తెలిపి సహాయం చేస్తుంది. ఇలా వీరిరువురి కథా ప్రధాన కథా ప్రయోజనానికెంతో ఉపకరిస్తున్నది.
పోతే మరొకటి కబంధుడి కథ. కబంధుడు కనిపించే ముందు అయోముఖి అనే రాక్షసి ఒకతి దర్శనమిస్తుంది. తన్ను పెండ్లాడమని బలవంతం చేస్తుంది రాముణ్ణి. దాన్ని వధించి ముందుకు సాగిపోతారు రామలక్ష్మణులు. అప్పుడు కనపడతాడీ కబంధుడు. పేరే చెబుతుంది వాడి రూపమెంత వికృతమైనదో. అశిరోగ్రీవుడటవాడు. వట్టి మొండెం మాత్రమే. శిరస్సు పాదాలు పొట్టలో ఇమిడి ఉన్నాయి. ఒకే ఒక కన్ను. అదీ కడుపులోనే. దానితో చూచి ఎక్కడెక్కడ ఉన్న మృగపక్షి సరీసృపాలను ఆకర్షించి భక్షిస్తుంటాడువాడు. రామలక్ష్మణులను అటకాయించి భక్షించబోతాడు. వారతని బాహువులు ఖండించి హింసించి మర్దిస్తే వాడప్పుడు తెలుసుకొని అయ్యా మీరు రామలక్ష్మణులు గదా ! స్థూలశిరుడనే మహర్షి శాపంవల్ల నేనిలా అయిపోయాను. నాకాయన మీ దర్శనమే శాపమోక్షంగా ప్రసాదించాడు. మీరీ నా శరీరాన్ని ఒక గొయ్యి తీసి అందులో పాతిపెట్టండి నాకు స్వస్వరూపం వస్తుంది. అప్పుడు మీకు నేననాగత విషయమంతా మనవి చేస్తానంటాడు. వారలాగే చేస్తారు. అతడు పూర్వస్మృతి వచ్చి సీతాహరణ వృత్తాంతం చెప్పి కిష్కింధకు వెళ్లి సుగ్రీవుణ్ణి దర్శించండి అతనితో సఖ్యం చేయండి. మీ కార్యం నెఱవేరుతుందని సలహా ఇస్తాడు. పైగా దారిలో మతంగాశ్రమం వస్తుంది. అక్కడ శబరి మీ దర్శనంకోసం వేచి ఉంది వెళ్లమంటాడు. ఇదంతా చాలా సాభిప్రాయంగా జరిగిన సందర్భం. ఇంతకు ముందు జరిగిన విరాధ ఘట్టానికి దీనికి కొంత సారూప్యము, కొంత వైరూప్యము కూడాఉంది. అది సీతాపహరణానికి ముందు ఎదురైన ఉపద్రవం. ఇది ఆ తరువాత ఎదురుపడ్డది. అది తరువాత రావణుడు చేయబోయే సీతాపహరణానికి సూచకమైతే ఇది ఆవిడ నారాక్షసుడి బారినుంచి విడిపించే మార్గానికి ద్యోతకం. మధ్యలో వచ్చే అయోముఖీ వృత్తాంతం శూర్పణఖా వ్యవహారానికి సంకేతం. పోతే విరాధుడూ శాపగ్రస్తుడే కబంధుడూ శాపగ్రస్తుడే. ఇద్దరూ రాముడిచేత విముక్తి పొంది రాముడికి మేలు చేయటానికే కనిపెట్టుకొని ఉన్నారు. ఇలా రామకథతో ఓతప్రోతమై ఉన్నవీ రెండుకథలూ.
Page 90