జ్ఞాన విజ్ఞానాల నాలంబనం చేసుకొని తరించమని చివరకు బోధ చేస్తాడు. ఇంతకూ కేవల సగుణ దృష్టి ఉన్నంత వరకూ త్రిగుణాత్మక సృష్టి నుంచి ముక్తి లేదు భక్తుడికి. అది ప్రకృతి గుణాలే కావచ్చు. భగవద్గుణాలే కావచ్చు. గుణాలు గుణాలే. అవి అపరిచ్ఛిన్నమైన తత్త్వాన్ని పరిచ్ఛిన్నం చేసి చూపుతాయి. అలా చూపటం వల్లనే కడపటి దాకా కృష్ణుని దివ్య సుందర విగ్రహాన్నే చూస్తూ ఆయన మధురమైన మాటలే వింటూ ఆయన గారి లీలలే తిలకిస్తూ - పరవశులై బ్రతుకులు సాగిస్తూ పోతే చాలు అదే పరమ పద ప్రాపకమని నమ్ముతూ వచ్చారా గోప గోపికాదు లంతా. అక్రూరాదులూ అలాగే విశ్వసించారు. అది ఎప్పటికైనా తుప్పు రాలినట్టు రాలిపోతే తప్ప అసలైన భగవత్తత్త్వాన్ని మీరు పట్టుకోలేరని బోధించటానికే. భగవానుడు చివరకు వారందరినీ ఎక్కడ వారి నక్కడ దూరంగా సాగనంపి తాను కూడా వారికి దూరమై పోతాడు. ఆయన అలా భౌతికంగా దూరమై పోవటంలో ఇదీ పరమార్థం. అలా ఆయన దూరమై నప్పుడే అర్జునాది పాండవులు గానీ- అక్రూరాది యాదవులు గానీ - అందులోని అంతరార్థాన్ని గ్రహించి బాగుపడ గలిగారు. కృష్ణ లీలంటే నిజంగా లీలే.
Page 192