చాపల్యాన్ని సూచిస్తుందేగాని ఔచిత్యం దెబ్బతింటుంది. ఔచిత్యం దెబ్బతింటే పాఠకుడి మనస్సుకది ఎంతో ఉద్వేజకం. ఇలాంటి దోషాలు ఎంత మహాకవుల కావ్యాల్లోనైనా అంతో ఇంతో దొర్లి ఉండవచ్చుగాని వాల్మీకి రామాయణంలో మాత్రమెక్కడా మచ్చుకుకూడా ఒక్కటైనా కానరాదు. మీదు మిక్కిలి ముందు చెప్పిన మూడు షరతులూ తూ.చా. తప్పకుండా పాటించినట్టు కనిపిస్తుందా మహాకవి.
అసలొక చమత్కార మేమంటే వాల్మీకి అదృష్టమో ఏమో చెప్పలేముగాని ఆలంకారికులు పేర్కొన్న వర్ణనలన్నింటికీ సహజంగానే అవకాశ మేర్పడింది రామాయణంలో. కవి బలవంతంగా అవసరమున్నా లేకున్నా తెచ్చిపెట్టవలసిన పనిలేదు. నగరార్ణవశైలర్తు అని ఇత్యాదిగా శాస్త్రం పేర్కొన్న జాబితాలో ఎన్ని ఉన్నవో అన్నిటికీ ప్రవేశముంది రామాయణంలో. కథా వస్తువే అలాంటి అవకాశమిస్తున్నది. చూడండి. రామాయణంలో రెండు మహానగరాల ప్రసక్తి వస్తుంది. ఒకటి ఇక్ష్వాకువుల రాజధాని అయోధ్య. మరొకటి రాక్షస రాజధాని లంక. కథానాయకుడి జన్మస్థానమొకటైతే ప్రతినాయకుడి నివాస స్థానం మరొకటి. రెంటినీ వర్ణించక తప్పదు కవి. అందులోనూ అవి రెండూ రామ రావణులు క్రొత్తగా నిర్మించినవి కావు. మొదటి నుంచీ వారి పూర్వీకులు కాపురమున్నవే. అవి రాజధానిగా దేశాన్ని పాలించినవారే. వాటి రెంటినీ కవి ఎంతో వైభవంగా వర్ణించాడు. ఎందుకని ? అవతార పురుషుడు జన్మించిన స్థలమొకటైతే అతని నెదిరించి నిలిచిన ప్రతివీరుడి వాసస్థానం మరొకటి. మరి అలాంటి పట్టణాల వైభవాన్ని వర్ణించకపోతే ఎలాగ. అలా వర్ణించేకొద్దీ తన్నగరాధిపతుల వైభవమూ, ప్రాభవమూ మనకన్నులకు సాక్షాత్కరించాలి. కనుకనే అయోధ్యను బాలకాండ ఆరంభంలోనూ, లంకానగరాన్ని సుందరకాండలో కొంత యుద్ధకాండలో కొంత వర్ణించాడు మహర్షి పైగా లంకను వర్ణించినంత విస్తృతంగా అయోధ్యను వర్ణించలేదు. నగరీషు లంకా అన్నట్టు నగరాలలో చాలా అందమయింది గదా లంక. అందుకే దాన్ని అంత దీర్ఘంగా వర్ణించాడు. అలా వర్ణించటం మూలంగానే అయి ఉంటుందా కాండకు సుందర అనే పేరు రావటం కూడా. ప్రతివీరుడి రాజధాని నంత గొప్పగా వర్ణించటంలో ఏమిటంతరార్ధం. అంత భోగభాగ్యాలకు నిలయమైనా ఉన్నట్టుండి ఒక వానరుడిచేత దగ్ధమయింది. మిగతా వానరులందరిచేత చివరకు సర్వనాశనమయింది. కారణం
Page 96