ప్రతిష్ఠాపన
ప్రతిష్ఠాపన
భాగవత సామ్రాజ్యమని నేనీ గ్రంథానికి పెట్టిన పేరు. దీనికి పేరు పెట్టటంలో నాకు స్ఫూర్తి నిచ్చింది త్యాగరాజస్వామి వారి రామభక్తి సామ్రాజ్యమనే పాట. ఆ పాటలో సామ్రాజ్యమనే మాట నాకు చాలా ముచ్చటగా కనిపించి దీనికి కూడా అలాంటి నామకరణమే చేశాను. భాగవతుల సామ్రాజ్యమిది. మన ఈ భౌతికమైన సామ్రాజ్యాలలాగా నశ్వరం కాదు. శాశ్వతమైనది. ఎప్పటికైనా మానవుడా సామ్రాజ్యంలో పౌరసత్త్వం సంపాదిస్తేనే బాగుపడతాడనే హెచ్చరిక కూడా గర్భితమయి ఉంది ఇందులో. భాగవత పురాణం మీద సాగిన ఈ సమీక్షా గ్రంథం నా రచనా వ్యాసంగంలో మలిఘట్టానికి చెందిన తొలి రచన. తొలిఘట్టానికి సంబంధించి ఒక అయిదు గ్రంథాలు ఇంతకుముందే వ్రాసి ప్రకటించాను. నిర్వాణదశక వ్యాఖ్యా, దక్షిణామూర్తి స్తోత్రార్థ వివరణమూ, ప్రస్థానత్రయ పారిజాతమూ, సాధకగీత, జగద్గురు మహోపదేశమూ, ఇవన్నీ తత్త్వ సాహిత్యమనే Literature of Philosophy శీర్షిక క్రిందికి వస్తాయి. పోతే ఇక సాహిత్య తత్త్వమనే Philosophy of Literature శీర్షిక క్రింద మరొక అయిదు రచనలు చేయాలని నా సంకల్పం. ఆ పరంపరలో మొట్టమొదటిదీ భాగవత సామ్రాజ్యం. దీని తరువాత వరుసగా రామాయణ రామణీయకమనీ, మహాభారత వైభవమనీ, కాళిదాస ప్రత్యభిజ్ఞ అనీ, ద్వాదశాదిత్యులనీ, ఇలా మరి నాలుగు కృతులు నాభావాంబర వీధి నుంచి నేల కవతరించవలసి ఉంది. దానితో సాహిత్య తత్త్వమనే ఈ మలిఘట్టానికి కూడా భరత వాక్యం పలికినట్టవుతుంది.
“అభ్యర్థితమ్ ప్రథమ"మని ఒక ఆర్యోక్తి ఉన్నది. అభ్యర్థితమంటే విశిష్టమైనది. విశిష్టమైనదేదో దానికి ప్రాథమ్య priority మివ్వాలట. మరి అలాటి విశిష్టమైన వస్తువేది. భౌతిక జగత్తుకన్నా విజ్ఞాన జగత్తు విశిష్టమైతే ఆ విజ్ఞానాలన్నిటిలో విశిష్టమైనది సర్వాత్మ భావ The subjective unity of all things రూపమైన అద్వైత విజ్ఞానం. అదే అన్నింటికీ మూల భూతమైన
Page 5