#


Index

అంగాంగి భావము

ముడిపడి ఉన్నది విరాధ వృత్తాంతం. భావికాండత్రయ వృత్తాంత ప్రాసాదానికిది ఒక విధంగా ప్రవేశ ద్వారం.

  జటాయువు వృత్తాంతం మరొక చక్కని సన్నివేశం. 'ఉవాచ వత్స మాంవిద్ధి వయస్యం పితు రాత్మనః' అంటుందది రాముడితో. నేను మీ తండ్రి గారికి సవయస్కుడిని ఆయనకు స్నేహితుడి నంటుంది. దశరథుడికి దానికి ఈ స్నేహ మెప్పటిదో ఏమో మనకు తెలియదు. తెలియనివ్వ లేదింతవరకూ వాల్మీకి. ఇప్పుడే తెలుస్తున్నది రహస్యం మనకు. ఇంతవరకూ మూసిపెట్టి ఇప్పుడు తెరదీసి చూపటంలో ఏమిటి కవి ఉద్దేశం. ఇంతవరకూ సందర్భం రాలేదు అవసరము లేదు. మరి ఇప్పుడే దాని అవసర మేర్పడింది. అందుకే ఇప్పుడే ప్రవేశించిందా పాత్ర. తండ్రి స్నేహితుడననే మాట వినగానే 'సతంపితృసఖం బుద్ధ్వా పూజయామాస రాఘవః’ దాన్ని ఎంతగానో సత్కరించాడట రాముడు. దాని పూర్వవృత్తాంత మడిగితే అంతా ఏకరువు పెడుతుంది. తన అగ్రజుడు సంపాతి అనే మాటకూడా అంటుంది. కాని అతడెక్కడ ఉన్నాడో తానిక్కడ ఎందుకున్నాడో అది మాత్రం చెప్పదు. ఆ వృత్తాంతం తరువాత సుందరకాండలో హనుమదాదులు సంపాతిని చూచినప్పుడు దాని మాటలలో బయటపెడతాడు కవి. అప్పుడు దాని అవసరం వస్తుంది. ఇప్పుడా విషయం చెప్పనవసరం లేదు. ఎప్పుడెంత అవసరమో అంతే మాట. ఇదే కవి కథా కథన శిల్ప రహస్యం. అంతేకాదు 'సోహం వాస సహాయస్తే భవిష్యామి యధీచ్ఛసి ఇదమ్ దుర్గంహి కాంతారమ్ - మృగ రాక్షస సేవితం - సీతాంచ తాత రక్షిష్యే త్వయియాతే సలక్ష్మణే' నీకు నేనెంతో సహాయంగా ఉంటాను. ఈ అరణ్యంలో రాక్షసుల బాధ ఎక్కువే. నీవూ లక్ష్మణుడు ఎక్కడైనా పోయి సీత ఒంటరిదైతే నేనావిడకు రక్షణగా ఉండగలనంటుంది. ఇది ఎంత భావ్యార్థ సూచకమైన మాటో చూడండి. అలాగే తరువాత అది అన్నట్టుగానే జరుగుతుంది. అదేగదా రావణుడితో పోరాడి ప్రాణాలు కోలుపోయింది. రాముడికి సీతాపహరణ వార్త చెప్పి తప్పకుండా రావణ సంహారం చేసి ఆవిడను పొందగలవని కూడా ఒక ప్రవక్తలాగా బోధించి ప్రాణాలు విడుస్తుంది. దానికి రాముడే స్వయంగా సంస్కారం చేసి ఉత్తమలోక ప్రాప్తి కలిగిస్తాడు. తమ్ముడిలా మేలు చేస్తే తరువాత దాని అన్న సంపాతి హనుమదాది వానరులు నిరాశులై ప్రాయోపవేశాని కున్ముఖులై ఉంటే వారికి సీత ఉన్నదిశా ఆ ప్రదేశము

Page 89

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు