మార్గం. ధామ్నా స్వేన - స్వకీయమైన ధామమే. ధామమంటే తేజస్సు ప్రకాశం. స్వకీయమంటే తనకు సంబంధించిన అంటే తన ఆత్మచైతన్య ప్రకాశంతోనే తన అజ్ఞాన తిమిరాన్ని పారదోలాలి. ఇది నా చైతన్యమే - నేనే - ఈ సృష్టిలో నాకేది తారసిల్లినా అది సత్త్వమే చిత్త్వమే- అని తద్రూపంగా మార్చుకొని తదేక దృష్టితో ప్రతి ఒక్కటీ దర్శిస్తూ పోతే ఆ వెలుగులో ఈ త్రిగుణాత్మక ప్రపంచమనే చీకటి పటాపంచెలు గాక తప్పదు. అప్పుడపరంపోయి పరమే మిగులుతుంది మనకు. అది ఈ ప్రపంచానికీ మనకూ రెంటికీ ఏకైకమైన స్వరూపమని అనుభవానికి రాగలదు. ధీమహి-అలాంటి అఖండా ద్వితీయానుభవం కలిగేదాకా దాని కాలంబనంగా దీన్ని మనం తద్రూప భావనతో ధ్యానం చేయటమొక్కటే శరణ్యమని భావం.
ఆత్మప్రకాశంతోనే అజ్ఞాన తిమిరాన్ని దూరం చేసుకోవాలనీ అదే పరతత్త్వాన్ని అందుకొనే మార్గమనీ చెప్పాము. అలా నిత్యమూ దూరం చేసుకొని కూచున్నవాడు పరమాత్మ. సదా నిరస్త కుహకమైన తత్త్వమది. పోతే అలాంటి భాగ్యానికి నోచుకోలేదీ జీవుడు. మరి వీడలాంటి అదృష్టానికి నోచుకోవాలంటే ఏమిటుపాయమని ప్రశ్న. దీనికి సమాధానమే రెండవ శ్లోకం. “ధర్మః ప్రోజ్ఞితకైత వోత్ర పరమః” సత్యం గమ్యమైతే ధర్మమే దానికి సాధనం. ధారణా ద్ధర్మ ఉచ్యతే. సత్యాన్ని దర్శించేదాకా సాధకుణ్ణి ధరించి ఉండేదేదో అది ధర్మం. కనుకనే ఇది వేద చోదితమైన సామాన్య ధర్మం కాదు. వేదం బోధించే ధర్మం ప్రవృత్తి రూపం. దానివల్ల కలిగే ఫలం మహా అయితే సత్యలోక ప్రాప్తి. అంతకు మించి లేదు. పోతే ఇది ప్రవృత్తిగాదు. నివృత్తి లక్షణం. భాగవత ధర్మమంటారు దీన్ని. భగవత్తత్త్వాన్ని ఉన్నదున్నట్టు పట్టుకోటానికిది ఒక్కటే ఆలంబనం. కనుకనే అది పరమయితే ఇదీ పరమమే. పరమం కనుకనే కైతవం Fraud లేదు దీనిలో. ప్రవృత్తి ధర్మంలో కావలసినంత ఉంటుందది. ఫలకామనా-కర్తృత్వ బుద్ధీ-ఇవి రెండూ దానిలోని కైతవాలు. రామాయణ భారతాలలో ఇలాటి కైతవ ధర్మం అక్కడక్కడా దర్శనమిస్తుంది మనకు. అందుకే అవి ఇతిహాసాలయింది. కాగా భాగవతం పురాణం. మోక్షైక పరాయణమిది. ఇందులో ఏ మాత్రం కల్మషమున్నా పనికిరాదు. నిష్కల్మషమయిన భాగవత ధర్మాన్నే బోధించాలి. ఎవరిదా ధర్మం. ఎవరాచరించాలి. ఆచరిస్తేనే గదా అది ధర్మమయ్యేది. ఎవరా ఆచరించేవారు. “నిర్మత్స రాణాం సతాం” మాత్సర్య గంధం కూడా లేని సత్పురుషులు
Page 46