కౌస్తుభం ఇలా క్రమంగా జన్మిస్తూ కడపట అమృతమే జనిస్తుంది. అది విష్ణువు తన మాయాబలంతో హరించి ఆదిత్యులకిస్తే వారు దానిబలంతో దైత్యులనందరినీ మట్టుపెడతారు. అది చూచి దుఃఖిత అయి దితి ఇంద్రుని హతమార్చగల పుత్రుణ్ణి ప్రసాదించమని కశ్యపుణ్ణి ప్రార్థిస్తే ఆయన ప్రసన్నుడై వర్ష సహస్రానికి అలాగే త్రిలోకాలనేలే పుత్రుడు జన్మిస్తాడని దీవిస్తాడు. ఆవిడ సంతసించి కుశప్లవంలోతపస్సు చేస్తుంటే ఇంద్రుడది కనిపెట్టి పరిచర్య చేసే నెపంతో ఆవిడ గర్భం నిర్భేదిస్తాడు. సప్తధా నిర్భిన్నమైన ఆ గర్భంనుంచి సప్తమారుతులు జన్మిస్తారు. వారు జన్మించిన స్థానమది. తరువాత ఇక్ష్వాకువనే రాజుకు అలంబుసయందు జన్మిస్తాడొకడు. వాడిపేరు విశాలుడు. అతడి పేర నిర్మించిన పురమే ఈ విశాలపురం. ఇక్కడ అనేకరాజులు రాజ్యంచేయ చివరకిప్పుడు సుమతి అనేవాడు పాలిస్తున్నాడు. అని చెప్పి ఈ రాత్రి కతని దగ్గర విడిది చేస్తామని చెప్పి అందరూ అక్కడికి వెళ్ళతారు. అతడు వారి వృత్తాంతమడిగి తెలుసుకొని అతిథి సత్కారాలన్నీ చేస్తాడు. ఇందులో కూడా ఒక ఉత్తమ రాజవంశాన్ని గూర్చి వినటమూ, ఉత్తమచరితుడైన ఒకరాజును దర్శించి అతని మన్ననలు పొందటమూ, రాముడి భావిజీవితాన్ని తీర్చిదిద్దటానికే గాని వేరుగాదు.
పిమ్మట ఆ పట్టణాన్ని గడచి వెళ్లుతుంటే మిథిలోపకంఠంలో ఒక పురాతన నిర్జన ఆశ్రమం కనిపిస్తుంది వారికి. ఇది ఏమిటి ? ఎవరిదని ప్రశ్నిస్తాడు రాముడు. ఇది పూర్వం గౌతమమహర్షి ఆశ్రమమని చెబుతూ విశ్వామిత్రుడు ప్రసంగవశాత్తూ అహల్యా సక్రందన వృత్తాంతాన్ని వర్ణిస్తాడు. అహల్య గౌతముడి భార్య. ఆవిడ ఇంద్రుణ్ణి ఇంద్రుడావిడనూ ప్రచ్ఛన్నంగా మనసులలో కామిస్తూ వచ్చారు. దైవికంగా అవకాశం దొరికితే దాన్ని చక్కగా ఉపయోగించుకొన్నా రిరువురూ దైవికంగానే బయటపడి గౌతముడి కోపానికి శాపానికి గురి అవుతారు. ఇంద్రుడఫలుడూ లేదా అవృషణుడూ అయితే, అహల్య అదృశ్య అయి అక్కడే నిలిచి పోతుంది. గౌతముడాశ్రమం విడిచి వెళ్ళతాడు. రాముడు ఆశ్రమాన్ని ప్రవేశించగానే ఆయన స్పర్శ సోకి అదృశ్య రూపంగా తపస్సు చేస్తున్న అహల్య దృశ్యమాన అవుతుంది. రాముణ్ణి అర్ఘ్యపాద్యాలతో పూజిస్తుంది. అది ఎఱిగి తిరిగి వచ్చి గౌతముడు తపోవిశుద్ధ అయిన తన పత్నిని పరిగ్రహిస్తాడు.
Page 82