రాక్షస సంహారమూ, సీతా పునఃప్రాప్తి, అది రాముడి కీర్తి ప్రతిష్ఠలకే భంగకరం. ఇప్పుడో సప్తసాలాలను ఒక్క బాణంతో పడగొట్టడమూ, దుందుభికాయాన్ని గోటమీటి బహుయోజన దూరం పారజిమ్మటమూ, వాలినొక్క కోల గూలనేయటమూ, ఇలాంటి పరాక్రమ చర్యలు సుగ్రీవ ప్రత్యయార్థమనే నెపంతో ప్రదర్శించినా తద్ద్వారా భంగ్యంతరంగా కథానాయకుడి అనన్య సామాన్యమైన బలపరాక్రమాలను చాటినట్టయింది. మరొక విధంగా ప్రతినాయకుడైన రావణుణ్ణి జాగ్రత్త నీ పరాజయం కూడా అవశ్యం భావి అని హెచ్చరించినట్టు అయింది. ఎందుచేతనంటే వాలిచేతిలో అంతకు ముందొకప్పుడోడిపోయాడు రావణుడు. ముప్పుతిప్పలు పెట్టి వాలి అతణ్ణి మూడు చెరువుల నీళ్లు త్రాగించాడు. అది బాగా జ్ఞాపకముందా దానవుడికి. అలాంటి వాలినెప్పుడు పడగొట్టిందో రామబాణం ఆ బాణానికిక తన ప్రాణాలు కూడా త్వరలోనే దాణా అయిపోవటం తథ్యమని ఆ మాత్రం గ్రహించలేడా అతడు. ఈ విధంగా భావి కథా గమనానికి, కథానాయకుడి ఉదాత్తతకూ, ఎంతగానో తోడ్పడుతూ తద్వారా కథతో అల్లిబిల్లిగా అల్లుకుపోతున్నదీ సుగ్రీవోపాఖ్యానం.
మరి కిష్కింధలో అద్భుతమైన ఒక ఘట్టం మనకు తారసిల్లుతుంది. అది స్వయంప్రభా వృత్తాంతం. మేరుసావర్ణి కూతురీ స్వయంప్రభ. మయుడనేవాడు హేమ అనే అప్సరసను కామిస్తే ఇంద్రుడది సహించలేక వాణ్ణి వజ్రంతో ప్రహరిస్తాడు. అతడంతకు పూర్వం నిర్మించిన ఒక విచిత్రమైన గుహ అందులో ఒక దివ్యభవనమూ, దానిచుట్టూ మనోహరమైన ఉద్యానవనమూ, ఆ హేమకు అప్పగిస్తాడు. ఆవిడ స్నేహితురాలీ స్వయంప్రభ. హేమ మీది అనురాగంతో దాన్ని కాపాడుతూ అక్కడ బ్రహ్మచారిణి అయి దీర్ఘకాలం ఒంటరిగా తపస్సు చేస్తుంటుంది. హనుమదాది వానరులంతా సీతాన్వేషార్థం దక్షిణ దిక్కుకు పోయి అక్కడక్కడా తిరుగుతూ తెలియక ఆ గుహలో ప్రవేశిస్తారు. మరలా నిష్క్రమించే మార్గం తెలియక కలవరపడతారు. క్షుత్పిపాసా పరవశులై కూడా అక్కడ అయాచితంగా దొరికే ఫలమూలాదుల నుపయోగించరు. తరువాత స్వయంప్రభ వారికి దర్శనమిచ్చి తన కథ చెప్పి వారి రాకను గూర్చి ప్రశ్నిస్తుంది. హనుమంతుడు పూసగ్రుచ్చినట్లు తమ కథ అంతా ఏ కరువు పెడతాడు. రామకార్యమనగానే సంతోషించి ఆవిడ వారికి ఫలమూలాదులను భక్షించటాని కనుమతి ఇచ్చి వారు కోరితే బిలనిర్గమన మార్గం చెప్పి వారితో పాటు కొంతదూరం వచ్చి సాగనంపుతుంది.
Page 92