాగా ఇవి రెండూ కూడా దొంగలే. అసలైన ఆత్మ కావివి. అనాత్మే. అంటే కర్తృ రూపమైన అహంకారం మొదలు శరీరం వరకు. శరీరం మొదలు బాహ్యమైన ప్రపంచం వరకు - అంతా అనాత్మ క్షేత్రమే. పోతే ఈ క్షేత్రమంతా ఏ జ్ఞానానికి స్ఫురిస్తున్నదో అది ఒక్కడే క్షేత్రజ్ఞుడైన ఆత్మ. తొంబది తొమ్మది ఇవి (99) అయితే అది ఒక్కటే ఒక్కటి. ఇది నామరూప క్రియాత్మకంగా విభక్తమై కనిపిస్తుంటే అది అవిభక్తంగా దీన్ని దర్శించే తత్త్వం.

అలాంటప్పుడిక నిజంలో దానికి దేహాది సంఘాతంతో ఎలాటి సంసర్గమూ లేదు. విడిబడే ఉంటుంది. అలా ఉంటే అది అసంహతం, నిరాకారం. అప్పుడు సాకారమైన దేహాదులను ముందుకు తోసి అది వీటి నుంచి వెనక్కు మళ్ళుతుంది. వెనక్కు మళ్ళక పోతే తన ముందుకు వచ్చిన ఈ దృశ్య వర్గాన్ని అది దర్శించలేదు. మరి దర్శిస్తూనే ఉన్న దిప్పుడు. కాబట్టి ఆమేర కది వీటన్నిటికీ వెనకాల ఉండవలసిందే. దీనికే ప్రత్యగాత్మ అని పేరు. సాకారమైన. సంహతమైన, శరీరాదులతో చేయి కలపక వాటి నుంచి తొలగిపోయే సరికి ఇక శరీరంలో ఉండవలసిన ఆగత్యం లేదు దానికి. సాకారంలో నిరాకారమైన తత్త్వం ఎప్పుడూ ఇమిడి పోదు. కనుక ఒక ఘటాకాశం లాగా అది శరీరంలో ఎంత ఉందో శరీరం వెలపల కూడా అంతగా వ్యాపించగలదు. అలా వ్యాపించే ఈ ప్రత్యగాత్మనే పరమాత్మ అని పేర్కొన్నారు పెద్దలు. విడిబడింది కనుక ప్రత్యక్, వ్యాపిస్తుంది కనుక పరమ. అప్పుడు దాని స్వరూప మేమిటి! మొదట చెప్పిందే. సత్తు చిత్తు. చిత్తు దాని స్వరూపం. సత్తు దాని అస్తిత్వం. సర్వత్రా ఉండాలి గనుక ఇక దేహాత్మ కాదది. అంటే మిధ్యాత్మ లేదు. ఎగిరి పోయింది. మిధ్యాత్మ లేకుంటే గౌణాత్మ కూడా లేదు. ఎందుకంటే దేహం వరకే నేననుకుంటే నే ఇది కాని దంత నేను కాదు నాది అనే భావ మేర్పడింది. అంతటా నేనే వ్యాపించినప్పుడు ప్రత్యేకించి నాదనేది లేదు. ప్రత్యేకించి నేననే మిధ్యాత్మ ఎలా లేదో ప్రత్యేకించి నాది అనే గౌణాత్మ కూడా లేదు.