పరమేశ్వరానుగ్రహంతో పితరులను గంగాజలంతో తరింపజేస్తాడు. గంగ మూడు లోకాలలో మూడు పాయలై ప్రవహించి త్రిపథగ అని ప్రసిద్ధి కెక్కుతుంది.
గురువుగారీ కథ చెప్పి ముగించేసరికి బాగా చీకటి పడింది. “తస్యసాశర్వరీ సర్వా, సహ సౌమిత్రిణా తదా జగామ చింతయానస్య విశ్వామిత్రకథాం శుభామ్” రాముడు గురువు చెప్పిన కథను తనలో తాను భావిస్తూనే నిద్రపోయాడట. భావించటానికేముంది ఇందులో. ఏముందో ఇంతకుముందే సూచించాము. వంశంలో పనికిరానివాడూ పుడతాడు. పనికి వచ్చేవాడూ పుడతాడు. ఆత్మహితము, లోకహితము సాధించినవాడే మహనీయుడు. దేశమేలే రాజన్యులకది అవశ్య సంపాదనీయమైన గుణం. యథారాజా తథాప్రజా అని గదా ఆర్యోక్తి. విశ్వశ్రేయమైన కార్యాన్ని సాధించటంలో ఎన్ని అవాంతరాలైనా రావచ్చు. చివరకు తన జీవితమే అంతమై పోవచ్చు. కాని ఎప్పటికైనా దాన్ని సాధించే అవకాశం లేకపోదు. అది వంశంలో అటూ ఇటూ ఎన్నో తరాలవారిని తరింపజేస్తుంది. లోకంలో శాశ్వతమైన పేరు ప్రతిష్ఠలు తెస్తుంది. ఇది రామలక్ష్మణుల కొక చక్కని ప్రబోధం. సగరవంశం వారి వంశమే కావటం. సాగరమనేది సగరపుత్రులవల్లనే ఏర్పడటం, సాగరసంగమ అయిన గంగ తద్వంశీయుడైన భగీరథునివల్లనే అవతరించటం ఈ గంగాసాగరాలు తరువాత రామచరితంతో ముడిపడి ఉండటం, గమనించదగిన అంశాలు. సాగరాన్ని దాటే వెళ్లాడు హనుమంతుడు. అతని కాతిథ్యం చేయాలని మైనాకుణ్ణి పురికొల్పుతాడు సాగరుడు. పైగా అహమిక్ష్వాకు నాధేన సగరేణ వివర్ధితః-ఇక్ష్వాకు సచివశ్చాయమ్ – కృతేచ ప్రతికర్తవ్య మేష ధర్మః అని తన కృతజ్ఞత ప్రదర్శిస్తాడు. మరి సీతారాములు ఎన్నోమార్లు గంగను దాటి వెళ్లటమూ చివర సీతను గంగాతీరంలోనే వదలివేయటమూ జరిగిందే కదా.
గంగా వృత్తాంత శ్రవణానంతరం గంగాతరణంచేసి అందరూ ఆవలి తీరంలో విశాలానగరాన్ని ఆలోకిస్తారు. అదేమిటా నగరం ప్రస్తుతమక్కడ ఏ రాజవంశం పాలిస్తుందని అడుగుతాడు రాముడు. ఇక దాని చరిత్ర ఎప్పటినుంచో త్రవ్వుకొని వస్తాడు విశ్వామిత్రుడు. పూర్వం దేవదానవులు క్షీరసాగరాన్ని మథించటం దగ్గరినుంచీ ఆరంభిస్తాడు కథ. సాగర మథనంలో అప్సరసల కనేకమంది జన్మిస్తారు. వారినెవరూ పెండ్లాడకపోతే అందరికీ సాధారణ అవుతారు వారు. తరువాత వారుణి ఉచ్ఛైశ్రవం,
Page 81