#


Index

అంగాంగి భావము

వాహినిలో కలిసిపోతుంటాయి. కథా వస్తువు కవి పుష్టినీ ఉపపత్తినీ చేకూరుస్తూ ఫలసిద్ధి సాధనకెంతో ఉపకరిస్తాయి. మొదట బాలకాండలో విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులను వెంట పెట్టుకొని సిద్ధాశ్రమంవైపు ప్రయాణం సాగిస్తాడు. మార్గమధ్యంలో ఎన్నో కథలూ, కార్కాణాలూ చెబుతూ పోతాడు వారికి. అది వారు కుర్రవాళ్లు కాబట్టి అడిగితే వినోదం కోసమయినా చెప్పవచ్చు. అలాగే అడుగు తుంటారు రామలక్ష్మణులు. భగవన్ శ్రోతుమిచ్ఛావః - పరమ్ కౌతుహలంహినౌ అని. వారిని తనకోసం తీసుకువచ్చాడు కాబట్టి చాలాదూరం నడవటం వల్ల శ్రమ చెందటం సహజం కాబట్టి అది పోగొట్టే నెపంతో అనుభవజ్ఞుడైన గురువుగారు కథలు చెబుతూ పోవటంకూడా లోకసహజమే. అందుకే తయోస్తద్వచనం శ్రుత్వా ప్రహస్యముని పుంగవః అంటాడు కవి. మౌనం వహించేవాడు ముని. అయినా వారి మాటలకు మందహాసం చేస్తూ చెప్పటానికే ఉపక్రమించాడాయన. సిద్ధాశ్రమం చేరే ముందూ చెప్పాడు కథలు. చేరిన తరువాత మరలా మిథిల చేరేలోపలా చెప్పాడు. అవన్నీ కొన్ని దేవతల కథలైతే కొన్ని మహర్షులవైతే, కొన్ని రాజర్షులవైతే, కొన్ని సాక్షాత్తూ మహాదేవుడూ, మహావిష్ణువుకూ సంబంధించిన కథలు.

  అయితే కేవలం ఉబుసుపోకకని చెప్పినా ఈ కథలా మహర్షి రాముడికి చెప్పటంలో ఎంతో అంతరార్థం కూడా ఉంది. రాముడు ఒక సుక్షత్రియ వంశంలో పుట్టాడు. అది సూర్యవంశం. ఆయన ఎవరో కాదు. సాక్షాత్తు విష్ణువే, దుష్టశిక్షణ చేసి తద్ద్వారాశిష్ట రక్షణ కావించవలసినవాడు. మానవుడుగా పుట్టి మానవత్వాన్ని అభినయిస్తున్నాడు. అందులోనూ బ్రహ్మచారిగా తనవెంట వచ్చాడు. ఆయనకు కావలసిన శిక్షణనిచ్చి తీర్చిదిద్ది ఆయనలో దైవత్వాన్ని మేలుకొల్పి ఆయన శక్తితోనే ఆయనకు కళ్యాణం జరిపి ఒక ఇంటివాణ్ణి చేసి చివరికాయన చేయవలసిన ధర్మ సంస్థాపన కాయనను ఉద్యుక్తుణ్ణి చేయాలి. ఇలాంటి పవిత్రమైన కర్తవ్య భారాన్ని స్వీకరించి దాన్ని అడుగడుగునా ధ్వనింపజేస్తున్నట్టుగా భాసిస్తుందా గురువుగారు చెప్పే ప్రతికథా.

  ముఖ్యమైన కథా భాగాలను కొన్నింటిని పరిశీలించి చూతాము. సిద్ధాశ్రమానికి వెళ్లే మార్గంలో మొట్టమొదట కామాశ్రమాన్ని చేరుతారు. ఈ ఆశ్రమం ఎవరిది ఎవరుండే వారిక్కడ అని ప్రశ్నిస్తాడు రాముడు. తెలిసి కూడా అడిగినాడా అనిపిస్తుంది

Page 76

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు