క్షత్రియుడు రాజర్షి అయి రాజర్షి బ్రహ్మర్షి ఎలా అయ్యాడో తెలిసింది. క్షత్రియుడి వరకూ తామసం. రాజర్షి అయితామసం వదలినా రాజసం వదలలేదు విశ్వామిత్రుడికి. అది సాత్త్వికంగా మారినప్పుడే అతడు బ్రహ్మర్షి అయ్యాడు. దీనిని బట్టి సత్త్వగుణమనేది ఎలా అలవరచుకోవాలో అర్ధమయింది శిష్యుడికి. అంతేకాదు. ఒక మానవుడి జీవితం ఎన్ని ఒడుదుడుకులతో ఎంత ఉచ్ఛావచంగా నడుస్తుందో దాని సమగ్ర స్వరూపమే గురువుగారి జీవితం. అది ఒకరి ద్వారా విన్నప్పుడందులోని గుణాలను మాత్రం తీసుకొని దోషాలను త్రోసివేయాలి నిజమైన శిష్యుడు. 'యాన్యస్మాకం సుచరితాని తాని సేవితవ్యాని నో ఇతరాణి' అని గదా వేదవచనం. ఇక్కడ ఈ గురువుగారికథలో ధనలోభము, దర్పము, దురాగ్రహము, ఇంద్రియ లోలత్వము ఇలాంటి అవలక్షణాలు ఎలా వదులుకోవాలో తెలుసుకోవాలి రాముడు. అలాగే ఉత్తమ ఆదర్శ కల్పనా, దాన్ని సాధించాలనే దీక్షా, భూతదయా, పరోపకార బుద్ధి, స్వదోష గ్రహణము, పశ్చాత్తాపము, శమదమాద్యభ్యాసము, లక్ష్యసాధనము ఇలాంటి గొప్ప లక్షణాలనెలా అలవరచుకోవాలో కూడా గ్రహించాలి. అందుకే ఈ కథ ఇంత దూరమేకరువు సెట్టించటం. ఒక్కమాటలో చెబితే విశ్వానికమిత్రుడుగాక మానవుడు విశ్వామిత్రుడయి ప్రతిష్ఠ పొందాలని లోకానికి చాటే సందేశమిది. ఆ పేరులోనే ఉందా సంకేతం కూడా.
బాలకాండ చివరలో పరశురాముడి ఘట్టమొకటి వస్తుంది. ఇది ఒక చిన్న సన్నివేశమే అయినా ప్రధానేతి వృత్తానికెంతో ఉపోద్బలకమయింది. ఒక అవతార ప్రయోజనం తీరిపోయి మరొక అవతారం రావటాన్ని సూచిస్తుందిది. శివధనుర్భంగం చేశాడంటే రాముడు శ్రీమహావిష్ణువు అంశే సందేహం లేదు. లేదని తెలుసుకొనే వచ్చాడు పరశురాముడు. కోపవ్యాజంతో వైష్ణవ ధనుస్సు ప్రదానం చేసి వెళ్లిపోయాడు. అప్పటికి రాముడికి వైష్ణవమైన తేజం సంపూర్ణంగా లభించింది. దానితో రాబోయే రాక్షస సంహారం, దేవకార్యసిద్ధి, తప్పనిసరనే భావం కూడా చెప్పకుండానే చెప్పినట్టయింది. ఇంత జరిగినప్పుడిక రాముడయోధ్యలోనే ఎలా ఉండగలడు. దశరథుడెంత తన వద్ద నిలుపుకోవాలన్నా నిలిచే వ్యవహారం కాదు. అది దశరథుడి శాప వృత్తాంతంలోనే ఇమిడి ఉన్న రహస్యం. ఇది ఒక చిన్న ఉపాఖ్యానం. రామాదులు జన్మించక ముందునుంచి దశరథుడి హృదయంలో దాగి ఉన్న రహస్యమిది.
Page 87