అది దానవులకు నివాసం కావటమే. దానికధిపతి ఒక రాజసప్రకృతి అయిన దానవుడు కావటమే. అలాంటివారు పాలకులూ, పాలితులూ అయినప్పుడది ఎంత సంపన్నమయినదైనా దెబ్బతినవలసిందే. అందుకే దాని ఐశ్వర్యాన్ని అంతగా వర్ణించింది కవి. అంత ఐశ్వర్యమూ చూడండి ఒక్క దుర్మార్గుడి వల్ల చివరకెలా విశీర్ణమయి పోతుందో అని మనకు స్ఫురింపజేయటమే దాని సుదీర్ఘ వర్ణనకు ప్రయోజనం. దీనికి తగినట్టు భౌతికమైన బాహ్యమైన సౌందర్యాన్నే వర్ణిస్తూ పోతాడు లంకా వర్ణనలో. మరి అయోధ్య వర్ణన అలా కాదు. బాహ్యమైన దానికన్నా ఎక్కువగా నగరవాసుల శీలవృత్తాదులనూ పాలకుల గుణగణాలనూ ఎంతో ఎక్కువగా వర్ణిస్తాడు. ఎందుచేత. ఇది ముందు చెప్పినట్లు రాజస ప్రకృతికిగాక సాత్త్వికగుణ సంపన్నులకు నిలయం. శుద్ధసత్వోపాధి అయిన శ్రీరాముడికి జన్మస్థానం. కాబట్టి తదనుగుణంగానే సాగింది వర్ణన. మరి ఒక విశేషమేమంటే లంకా వర్ణన మొదటరాదు. ఎక్కడో సుందరకాండలో వస్తుంది. కారణం దాని ప్రసక్తి అక్కడే గనుక. సముద్రలంఘనం చేసి వెళ్లిన తరువాత గదా హనుమంతుడు దాన్ని దర్శిస్తాడు. అంతవరకూ దాన్ని గూర్చి వినటమే గాని కనటంలేదు. కన్నప్పటినుంచే సాగాలి గదా వర్ణన. దీనివల్ల అది ఎంత వైభవోపేతమో ఎంత సురక్షితమో హనుమంతుడు గ్రహించాలి. అలాంటి చోట సీతను వెదకటం ఎంత ప్రయాసతో కూడినదో మనం తెలుసుకోవాలి పోతే అయోధ్యను ఆదిలో ఎందుకు వర్ణించినట్టు. దశరథుడి పాలనతో గదా కథ ఆరంభమవుతుంది. అందుకోసం అయోధ్యా వర్ణనతోనే అది సాగవలసి ఉంది. ఇలా ఈ రెండు పట్టణాలకూ కథలో ఎంత ప్రసక్తి ఉందో వాటి వర్ణన కూడా అంత సముచితంగా జరిగింది.
పోతే రెండవది సముద్రవర్ణన. సముద్రానికి వెతుకుకోనక్కరలేదు. రామాయణంలో సహజంగానే ఉన్నదది. లంకా పట్టణ మున్నదసలు సముద్ర మధ్యంలో. అదే దానికి నిసర్గ సిద్ధమైన ఒక మహాపరిఖ. లంకకెవరు వెళ్లవలసినా దానిని దాటిగాని వెళ్లడానికి లేదు. అది శతయోజన విస్తీర్ణం. సీతాన్వేషణార్థం దక్షిణంవైపు బయలుదేరిన వానరవీరులకది పోగా పోగా దర్శనమిచ్చింది. అది దాటి పోతేగాని సీత దర్శనానికి నోచుకోలేరు వారు. అందుకు సమర్థుడొక ఆంజనేయుడే. ఆయనే చివరకు లంఘించి వెళ్లాడా సాగరాన్ని. ఆ సందర్భంలో
Page 97