#


Index

అంగాంగి భావము

  పోతే ఇక కిష్కింధలో సుగ్రీవ వృత్తాంతం. ఇది ప్రాసంగికాలలో చాలా పెద్ద ప్రాసంగిక కథ. ప్రధాన కథతో చాలాదూరం చేతులు కలిపి నడుస్తుంది. రామాయణం మూడు కాండలు గడిచేవారకూ రాని ఈ వృత్తాంతం ఆ తరువాత మూడు నాలుగు కాండలదాకా దానితో అవినాభావంగా సాగుతుంది. రామ సుగ్రీవులిద్దరూ సూర్యవంశీయులే. ఇద్దరూ సౌమ్యస్వభావులే. నిర్దోషులే. అయినా ఇద్దరూ తమ సోదరుల వల్లనే దెబ్బతిన్నారు. అన్యాయంగా రాజ్యభ్రష్టులయినారు. అడవుల పాలయినారు. అంతేగాక ఇద్దరూ అపహృత భార్యులే. మరలా తమ భార్యలను పొందాలనే ఆకాంక్షతో ఉన్నారు ఒకరి సహాయం ఒకరికి ఎంతైనా అవసరం. సుగ్రీవుడు స్వయంగా బలవంతుడు. అంతకన్నా బలవంతులైన హనుమజ్జాంబవదాదు లతనితో ఉన్నారు. దేశ దేశాలు తిరిగి అన్ని దిక్కుల ఆనుపానులూ తెలిసినవాడు. సీతా వృత్తాంతం రాముడి కందించటానికి సందేహం లేదు. మరి రాముడో. సాక్షాత్తూ ఆదినారాయణుడి అపరావతారం. అప్రతిహత పరాక్రమ సంపన్నుడు. వాలి అవరోధాన్ని తొలగించి సుగ్రీవుణ్ణి అవలీలగా పదస్థుణ్ణి చేయగలడు. పత్నీ వియోగము పాపగలడు. కనుకనే దైవికంగా ఒకరికొకరు తటస్థ పడ్డారు.

  మరొక విషయమేమిటంటే సుగ్రీవోపాఖ్యానం ద్వారా కథకూ కథానాయకుడి పాత్రకూ ఎంతో పుష్టి చేకూరుతున్నది. సీతాదేవి తన ఆభరణాలు అంత తొందరలో తీసి పడవేసినా ఆ మూట సుగ్రీవాదుల సన్నిధిలోనే పడవేసింది. ఇది రామలక్ష్మణు లక్కడికే వస్తారనేందుకు సూచన. కబంధుడు స్వస్వరూపాన్ని ధరించి దివ్యదృష్టితో చూచి చెప్పినప్పుడు కూడా వాలి సుగ్రీవులలో వాలిని పరిహరించి సుగ్రీవుడితోనే సఖ్యం చేయమని చెప్పటం కూడా రాబోయే ఈ సంఘటన విధి నిర్ణయమని సూచించటమే. మరి హనుమంతుడితో సాంగత్యమూ అతడు వెళ్లి సీతను సందర్శించటమూ వానర బలంతో వెళ్లి రాక్షస సంహారం చేయటమూ ఇలాంటి సందర్భాలన్నీ కథలో తరువాత జరగాలంటే సుగ్రీవుడితో మైత్రి చేస్తేనే సంభవం. వాలితోనే చేయవచ్చు గదా అంటే అప్పుడు కథ ఇలా నడవదు. ఆ నడకే వేరవుతుంది. దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసమవతరించాడు రాముడు. వాలితో సఖ్యం చేస్తే అవి రెండూ దెబ్బ తింటాయి. భగవదవతార ప్రయోజనమే విఫలమవుతుంది. విరుద్ధమని కూడా అనిపించుకొంటుంది. అంతేకాక వాలి దయాధర్మ భిక్షమవుతుందప్పుడు

Page 91

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు