పూర్వార్ధము - అవరోహణ క్రమము
1. శ్రీ మాతా
2. శ్రీమాహారాజ్జీ
3. శ్రీమత్సిసింహాసనేశ్వరీ
ఇవి సహస్రనామాలలోనే గాక మన అష్టోత్తర నామాలలో కూడా మొదట వచ్చే నామాలు. ఇవి మూడూ ప్రపంచ సృష్టి స్థితి లయాలను తెలుపుతున్నాయి మనకు. మాతా అనేది సృష్టిని రాజ్ఞిని అనేది స్థితిని - సింహాసనేశ్వరి అనేది లయాన్ని. మొదటి రెండింటిలో కాకపోయినా మూడవదైన సింహాసనేశ్వరిలో ఒక సందేహం అది లయం అని ఎలా చెబుతున్నదని. సింహాసన అంటే సింహాసనం మీద కూర్చొని ఈశ్వరి అంటే జగత్తును పాలించేదని అర్థం వస్తున్నది. ఇది మహారాజ్ఞి చేసే క్రియే గదా. ఇక సంహారమనే భావమెక్కడ ఉంది. అందుకే దానికర్థం అలా చెప్పగూడదు. సింహమంటే హింసించేదని అర్థం. అసనమంటే కబళిచటం . సింహం లాగా హింసించి ఈ మొత్తం ప్రపంచాన్నే కబళించి పారేయటానికి ఈశ్వరి అంటే సమర్థమైనదని అర్థం చెప్పుకోవలసి ఉంది. అప్పటికి సంహారాన్నే చెప్పినట్టవుతుంది.
ఈ విధంగా సృష్టి స్థితి సంహారాలనే మూడు పనులూ చేస్తున్నదా దేవి అని వర్ణించటం వల్ల ఒక ఘటానికి మృత్తిక లాగా ఆవిడే ఈ విశ్వానికంతా ఉపాదాన కారణమవుతున్నది. ఉపాదానం గనుకనే ఘటం మృత్తికకు వేరుగా లేనట్టు ఈ విశ్వం కూడా ఆ శక్తికి వేరుగాదని బోధపడుతున్నది. అంతేకాదు. శక్తి అనేది స్వతంత్ర కాదని చెప్పాము. అది శివతత్త్వాన్ని ఆశ్రయించి చిద్రూపిణిగానే ఉంటుంది. కనుక ఒక మృత్తిక లాగా ఉపాదానమే కాక చేతనుడైన కులాలుడి లాగా అది ఈ ప్రపంచానికి నిమిత్తకారణం కూడా. అంచేత శక్త్యాత్మకమే ఇక ఈ కనిపించే ప్రపంచమంతా.
Page 12