
నీక బ్రాహ్మణ గోగణార్తి హరణా - నిర్వాణ సంధాయకా నీకున్ మొక్కెద ద్రుంపవే భవ లతల్ నిత్యాను కంపానిధీ అని వాపోతుంది.
ఈ మాటలు బాగా గమనించండి. ఆయన యదు భూషణుడట నరసఖుడట. అంటే తన పుట్టినింటివాడు కాబట్టి తన పుత్రుడైన అర్జునుడికి అన్నిటా బాసట అయి నిలిచాడు. అంతేకాదు. శృంగార రత్నాకరుడు. ఏది చేసినా అది ఒక లీల ఆయనకు. ఏమిటది. లోక విద్రోహులైన దానవులను శిక్షించటమొకటి. లోకోత్తరులైన దేవతాదులను రక్షించటమొకటి. అంతేకాక మహాజ్ఞానులైన వారికి నిర్వాణ సుఖం కూడ ప్రసాదించగల దయామయుడు భగవానుడు. అంతటి దయాళుడవు గనుకనే నా భవలతలను కూడా త్రుంచి వేయమని బ్రతిమాలుతున్నది. భవబంధములను త్రుంచి వేసే భారం భగవంతుడి మీద పెడుతున్నదావిడ. భగవంతుడు గాదు త్రుంచి వేయవలసింది. ఎవడి బంధం వాడే త్రుంచుకోవలసి ఉంది. "ఉద్ధరే దాత్మ నా త్మానమ్" ఆత్మోద్ధరణకు చేయవలసిన ప్రయత్నమంతా జీవుడిదే. దేవుడిది గాదు. స్వప్రయత్నం లేకుండా ఈశ్వరుడు తానుగా ఎవ్వరికీ మోక్షాన్ని ప్రసాదించడు. ఏమిటా ప్రయత్నం. తన కనాది సిద్ధంగా ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకోటం జ్ఞానం వల్లగాని సంభవం కాదది. కాబట్టి ఆత్మజ్ఞానం కోసమెవరికి వారు ప్రయత్నం సాగిస్తూ పోవాలి. అలాటి ప్రయత్నం లేదు కుంతికి. అందుకు కూడ నాకు శక్తి లేదు. నీవే దాని ననుగ్రహించమని అడుగుతున్నది. “యాదవులందు, పాండవుల యందు నధీశ్వర నాకు మోహవిచ్ఛేదము సేయుమయ్య” మోహమంటే అజ్ఞానం. దానివల్ల కలిగే అభిమానం. దానితోనే వీరు నావారు వీరు పరాయి వారనే భావం మానవులకు. అది తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించమంటుంది. “ఘన సింధువు జేరెడి గంగ భంగి – నీ పాదసరోజ చింతనముపై ననిశంబు మదీయ బుద్ధి నత్యాదర వృత్తితో గదియునట్లుగ జేయగదయ్య” నీ పాదాల మీద నా మనసు నిలుస్తుందో లేదో అది నిలిచేలాగా నీవే అనుగ్రహించమంటుంది. అప్పటికి మోహవిచ్ఛేదం చేయవలసిందీ భగవంతుడే. భగవత్తత్త్వాన్ని భజించే భావాన్ని కలిగించ వలసిందీ భగవానుడే కుంతి దృష్టిలో.
Page 255
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు