#


Index

అంగాంగి భావము

  ఇదేమిటీ కథ. చిత్రంగాలేదు. దీనినెందుకు తెచ్చినట్టు కవి. ఏమిటవసరం. ఉంది అవసరం. అవసరం లేనిదేది ఉండరాదు కావ్యంలో అంతో ఇంతో ప్రయోజనముంటేనే కవిదాన్ని కల్పిస్తాడు. మహాకవి వాల్మీకి కల్పించటంలో ఆశ్చర్యమేముంది. ఇది రాబోయే సుందరకాండ వృత్తాంతానికి ద్యోతకం. అక్కడా ఇక్కడా హనుమంతుడే ప్రధానపాత్ర. స్వయంప్రభను చూచాడంటే ముందుగా సీతనే చూచాడని అర్థం. స్వతహాగా ప్రకాశించేదేదో అది స్వయంప్రభ. మహా పతివ్రత అయినసీత నిజంలో స్వయంప్రభే. ఈ స్వయంప్రభలాగా ఆ స్వయంప్రభ కూడా ఎక్కడో ఒక విచిత్రమైన వన మధ్యంలో ఏకాంతంగా నివసిస్తున్నది. ఈ విధంగా ఆవిడా తపస్సు చేస్తున్నది. ఆ ప్రదేశం పరాయి వారెవరికీ కూడా దుర్గమమూ, దుర్భేద్యమూ, అయినా అక్కడా ఇక్కడా దాన్ని భేదించిన గౌరవం ఒక్క హనుమంతుడికే దక్కింది. స్వయంప్రభ ఎంతో ప్రేమతో మాట్లాడటమూ, ఫల మూలాదుల నుపయోగించటాని కనుమతించటమూ, ఇదికూడా తరువాత సీత అశోకవనంలో అతణ్ణి వాత్సల్యంతో చూడటమూ, ఆవిడ అనుజ్ఞతోఅతడు అశోకవనంలోని పండ్లు తిని తన ఆకలి తీర్చుకోవటమూ మనకు జ్ఞప్తికి తెస్తాయి. మయుడు నిర్మించినదే అయినా ఆ వనమూ, భవనమూ మయుడికి దక్కకుండా పోవటం కూడా చూస్తే ఇక్కడా మయుడి కుమార్తె అయిన మందోదరికా లంకా వైభవం దక్కబోదనే సూచన. ఇలా సాంకేతికంగా తరువాతి సుందరకాండ సన్నివేశంతో ఎంతో చక్కగా ముడిపడి ఉన్నట్టు తోస్తుంది ఈ సన్నివేశం భావుకుడి మనస్సుకు.

  పోతే ఇక సుందరకాండలో హనుమంతుడు సముద్ర లంఘనం చేస్తుంటే ఆయనకెదురైన సురసా సింహికా, మైనాకాది ఘట్టాలన్నీ చిన్నవైనా అవికూడా సాభిప్రాయమే. రామకార్యం కోసం వెళ్లుతున్నాడు హనుమంతుడు. రామకార్యమంటే అది దేవకార్యమే. తమ కార్యం నెరవేరుతుందో లేదో పరీక్షించాలనుకొన్నారు దేవతలు. అందుకే హనుమంతుడి మార్గంలో అవరోధాలు కల్పించారు. వాటికి జవాబు చెబుతాడో లేడో చూతామని చెప్పాడు హనుమంతుడు గ్రహించారు దేవతలిక తమ కార్యం తప్పక నెరవేరుతందని. అలాగే లంకిణి వృత్తాంతం కూడా సుందరలోనే వస్తుంది. అది హనుమంతుడు తప్పకుండా సీతనే చూచి పచ్చాడని రాముడు నమ్మటానికి పనికి వస్తుంది. అంతేగాక రాముడి లోకోత్తర పరాక్రమాన్ని కూడా

Page 93

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు