చేరిపోతున్నట్టు బాగా దాఖలా అవుతుంది మనకు. విశ్వామిత్రుడు రాముణ్ణి చాలావరకు తీర్చిదిద్ది పరశురాముడి కందిస్తే ఆయన వైష్ణవతేజాన్ని ప్రవేశపెట్టి మంథరా కైకేయీల కొప్పజెప్పితే వారాయన నరణ్యం పాలుచేస్తే అక్కడ శూర్పణఖ అందిపుచ్చుకొని లంకలో ఉన్న రావణుణ్ణి ప్రేరణ చేస్తే వాడు మారీచుణ్ణి నియోగిస్తే వాడు వారిని దూరం తీసుకెళ్లి సీతావియోగం కల్పిస్తే దాని ఆచూకి జటాయు కబంధాదు లెఱిగిస్తే వారివల్ల సుగ్రీవాదుల అండజేరితే సుగ్రీవుడి దూత హనుమంతుడికి సంపాతి ఇంకా స్పష్టంగా చెబితే అది అందుకొని హనుమంతుడు వెళ్లి సీతను చూచి ఆ వృత్తాంతం రాముడి చెవిన వేస్తే తరువాత వానర సైన్యంతో బయలుదేరి వెళ్లి రాముడు రావణుణ్ణి సంహరించి మరలా అయోధ్యకు వస్తే అక్కడ అగస్త్యాదులాయనకు రావణ పూర్వ వృత్తాంతమంతా వర్ణించి చెబితే ఇలా పూర్వాపరాలు ఏమాత్రమూ బెసకకుండా సాగిపోయింది కథావాహిని. ఇతిహాస రచయిత వాల్మీకి వృత్తాంతంతో ఆరంభమయి మరలా ఆయనగారి వృత్తాంతమే అంతంలో వస్తుంది. సీతా పరిత్యాగానంతర మాయనే ఆవిడ కాశ్రయమిస్తాడు. కుశలవు లాయన ఆశ్రమంలోనే జన్మిస్తారు. అయోధ్యకు వెళ్లి రామాయణ కథాగానం చేస్తారు. సీత నేలుకోమని రాముడి కాయనే సలహా ఇస్తాడు. చివరికేది ఫలించకుండానే కథ ముగుస్తుంది. ఇది కథానాయకుడి కథా - కవికథా. కథానాయకుడి కథలో కవికథ. కవి కథలో నాయకుడి కథ. కథానాయకుడి గుణగణాలు నారదుడు వర్ణిస్తేనే గదా కవి కది ప్రేరణ అయింది. కవి ప్రేరణ చెంది వ్రాయటంవల్లనే గదా అవి మరలా ఆయన కథ అయిన రామాయణమయింది. అంటే వాస్తవమే కల్పనకు దోహదంచేస్తే ఆ కల్పనే మరలా వాస్తవమైన ఒక గ్రంథాన్ని మనకందించింది. ఇది ఒక విలక్షణమైన రామణీయకం. కథా గ్రథనంలో కూడా అప్రయత్నంగా సప్రయత్నంగా దొరలిన అద్భుతమైన రామణీయకం.
Page 95