#


Index

అంగాంగి భావము

  ఏమిటి కథ. పైకి చూస్తే ఎంత అశ్లీలమిది. ఏదో ఒక అంతరార్థం లేకపోతే ఇది ఒక మహర్షి వ్రాయడు. మరొక మహర్షి చెప్పడు. కథలన్నీ అర్థవాదాలేనని మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాము మనం. ఒక సత్యాన్ని చాటేందుకవలంబించే సంకేతాలవి. సంకేతితమైన అర్ధాన్ని పట్టుకోవాలి గాని మనం సంకేతాన్ని గాదు. అందులో ఆధిభౌతికస్థాయిలో ఒకటీ, ఆధ్యాత్మిక స్థాయిలో ఒకటి రెండర్థాలు గోచరిస్తున్నాయి. హల్య కానిదేదో అది అహల్య. హల్య అంటే హలంతో లేదా నాగలితో దున్నదగింది. దున్నటానికి యోగ్యంకానిది అహల్య. అంటే పర్వత ప్రదేశం. అది గౌతముడి కధీనం. గోతముడే గౌతముడు. గో అంటే తేజస్సు. తేజస్వంతమైన గ్రహాలలో శ్రేష్ఠతముడు సూర్యుడు. ఆయన కిరణాలు నిరంతరమూ ప్రసరిస్తుంటాయి ఆ పర్వత ప్రాంతంలో దానిమీద వర్షించబోయాడు ఇంద్రుడు. ఇంద్రుడు మేఘాధిపతి. అతడువృషణ సంపన్నుడు. వర్షించే స్వభావమే వృషణత్వం. అందుకోసం ఓ పర్వతమూ దాన్ని ఆకర్షిస్తుంది. అదీ ఆకర్షించబడుతుంది. సూర్యతేజస్సు మేఘాలతో దూరంచేసి వర్షించాడా అహల్యమీద. తరువాత సూర్యతేజం కనిపించింది. నీవు వర్షించినా ప్రయోజనం లేదది పంటలు పండే భూమికాదు. అహల్య అని మందలించింది వర్షాధిపతిని. ఇదే 'అఫలస్త్వం భవిష్యసి' అని శాపమివ్వటం. పోతే నీ వదృశ్యవై పొమ్మని అహల్యను శపించటం ఎవరికీ అగమ్య గోచరంగా దుర్గమంగా పర్వతాగ్రాలలో పడి ఉండటమే. శిలవై పొమ్మని పద్మపురాణంలో మరొక పాఠం కనిపిస్తుంది. పర్వతమంటే శిలోచ్చయమే కాబట్టి అదీ సరిపోయే మాటే. అహల్య తపస్సుచేత శుద్ధి కావటమనేది కూడా సూర్యరశ్మిచేత ఉష్ణత్వాన్ని పుంజుకొని మరలా జలధారలను ప్రసరింపజేయటమే. అదే జీవులకు శతానందప్రదాయకం.

  భౌతికంగా ఇదైతే తాత్త్వికంగా మరో అర్ధం చెప్పవచ్చు. హల్యకానిది భగవన్మాయ. అదే గౌతముడి కెప్పుడూ అధీనం. గౌతముడిక్కడ జ్యోతిషామపి తత్ జ్యోతిః అనే భగవానుడే. జీవులకది అగమ్య. జీవుడే ఇంద్రియాధిపతి ఇంద్రుడు. అతడనవసరంగా ఈశ్వరమాయలో ప్రవేశించాడు. మాయావివర్తమే ఈ చరాచర ప్రపంచం. ఇది మన కహల్య - అగమ్య అయినా చాపల్యంకొద్దీ ప్రవేశించాము ఇందులో. మన ఇంద్రియాలు శబ్దాదులను కోరితే, శబ్దాదులీ ఇంద్రియాల నాకర్షిస్తుంటాయి. ఇదే అహల్యా సంక్రందనం. ఆత్మారాముని మరచిపోయి ఈ

Page 83

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు