సుందరంగా తీర్చిదిద్దాడు. ఇదే రామాయణంలోని రామణీయకం. ప్రతీయ మానం పునరస్య దేవ అని ఆలంకారికులు ప్రశంసించిన ప్రతీయ మానత ఇదే. ఈ మహర్షి హృదయాన్ని పట్టుకొనే శక్తి లేక అనాది నుంచి ఆయాకవులు, విమర్శకులు, తలకొక రీతిగా ఈ గ్రంథాన్ని గూర్చి తలపోస్తున్నారు. చర్చిస్తున్నారు. విమర్శిస్తున్నారు. తమ భావాల కనుగుణంగా ఇష్టం వచ్చినట్టు మార్పులు చేస్తున్నారు. అలా చేయటమే గాక అసలు వాల్మీకి తన కావ్యాన్ని వ్రాయటమే సరిగా వ్రాయలేదు. కథలో పాత్ర పోషణలో సన్నివేశ కల్పనలో, ఎన్నో అవకతవకలు, అన్యాయాలు, చోటు చేసుకుంటున్నాయి. దానికి తోడు అసహజమైనవీ సమాజానికి పనికిరానివి, అతిసంకుచితమైనవి, ఎన్నెన్నో భావాలు దొర్లుతూ వచ్చాయని నోటికి వచ్చినట్టల్లా చాటుతున్నారు. చివరకు తమ అభిప్రాయాలు, ఆక్షేపణలు, వెల్లడి చేస్తూ ఎన్నో వెట్టి మొట్టి వ్రాతలు కూడా వ్రాసి వెదజల్లుతున్నారు.
ఇదంతా ఒక మహాకవి వివక్షితాన్ని ఏ మాత్రము అవగాహన చేసుకోలేని మక్షికా సదృశచిత్తుల మహోన్నత్త ప్రలాపం. అసలు వాల్మీకిని నిదానంగా లోతుకు దిగి సాకల్యంగా అర్ధం చేసుకోగలిగితే ఏ విమర్శగాని ఎంతవాడు కూడా చేయటానికి సాహసించడు. మీదు మిక్కిలి తన అవివేకానికి సిగ్గుపడి వెనుకకు తగ్గుతాడు. కాకపోయినా ఒక క్రాంతదర్శి అయిన మహర్షి అంత అవకతవక రచన చేశాడని గాని, చేస్తాడనిగాని మనం భావించటం దేనికి. అలాచేస్తే అతడు మహర్షి ఎలా అవుతాడు. మహర్షే కాకుంటే మహాకవి అసలే కాడు. వాల్మీకిని మహర్షి మహాకవి అని ఇంతకాలం నుంచి లోకమంతా ప్రశంసిస్తూ ఆయన రామాయణాన్ని నెత్తిన బెట్టుకొని ఊరేగుతున్నదంటే అది ఎంత ఉదాత్తమైన రచన అయి ఉండాలి. ఇది ఒక్కటే చాలు ఆ రచనెంత సర్వోత్కృష్టమైనదో సాక్ష్యమివ్వటానికి. దేశకాలాలే నిర్ణయిస్తాయి ఒక వస్తువుకున్న మూల్యాన్ని. అది రామాయణ మహాకావ్యానికెంత ఉండాలో అంత ఉంది. నెత్తిన బెట్టుకొనే వారే గాక
Page 9