గంగ జలానికి, హిమవత్పాదమూలం పృథివి పర్యాయమైన అన్నానికి సంకేతాలు. ఈ మూడింటి ద్వారానే అటు బ్రహ్మాండమూ, ఇటు పిండాండమూ, రెండూ సృష్టి కావలసి ఉంది. అందులో శివతేజోమయం కాబట్టి ఒక విశిష్టమైన సృష్టి కుమారస్వామిది. ఇదే రామజననంలో కూడా గర్భితమయి ఉందని క్రిందటి ప్రకరణాలలో మనవి చేసి ఉన్నాను. పోతే ఉమా వృత్తాంతమైన తరువాత ఆవిడ సహోదరి భాగీరథీ వృత్తాంతం చెప్పటం సముచితం. అంతేకాదు గంగావతరణం చేసినవాడు భగీరథుడు. అతడు సగరుడికి ముని మనుమడు. మరి సగరుడెవరో కాదు. సూర్యవంశీయుడు. తన వంశంలో పుట్టిన పూర్వరాజన్యులెంతటివారో, వారెంతటి గొప్పకార్యాలు సాధించారో రాముడు తెలుసుకోవటం, ఆయన కవి ఆచార్య స్థానంలో ఉన్న విశ్వామిత్రుడు తెలపటం, ఎంతైనా సమంజసం తద్వారా పూర్వుల మహోజ్జ్వల చరిత్ర వినటమేగాక అలాంటి ఉత్తమాదర్శాలనందుకోవాలి తన శిష్యుడనే నిగూఢాశయం కూడా ఉందా ఆచార్యుడికి.
సగరుడికి బహుకాలం సంతానం లేక భృగుప్రసాదంవల్ల ఇరువురు భార్యలలో ఒకరికి వంశకరుడైన ఒకే ఒక కుమారుడు, మరొకరికి నష్టజాతకులొక అరువది వేలమంది కుమారులు జన్మిస్తారు. అసమంజసుడనే ఆజ్యేష్ఠుడు జీవితాంతము అసమంజసుడనే అనిపించుకొని పోతాడు. తరువాత సగరుడొక యజ్ఞం చేయతలపెడతాడు. యజ్ఞాశ్వానికి రక్షకులుగా అరువది వేలమంది కుమారులు బయలుదేరుతారు. ఇంద్రుడా అశ్వాన్ని కొనిపోయి పాతాళంలో తపస్సు చేస్తున్న కపిలుడి దగ్గర కట్టివేసి వెళ్లిపోతాడు. సగర పుత్రులశ్వాన్ని వెదకి భూమండలంలో ఎక్కడా కానక చివరికీ భూమినే త్రవ్వి పాతాళం ప్రవేశిస్తారు. సగరపుత్రులు త్రవ్విన ఆ మహాబిలమేతరువాత సాగరమని పేరు గాంచింది. సగరకుమారులు కపిలుడే తమ అశ్వాన్ని దొంగిలించాడని దాడిచేసి కుపితుడైన ఆయనకంటి మంటలోపడి భస్మమవుతారు. అది విని సగరుడు దుఃఖితుడై అంశుమంతుడనే మనవణ్ణి పంపితే అతడు వెతుకుతూ పోయి తండ్రులు భస్మరాసులు చూచి వారిని తరింపజేయాలని గరుత్మంతుడి సలహతో గంగావతరణానికి ప్రయత్నించి చేతగాక కాలధర్మం చెందుతాడు. ఆ పిమ్మట అతని కుమారుడు దిలీపుడు కూడా వ్యాధిపీడితుడై మరణిస్తాడు. అనంతరం అతని పుత్రుడు కులదీపకుడు భగీరథుడా కార్యాన్ని సాధించి
Page 80