మరి కొన్ని పాత్రలున్నాయి. అవి మొదటి నుంచీ మనకు కనిపించవు. కథ చాలా దూరం సాగిన తరువాత ఎప్పుడో మధ్యలో దర్శనమిస్తాయి. ఇచ్చి ఇక చివరిదాకా అనుసరిస్తూ వస్తాయి. ఇలాంటివే సుగ్రీవ హనుమద్విభీషణాది పాత్రలు. వీరివల్ల మొదట్లో కథానాయకుడికి ప్రయోజనం లేదు. సీతాపహరణం దగ్గరి నుంచీ ఆవిడను మరలా పొంది రాజ్యపాలన చేసేదాక కావలసి ఉంది వారంతా. అందుకే ఉన్నారు వారు చివరదాకా. ఈ విధంగా విమర్శ చేస్తూ పోతే ఎంతైనా ఉంది కథా నిర్మాణంలో దాని నిర్వహణంలో మహాకవి ప్రదర్శించిన రామణీయకం. ఎక్కడి కక్కడ కథా సన్నివేశాలూ వాటిని నడిపే ఆయా పాత్రలూ అన్నీ తన జీవిత లక్ష్యంవైపు పయనించే కథానాయకుడి ఉదాత్త గంభీరమైన ప్రయాణానికి యధోచితంగా దోహదం చేసేవే. అది అనులోమంగా కావచ్చు. ప్రతిలోమంగా కావచ్చు. లక్ష్యాభి ముఖంగా సాగటమే సాగించటమే వాటి ఏకైక ప్రయోజనం. ఇది ఒక అశిధిల బంధ సుందరమైన కథా సంవిధానం.
Page 74