మన మవలీలగా అర్థం చేసుకోవచ్చు. అనుకోకుండా దుర్వాసుని వంటి మహర్షి వల్లనే వచ్చి పడ్డ దుపద్రవం. దుష్టుల వల్లనే కాదు. శిష్టులవల్ల కూడా రావచ్చు ఒక కష్టమనేది. దుష్టులు ప్రతికూలురైతే శిష్టులనేవా రనుకూల శత్రువులు. అది జీవుడి ప్రారబ్ధం కొద్దీ ఏర్పడినా ఏర్పడుతుంది. లేదా ఆ ఈశ్వరుడు వినోదం కొద్దీ చేసే పరీక్షవల్లనైనా ఏర్పడుతుంది. అలాగే ఏర్పడిం దంబరీషుడికి కూడా. దానికి నిదర్శనమే దుర్వాసుడి వృత్తాంతం. ద్వాదశీ వ్రతం చేయాలనే బుద్ధి పుట్టిందంబరీషుడికి. ఒక్క సంవత్సర కాలమా వ్రతం సాగించి వ్రతాంతంలో మూడు రాత్రులు పత్నీ సమేతంగా ఉపవాసం చేసి యమునా నదిలో స్నానం చేసి మధువనంలో మధుసూదనుని కభిషేకం చేస్తాడు. అర్బుదన్యర్బుదాలైన గోవులను అపరిమేయమైన హిరణ్యంతో సహా భూసురులకు దానమిస్తాడు. ఎంతోమంది బ్రాహ్మణుల కన్నార్థులై వచ్చిన వారికి కడుపునిండా భోజనం పెడతాడు. ఇక తానూ పారణ చేద్దామని తయారవుతుండగా ప్రత్యక్షమయ్యాడు దుర్వాసుడు. అసలే ముక్కోపి ఆ మహర్షి అలాంటి వాణ్ణి భక్తి పూర్వకంగా పూజించి భోజనం చేసి పొమ్మని ప్రార్థిస్తాడా రాజు. సరేనంటాడీ మునిరాజు. యమునా నదికి స్నానానికని వెళ్లి ఎంతకూ లేచిరాడు. ఇక అర్ధ ముహూర్త కాలమే వ్యవధి ఉంది ద్వాదశీపారణకు, చేసి తీరాలాలోపల. ఎలాగా ఎంతకూ రాడే ఈ మహర్షి అని సభ్యుల నడిగితే సలిల పానం చేయండి సరిపోతుందని సలహా ఇస్తారు అలాగే చేసి కూచుంటాడు. అప్పుడు వచ్చాడా మహానుభావుడెవడో చెప్పి పంపినట్టు. వచ్చీ రాగానే విషయం తెలుసుకొని ఉగ్రుడయి తన జటామండలంలో ఒక జట పెఱికి వేల్వగానే అది ఒక కృత్యగా మారి ఆ రాజు మీదికి లంఘిస్తుంది. అణుమాత్రం చలించలేదా రాజు. తన్ను కాపాడమని కనీసం తన దగ్గర ఉన్న సుదర్శనాయుధాన్ని కూడా ప్రార్ధించలేదు.
ఇదే ఇందులో గమనించవలసిన విశేషం. ఒక భక్తుడు అనన్య భావనతో భగవంతు నారాధిస్తూ ఉంటే చాలు. తన్ను తాను కాచుకోవలసిన పనిలేదు. ఆ భావనే కాపాడుతుంది. “యోగక్షేమం వహామ్యహ” మని గదా చెప్పాడు. యోగక్షేమా లాయన చూచుకొంటాడు. ఆయనకే వదలేయవలసిందది భక్తుడు చూచుకోవలసింది కాదు. భక్తుడే చూచుకోవలసి వస్తే అది అనన్యమైన భక్తి కాదు. అన్యం కూడా అందులో చోటు చేసుకొంటుంది. అన్యం తన విషయం తాను చూచుకొనే ప్రయత్నమే
Page 217