#


Index

  కాబట్టి నన్ను నాకు కనిపించే సమస్త ప్రపంచాన్ని - నేననే భావంతోనే చూడవలసి ఉంది. విశేష రూపంగా ప్రతి ఒక్కటీ నాలో నుంచే బయటికి వచ్చి నాకే గోచరిస్తూ మరలా నా స్వరూపంలోనే చేరిపోవలసి ఉంది. నాకు భిన్నంగా ఏదేదో కనిపిస్తున్నా ఇన్ని రూపాలుగా మారి నాకు నేనే భాసిస్తున్నాననే అనుభవం నాకు కలగాలి. అప్పుడే సర్వమూ ఆత్మే ననే అద్వైత సిద్ధాంతం సిద్ధాంతమే గాక అనుభవం కూడా నని సాధకుడికి ఋజువవుతుంది.

  కాని ఇలాంటి అద్వైతానుభవం మనలో ఇప్పుడెవరికైనా కలుగు తున్నదా అని ప్రశ్న. విశేషాలన్నిటిలో పరుచుకొని ఉన్నది నేనే ఐనప్పుడు క్రొత్తగా సాధించి పట్టు కోవలసిన అవసరమేముంది. అలాంటప్పుడు ఎంత ప్రయత్నించినా మన బుద్ధికి రాకపోవట మేమిటి. దీనికి సమాధానం ఒక్కటే. మనమిప్పుడు ఆత్మ అని భావిస్తున్నది అహంకారమే గాని ఆత్మ కాదు. ఉపాధులతో కలిసిన ఆత్మనే ఆత్మ అని భ్రమపడుతున్నాము. మనస్సు, ప్రాణము, ఇంద్రియాలూ, శరీరమూ ఇవి నా ఉపాధులే గాని వాస్తవంలో నేను గాను. వీటిని నాకు విషయంగా చూస్తూ కూడా నేనని వీటితో తాదాత్మ్యం చెంది కూచున్నాము. కర్తా, భోక్తా అని మనల్ను భావిస్తున్నాము. ఇలాంటి భావాన్ని పెట్టుకొని బ్రతుకుతున్నాము కనుకనే ఇది శుద్ధమైన ఆత్మ కాదు. దీనికి అహంకారమని, కర్రాత్మ అని, జీవాత్మ అని, చిదా భాసుడని పేరు పెట్టారు వేదాంతులు. ఈ చిదాభాసుడే నిత్యమూ మన అనుభవానికి వస్తూ ఇదే ఆత్మ అని భ్రమ కొలపటం మూలాన శుద్ధమైన ఆత్మ మనకు తాత్కాలికంగా దూరమైంది. కనుకనే సర్వమూ నేననే అఖండానుభవం కలగటం లేదు. చిదా భాసుడు దానిని శరీరాది ఉపాధుల మేరకే తగ్గించి చూపుతున్నాడు.

Page 129