పూర్వార్ధము - అవరోహణ క్రమము
శక్త్యాత్మకం గనుకనే శక్తి అనే దృష్టితోనే చూడాలి ఏ పదార్థం చూచినా మనమిందులో. మూడు నామాలలోనూ మాతా మహారాజ్ఞి సింహాసనేశ్వరీ అనేవి ఎక్కడికక్కడ మారిపోతున్నా శ్రీ అనే మొదటి అక్షరం అలా మారటం లేదు. మూడింటిలోనూ కలిసి వస్తూనే ఉంది . దీని మూలంగా మనమర్థం చేసుకోవలిందేమని. ప్రపంచం ఎప్పటికప్పుడు వస్తూపోతూ ఉంది గనుక అది మిధ్యా భూతం. దానికధిష్ఠానమైన చైతన్య శక్తి నిలకడగా ఉండేది గనుక అదే సత్యమైన పదార్థం.
కనుక సృష్టి స్థితి లయాత్మకమైన సంసారంగా కాక దీన్ని మనం దీనికి అధిష్ఠానమైన శ్రీ రూపంగా లేదా శక్తి రూపంగానే భావన . చేయవలసి ఉంది. భావన చేసే కొద్దీ అది మనలను అవశ్యంగా ఆ శివసన్నిధికే చేరుస్తుంది. సందేహం లేదు. శ్రీ అనే మాటకు శ్రయించటం లేదా ఆశ్రయించటం అని అర్థం. శివచైతన్యాన్ని శక్తి ఎపుడూ ఆశ్రయించే ఉంటుంది. విడిచి ఉండదు. అందుకే శ్రీ అనే పేరు దానికి సార్థకంగా ఏర్పడింది. తాను చైతన్యాన్ని ఆశ్రయించి ఉంది గనుకనే సాధకులైన వారిని కూడా ఎప్పుడో ఒకప్పుడు అది చైతన్యాశ్రితులనే చేయగలదు. ఈ శక్తి బ్రహ్మ విద్యే గాని మరేదీ కాదు. శివరూపమైన బ్రహ్మతత్త్వాన్ని ఆశ్రయించి ఉన్నదది. విద్యచేతనే వేద్యమనేది పొందగలడు మానవుడు. వేద్యం ఈ జీవితానికి శివతత్త్వమేనని గదా వర్ణించాము. దానిని ఆశ్రయించిన శ్రీ రూపిణి అయిన ఈ విద్యయే మనకది ప్రసాదించగలదు. కనుకనే శ్రీవిద్య అనేది వైదికమైన బ్రహ్మ విద్యే అని గుర్తించాలి మనం. తాంత్రికులు భావిస్తున్నట్టు బ్రహ్మ విద్యకు వ్యతిరిక్తమైన మరేదో విద్య కాదిది.
Page 13