#


Index

అంగాంగి భావము

  పోతే ఇక మిథిల చేరిన తరువాత జనకుని సదస్సులో శతానందుడు రాముడికి విశ్వామిత్రుణ్ణి గూర్చి ప్రశంసిస్తూ ఆయన పూర్వ వృత్తాంతమంతా వివరంగా చెబుతాడు. అంతకుముందు కూడా విశ్వామిత్రడు తన కథ కొంత చెబుతాడు రాముడికి. అయితే అదివేరు. ఇది వేరు. అందులో వసిష్ఠుడితో అతను పడ్డ తగాదా, తపశ్చర్యా, మేనకా వృత్తాంతము, తపోభంగము, ఇలాంటి విషయాలేవీ లేవు. అవి గురుస్థానంలో ఉన్న విశ్వామిత్రుడి చేత చెప్పించగూడదు. సమంజసం కాదు. సందర్భము కాదు. పోతే ఆ దాచి ఉంచిన అంశాలన్నీ ఇక్కడ శతానందుడి చేత పలికించటంలో ఎంతైనా సందర్భశుద్ధి ఉంది. ఔచిత్యముంది. ఏమిటా ఔచిత్యం. ఇక విశ్వామిత్రుడెంతో కాలం కనిపెట్టుకొని ఉండడు రాముణ్ణి. కొద్ది రోజులలోనే కనుమరుగై పోబోతున్నాడు. సీతా కళ్యాణం కావటమే తరువాయి. ఇక ఆ గురువు కనపడడు శిష్యుడికి. ఈ లోపలనే శిష్యుడు గురువువల్ల గ్రహించవలసిన ధర్మాలన్నీ గ్రహించాలి. అతని మాటలద్వారానే కాదు. జీవితంద్వారా కూడా. అతని జీవితమెలాంటిదో అతడు చెబితే సొగసు లేదు. అందులో ఎంత నమ్మదగనిదో నమ్మదగిందో నిర్ణయించటం కష్టం. అందుకే శతానందుడి నోట వినిపించిందది. ఏమిటా జీవితం. సర్వతోముఖమైన మానవుడి జీవితమది రాజవంశంలో జన్మించి రాజసంగా బ్రతికాడు విశ్వామిత్రుడు. వసిష్ఠుడిలాంటి బ్రహ్మవేత్తతో బ్రహ్మర్షితో తగవుకు దిగాడు. అతడి వల్ల ఆతిధ్యం పొంది కృతజ్ఞత చూపటానికి బదులు అతడి సొత్తుమీదనే కన్నువేశాడు. రాజును గదా నాకెదురేముందని భావించాడు. కాని ఎదురయిందొక మహాశక్తి. అది ఆ వసిష్ఠుడి బ్రహ్మదండమే. మంత్రదండంలాగ పని చేసిందది. దానికి తన దేహబలము, సైన్యబలము, అస్త్రబలము ఏదీ జవాబు చెప్పలేక పోయింది. అది ఏదో దాన్ని సాధించాలని కాంక్షించాడు. పట్టుదలగా తపస్సు చేశాడు. బ్రహ్మాదిదేవతలు ఆయనను రాజర్షి అని ప్రశంసిస్తారు. అయినా తృప్తి లేక తపస్సు కొనసాగించాడు. మధ్యలో త్రిశంకుడనేవాడు సశరీరంగా స్వర్గానికి వెళ్లాలని వసిష్ఠుణ్ణి, వసిష్ఠ కుమారులను బ్రతిమాలితే వారు ఆర్త్విజ్యాని కొప్పుకోరు. వారాయనను కోపంతో నీవు చండాలుడవయి పొమ్మని శపిస్తారు కూడా అతడు సరాసరి వచ్చి విశ్వామిత్రుణ్ణి శరణు వేడితే వసిష్ఠుడి మీది పంతంతో అతడి కొక నూతన స్వర్గాన్ని నిర్మించి అందులో నిలుపుతాడు విశ్వామిత్రుడు. తరువాత దక్షిణ

Page 85

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు